అమిత్ షా
ఉద్యమాల ఖిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పాగా వేసేందుకు భారతీయ జనతా పార్టీ కసరత్తు చేస్తోంది. దేశాన్ని ఏలుతున్న బీజేపీ ఉత్తర తెలంగాణలో సత్తా చాటే పనిలో నిమగ్నమైంది. కమలనాథులకు ఒకప్పుడు మంచి పట్టున్న కరీంనగర్ నుంచే తమ ప్రచార శంఖారావం పూరించాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఈనెల 10న కరీంనగర్‌లో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ టార్గెట్‌గా, మహాకూటమికి దీటుగా బీజేపీ ఒంటరిగా రంగంలోకి దిగి ప్రచారాన్ని చేపట్టి పట్టుసాధించేందుకు కసరత్తు ముమ్మరం చేశారు. అమిత్ షాతోపాటు కేంద్ర మంత్రులను రంగంలోకి దింపి ఉత్తర తెలంగాణలో ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీజేపీ సత్తా చాటేందుకు సిద్ధమైంది. గతంలో ఒక ఎంపీ, రెండు అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ, ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ప్రభావం చూపక తప్పదు. ఈనెల ఐదులోగా నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించి అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తి చేసి కదనరంగంలోకి దూకేందుకు సిద్ధమైనట్లు కమలనాథులు ప్రకటిస్తున్నారు. కాగా.. అమిత్‌షా సభ సక్సెస్ కోసం 13 నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జీలను నియమించి సుమారు 1.25 లక్షల మందిని తరలించేలా పార్టీ శ్రేణులు కసరత్తు చేస్తున్నాయి.
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఉత్తరాదిన బీజేపీ విజయం సాధించేలా కృషి చేసి, దక్షిణాదిన పాగా వేసేలా పనిచేసిన పార్టీ సీనియర్ నేతలను ఈ జిల్లాకు ఇన్‌చార్జీలుగా నియమించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇన్‌చార్జీలుగా నాలుగు మాసాల క్రితమే నియమించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా తొమ్మిది నియోజకవర్గాలకు ఇన్‌చార్జిగా రామ్ మాధవ్‌ను, నాలుగు నియోజకవర్గాలకు బండారు దత్తాత్రేయను నియమించి ఎన్నికల వ్యూహాన్ని రచిస్తున్నట్లు తెలిసింది. అలాగే అమిత్ షా సభ ఇన్‌చార్జిగా తాజా మాజీ ఎమ్మెల్యే చింతల రామచంర్రారెడ్డిని, సమన్వయకర్తగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి, సహాయ సమన్వయ కర్తలుగా పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి, కిసాన్‌మోర్చా జాతీయ అధ్యక్షుడు సుగుణాకర్‌రావును నియమించారు.
అందులో భాగంగా 10న కరీంనగర్‌లో అమిత్ షా పర్యటించి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అమిత్ షోతో ఉత్తర తెలంగాణాలో బీజేపీపై ప్రజలకు విశ్వాసం పెంచేలా కసరత్తు చేస్తున్నట్లుగా పార్టీ నేతలు చెబుతున్నారు. అమిత్ షా పర్యటనతో పార్టీలో ముఖ్యులకు స్పష్టమైన బాధ్యతలు అప్పగించి పార్టీని గెలుపు దిశగా పయనించేలా వ్యూహాన్ని అమలు చేస్తారని చర్చసాగుతోంది. గుజరాత్, కర్నాటక ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్ని తెలంగాణాలో అమలు చేసేందుకు పోలింగ్ బూత్ స్థాయిలో వేసిన కమిటీలకే ఓటర్ల బాధ్యతలను అప్పగించేలా పకడ్బందీ ప్రణాళికతో ముందుకు పోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా రాష్ట్రంలో అధికార పార్టీ టీఆర్‌ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను, కేటాయించిన నిధుల వివరాలను గ్రామస్థాయి వరకు తీసుకెళ్లి ప్రజలను చైతన్యవంతం చేసి ఓట్లు రాబట్టుకునే కరసత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌తోపాటు ఇతర పార్టీల్లోని అసంతృప్తులను ఆకర్శించి బలం పెంచుకునేలా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పక్కా ప్రణాళికతో పార్టీ శ్రేణులను మార్గదర్శకం చేస్తూ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇదే క్రమంలో ఈనెల 10న కరీంనగర్‌లో అమిత్ షా సభను నిర్వహించడం చర్చనీయాంశం అవుతోంది.
పాగా వేసేందుకు ప్రయత్నం.. మరోమారు బూత్‌స్థాయి నుంచి సమీక్ష..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీజేపీకి ఒకప్పుడు గట్టి పట్టు ఉండగా గ్రూప్ రాజకీయాలతో రానురాను పార్టీ బలహీనపడింది. నేతల మధ్య సమన్వయ లోపంతో పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. అమిత్ షా పర్యటనతో సమస్యలన్నీ సద్దుమణిగి బీజేపీకి పూర్వవైభవం వస్తుందనే ధీమాతో పార్టీ శ్రేణులు ఉన్నాయి. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొనే దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టింది. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు, తద్వారా పార్టీని విస్తరింపజేసేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్న జిల్లా నాయకత్వం, ఈ మధ్య మరింత దూకుడు పెంచింది. ఈ క్రమంలోనే బీజేపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జన చైతన్య యాత్ర జిల్లాకు చేరనుండగా, శంకరపట్నంలో బహిరంగ సభ నిర్వహించారు.
కేంద్రమంత్రి పురుషోత్తమ్ రూపాల్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఇదిలా ఉండగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం, క్యాడర్ ప్రధాని నరేంద్రమోదీ జోష్‌తో ముందుకు సాగుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పట్టు సాధించేందుకు పార్టీ నాయకత్వం వినూత్న రీతిలో కార్యక్రమాలు చేపడుతోంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేఎల్‌పీ నేత కిషన్‌రెడ్డి, ఎంఎల్‌ఏ చింతల రామచంద్రారెడ్డి తరచూ పర్యటించడం ద్వారా జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలో 2,097 పోలింగ్‌బూత్‌లకు గాను 2,050 పైచిలుకు బూత్ కమిటీలను ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. కనీసం 10 నుంచి 25 మందితో ఈ కమిటీలు పనిచేస్తున్నాయి. కాగా గురువారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ముఖ్య నేతలతో అభ్యర్థులు, బూత్‌స్థాయి కమిటీలు, అమిత్ షా సభ సక్సెస్ కోసం హైదరాబాద్‌లో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.
విజయవంతం చేయండి
ఈనెల 10న కరీంనగర్ ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల మైదానంలో నిర్వహించే అమిత్ షా సభను విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజల సమస్యలు, ముందస్తు ఎన్నికల నేపథ్యంలో నిర్వహించే సభను సక్సెస్ చేయాలని కోరారు. అమిత్ షాతోపాటు జాతీయ, రాష్ట్ర కమిటీలకు చెందిన పలువురు సీనియర్ నాయకులు ఈ సభలో పాల్గొంటారని, ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కీలకమైన సభకు పెద్దఎత్తున ప్రజలు తరలిరావాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment