మోదీకి భయపడే ముందస్తు | BJP Amit Shah Public Meeting At Karimnagar | Sakshi
Sakshi News home page

Published Wed, Oct 10 2018 6:27 PM | Last Updated on Thu, Oct 11 2018 3:06 AM

BJP Amit Shah Public Meeting At Karimnagar - Sakshi

బుధవారం కరీంనగర్‌లో బీజేపీ నిర్వహించిన ‘మార్పు కోసం సమరభేరి’లో వేదికపై అభివాదం చేస్తున్న ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా. చిత్రంలో జంగారెడ్డి, దత్తాత్రేయ, చింతల, లక్ష్మణ్, మురళీధర్‌రావు, కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ తదితరులు

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభంజనానికి భయపడే సీఎం కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా విమర్శించారు. 2019 సార్వత్రిక ఎన్నికలతో కలిపి రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే.. ఓడిపోతామనే భయంతో 9 నెలల ముందే అసెంబ్లీని రద్దుచేయాలని కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారన్నారు. బుధవారం కరీంనగర్‌లోని అంబేడ్కర్‌ స్టేడియంలో బీజేపీ నిర్వహించిన ‘మార్పు కోసం సమరభేరి’సభకు అమిత్‌షా ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన భారీ బహిరంగ సభలో కరీంనగర్‌ వేదికగా ఆయన ముందస్తు ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ముందస్తు ఎన్నికల ద్వారా ప్రజలపై కేసీఆర్‌ వందల కోట్ల అదనపు భారం మోపారని ఆరోపించారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌–మేల్లో జరిగే ఎన్నికల్లో ఓడిపోతే.. కొడుకునో, కూతురినో ముఖ్యమంత్రిని చేయాలన్న తన కల నెరవేరదనే టీఆర్‌ఎస్‌ అధినేత ‘ముందస్తు’కు తొందరపడ్డారని ఆరోపించారు. టీఆర్‌ఎస్, మహాకూటముల్లో ఎవరికి ఓటేసినా వారు మజ్లిస్‌ పంచనే చేరతారని.. అందువల్ల బీజేపీకి ఓటేయాలని ఓటర్లను కోరారు.
 
కేసీఆర్‌ దగాకోరు 
‘2014లో అధికారంలోకి రాగానే దళితుడిని సీఎం చేస్తానన్నాడు. ప్రజలను ఏమార్చి కుర్చీ ఎక్కాడు. 2018లోనూ కేసీఆర్‌ ఓ ఎస్సీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయరు. భవిష్యత్తులోనూ చేసే ఉద్దేశం కేసీఆర్‌కు లేదు. ఆయనో దగాకోరు. తన కొడుకునో, బిడ్డనో అధికార పీఠంపై కూర్చోబెట్టాలన్నదే కేసీఆర్‌ ఆలోచన’అని అమిత్‌షా ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్ని విషయాల్లోనూ ఘోరంగా విఫలమైందన్నారు. ‘కేసీఆర్‌ తెలంగాణ ప్రజలకు 150 వాగ్దానాలు చేశారు. అందులో ఒక్కటి కూడా అమలు చేయలేదు. లక్ష ఉద్యోగాల హామీ అటకెక్కింది. తెలంగాణలో 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. నాలుగున్నరేళ్లలో ఒక్క లెక్చరర్‌ పోస్టును భర్తీ చేయలేదు. పేదలకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు కట్టిస్తామని, ఇప్పటివరకు 5 వేల ఇళ్లను కూడా నిర్మించలేదు. సాగునీరు, ప్రాజెక్టుల అభివృద్ధికి రూ.99 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అయినా.. ఇప్పటివరకు ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తిచేయని దౌర్భాగ్య స్థితిలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉంది. కమీషన్ల కోసమే ప్రాజెక్టుల రీ–డిజైన్‌ చేశారు. కేంద్ర నిధులను పక్కదారి పట్టించారు’అని అమిత్‌ షా ఆరోపించారు. ‘బీజేపీ రైతులకు 150% మద్దతు« ధరనిచ్చింది. మోదీ ప్రభుత్వం అభివృద్ధిని దేశవ్యాప్తం చేస్తోంది. తెలంగాణలో ఒక్కసారి అవకాశమిస్తే ఇక్కడ కూడా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం’అని అమిత్‌ షా పేర్కొన్నారు. 

‘ఆయుష్మాన్‌’ను అడ్డుకోవడమెందుకు? 
‘ప్రధాని మోదీ ‘ఆయుష్మాన్‌ భారత్‌’పథకం ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాదిమంది పేదల ఆరోగ్యం కోసం రూ.5 లక్షల బీమాతో ఆరోగ్య బీమా పథకం తీసుకొస్తే కేసీఆర్‌ తెలంగాణకు ఆ పథకం వద్దన్నారు. ఆ పథకం అమలు చేస్తే తెలంగాణ ప్రజల్లో మోదీపై ఆకర్షణ, గౌరవం పెరుగుతుందనే తెలంగాణకు వద్దన్నారు. 13వ ఆర్థిక సంఘం ద్వారా అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణకు కేవలం రూ.16,597 కోట్లు ఇచ్చింది. కానీ.. బీజేపీ అధికారంలోకి వచ్చాక 14వ ఆర్థిక సంఘం ద్వారా మొత్తం రూ. 2,31,800 కోట్ల నిధులు కేటాయించింది’ అని అమిత్‌ షా వెల్లడించారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్‌కు ప్రజలు బుద్ధిచెబుతారన్నారు. కేసీఆర్, రాహుల్‌ బాబా అండ్‌ కంపెనీ వల్ల తెలంగాణ అభివృద్ధి సాధ్యపడదని.. దేశాభివృద్ధిలో నిమగ్నమై ఉన్న మోదీ ద్వారానే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఇంటింటా ప్రచారం చేసి 119 స్థానాల్లో స్వతంత్రంగా పోటీ చేస్తున్న బీజేపీని గెలిపించాలని ప్రజలకు షా పిలుపునిచ్చారు. ‘తెలంగాణ సాధనలో అమరులైన వారినీ కేసీఆర్‌ మోసగించారు. దాదాపు 1,200 మంది అమరుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి.. ఇప్పుడు వారిని పట్టించుకోవడంలేదు’అని అమిత్‌ షా నిప్పులు చెరిగారు. కేసీఆర్‌ అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు గడుస్తున్నా అమరవీరుల కుటుంబాలు ఉద్యోగాలకోసం ఆశగా ఎదురుచూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని మాట తప్పారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో 4,500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంత ఘోరం జరుగుతుంటే కేసీఆర్‌ ప్రభుత్వం ఏం చేస్తోంది?’అని షా దుయ్యబట్టారు.
 
వారివి విచ్ఛిన్న రాజకీయాలు 
‘రాహుల్‌ బాబా అండ్‌ కంపెనీ నాయకత్వంలో 2014లో కాంగ్రెస్‌ ఎక్కడా గెలువలేదు. మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక్కొక్కటిగా 19 రాష్ట్రాలలో బీజేపీ అధికారం చేపట్టింది’అని అమిత్‌షా వివరించారు. దేశవ్యాప్తంగా ఉనికిని కోల్పోతున్న కాంగ్రెస్‌ పార్టీకి తెలంగాణలోనూ చేదు అనుభవం తప్పదన్నారు. ‘దేశాన్ని, దేశ ప్రజలను విచ్ఛి న్నం చేసేందుకు విపక్షాలు ప్రయత్నిస్తుంటే.. దేశ సమ గ్రత కోసం బీజేపీ కృషి చేస్తోంది. మోదీ మేక్‌ ఇన్‌ ఇండియా అంటే.. ప్రతి పక్షాలు బ్రేకిన్‌ ఇండియా అంటున్నాయి. మీరు బ్రేకిన్‌ ఇండియా వైపా? మేకిన్‌ ఇండియా వైపా?’అని సభకు హాజరైన వారిని అమిత్‌షా అడగ్గా అందరూ ‘మేకిన్‌ ఇండియా’అంటూ నినాదాలు చేశారు. ఈ బహిరంగ సభకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్, ఎంపీ బండారు దత్తాత్రేయ, బీజేపీ శాసనసభ పక్షనేత జి.కిషన్‌రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణా రెడ్డి, చింతల రామచంద్రా రెడ్డి, మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి, రాష్ట్ర నేతలు బాబూమోహన్, బండి సంజయ్‌కుమార్, యెండల లక్ష్మీనారాయణ, కేశ్‌పల్లి ఆనంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

మజ్లిస్‌కు భయపడుతున్నారు 
‘మజ్లిస్‌ పార్టీకి టీఆర్‌ఎస్, కాంగ్రెస్, టీడీపీ నేతలు భయపడుతున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్యాంట్లు తడుపుకుంటున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.. ఒవైసీకి భయపడే రజాకార్ల నుంచి తెలంగాణ విముక్తి పొందిన సెప్టెంబర్‌ 17ను ‘విమోచనదినం’గా నిర్వహించడం లేదు. బీజేపీ ఆధికారంలోకి వస్తే మేం విమోచన దినాన్ని ఘనంగా నిర్వహిస్తాం. టీఆర్‌ఎస్, మహాకూటముల్లో ఎవరు గెలిచినా.. మజ్లిస్‌కు తొత్తులుగానే ఉంటారు. ఈ మూడు పార్టీలు ఒవైసీకి గులాంలే. మజ్లిస్‌ కోరలు పీకే దమ్మున్న పార్టీ బీజేపీ మాత్రమే. మైనార్టీలకు 12% రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్‌.. ఈబీసీ, ఎస్సీ, ఎస్టీల్లో ఎవరికి కోత పెట్టాలనుకుంటున్నారో స్పష్టంచేయాలి’అని అమిత్‌షా డిమాండ్‌ చేశారు.

 పీవీని కాంగ్రెస్‌ అవమానించింది
‘మాజీ ప్రధాని వాజ్‌పేయ్‌ మరణిస్తే.. ప్రధాని సహా పార్టీ ముఖ్యనేతలంతా 5 కిలోమీటర్ల పాటు అంతిమయాత్రలో నడిచి అంతిమ సంస్కారాలు జరిపించాం. అదీ అటల్‌జీకి మేం ఇచ్చిన గౌరవం. కానీ, కరీంనగర్‌ బిడ్డ, తెలంగాణ పుత్రుడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావును కాంగ్రెస్‌ నాయకులే తీవ్రంగా అవమానపరిచారు. ఆయన అంత్యక్రియలను ఢిల్లీలో జరపకుండా అడ్డుకున్నారు. చివరకు ఆయన చితిని కూడా పూర్తిగా కాలకుండా చేశారు. ఇలాంటి కాంగ్రెస్‌కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారు’అని అమిత్‌షా పేర్కొన్నారు. ‘అస్సాంలో 40 లక్షల మంది అక్రమ చొరబాట్లు ఉన్నాయని గుర్తించి బయటకు పంపించాలని బీజేపీ ప్రయత్నిస్తే కాంగ్రెస్, కమ్యూనిస్టులు సహా విపక్ష పార్టీలకు మింగుడుపడడం లేదు. 2019 ఎన్నికల్లో మరోసారి బీజేపీ పట్టంగడితే దేశంలో ఉన్న బంగ్లాదేశ్‌ అక్రమ చొరబాటుదారులందరినీ తరిమికొడతాం’అని ఆయన హామీ ఇచ్చారు. 

కుటుంబ పార్టీలకు చరమగీతం: కిషన్‌రెడ్డి
కరీంనగర్, సిటీ: టీఆర్‌ఎస్, కాంగ్రెస్, టీడీపీ కుటుం బ పార్టీలకు చరమగీతం పాడాలని బీజేపీ మాజీ శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. సెక్రటేరియట్‌కు రాకుండా సీఎం పరిపాలన కొనసాగించడమే తెలంగాణ చేసుకున్న దౌర్భాగ్యమన్నారు. కేసీఆర్‌ ప్రగతిభవన్‌ కట్టుకుని.. ప్రజలకిచ్చిన డబుల్‌బెడ్‌ రూం హామీని పడకెక్కించారన్నారు. గత ఎన్నికల్లో 21 స్థానాలలో కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఇప్పుడు 10 మంది మాత్రమే ఉన్నారని, టీడీపీలో 15 మందికి ఒక్కరే మిగిలారని, సీపీఐలో ఉన్న ఒక్కరూ పార్టీ ఫిరాయించారని గుర్తుచేశారు. టీఆర్‌ఎస్, మహాకూటముల్లో ఎవరికి ఓటేసినా.. రజాకార్ల వారసుల మజ్లిస్‌ మాటే చెల్లుతుందన్నారు. మజ్లిస్‌ను ఎదుర్కొనే పార్టీ బీజేపీ మాత్రమేనన్నారు.

గడీలు కూల్చి.. గరీబోళ్ల రాజ్యం తెస్తాం!
కరీంనగర్, సిటీ: నాలుగున్నరేళ్లు అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌తోపాటు కాంగ్రెస్, టీడీపీలు మజ్లిస్‌ మతోన్మాద రాజకీయాలకు వత్తాసు పలుకుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ ఆరోపించారు. కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్‌లు ఎన్నికల్లో కూటమిగా వస్తే అది పందుల గుంపులుగా వచ్చినట్లేనని, కానీ.. బీజేపీ సింహంలా సింగిల్‌గా వస్తోందన్నారు. ప్రజలు ఆదరించి ఆశీర్వదిస్తే గడీల రాజ్యాన్ని దెబ్బకొట్టి గరీబోళ్ల రాజ్యం తెస్తామని హామీ ఇచ్చారు. కరీంనగర్‌లో నిర్వహించిన ‘మార్పు కోసం బీజేపీ సమరభేరి’సభలో ఆయన మాట్లాడుతూ..‘ముందç స్తు ఎన్నికలకు ఎందుకు తెరలేపారో కేసీఆర్‌ దగ్గర జవాబు లేదు. అధికారం రాగానే ఇచ్చి న హామీలేవీ అమలు పర్చలేదు. కేసీఆర్‌ అంటే 3 సీ (కాంట్రాక్ట్స్, కలెక్షన్స్, కమీషన్స్‌) ప్రభుత్వమని, మోదీ అంటే 3డీ (డెవలప్‌మెంట్,డిసిషన్‌మేకింగ్,డైనమిక్‌) ప్రభుత్వ మన్నారు. దమ్ముంటే మజ్లిస్‌ అధినేత ఓవైసీ కరీంనగర్, పెద్దపల్లిలో పోటీ చేసి గెలవాలన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement