
స్టేడియంలో ప్రచారం చేస్తున్న సంజయ్, ఇతర నాయకులు
సాక్షి, కరీంనగర్ అర్బన్: అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించిన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఉజ్వల భవిష్యత్ అందిస్తున్నారని కరీంనగర్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం అంబేద్కర్ స్టేడియంలో వాకర్లను కలిసిన ఆయన బీజేపీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. అనంతరం సంజయ్ మాట్లాడుతూ పేదరిక నిర్మూలన కోసం కాంగ్రెస్ పాలకులు చేసిందేమీ లేదని ఆరోపించారు.
దేశవ్యాప్తంగా అగ్రవర్ణ పేదలు ఉన్నత విద్య, ఉద్యోగాలకు నోచుకోకపోవడానికి కాంగ్రెస్ నిర్వాకమే కారణమని దుయ్యబట్టారు. అయితే, సామాన్యుడైన నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక అగ్రవర్ణాల ఇబ్బందులను గుర్తించి రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ మేరకు రానున్న ఎన్నికల్లో మరోమారు బీజేపీకి పట్టం కట్టాలని సంజయ్ కోరారు. ఈ ప్రచారంలో బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పి.సుజాతరెడ్డితో పాటు నాయకులు మేచినేని దేవేందర్‌రావు, బుస శ్రీనివాస్, నాగమల్ల సురేష్, భగవాన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ముక్క హరీష్, బాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment