Higher castes
-
అగ్రవర్ణ పేదలకు ఉజ్వల భవిష్యత్
సాక్షి, కరీంనగర్ అర్బన్: అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించిన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఉజ్వల భవిష్యత్ అందిస్తున్నారని కరీంనగర్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం అంబేద్కర్ స్టేడియంలో వాకర్లను కలిసిన ఆయన బీజేపీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. అనంతరం సంజయ్ మాట్లాడుతూ పేదరిక నిర్మూలన కోసం కాంగ్రెస్ పాలకులు చేసిందేమీ లేదని ఆరోపించారు. దేశవ్యాప్తంగా అగ్రవర్ణ పేదలు ఉన్నత విద్య, ఉద్యోగాలకు నోచుకోకపోవడానికి కాంగ్రెస్ నిర్వాకమే కారణమని దుయ్యబట్టారు. అయితే, సామాన్యుడైన నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక అగ్రవర్ణాల ఇబ్బందులను గుర్తించి రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ మేరకు రానున్న ఎన్నికల్లో మరోమారు బీజేపీకి పట్టం కట్టాలని సంజయ్ కోరారు. ఈ ప్రచారంలో బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పి.సుజాతరెడ్డితో పాటు నాయకులు మేచినేని దేవేందర్‌రావు, బుస శ్రీనివాస్, నాగమల్ల సురేష్, భగవాన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ముక్క హరీష్, బాబు తదితరులు పాల్గొన్నారు. -
ఉన్నత కులాల్లోని పేదలకు రిజర్వేషన్లు!
న్యూఢిల్లీ: ఉన్నత కులాల్లోని ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు సంకేతాలిచ్చింది. అయితే, ప్రస్తుతమున్న రిజర్వేషన్ వ్యవస్థలో ఎలాంటి మార్పులు చేయాలనుకోవడం లేదని స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రస్తుతం ఇస్తున్న 50% రిజర్వేషన్లు పోను.. మిగతా 50%లో ఉన్నత కులాల్లోని ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్ల ప్రయోజనం కల్పించడం తమ ప్రభుత్వ ఉద్దేశాల్లో కీలకమైన అంశమని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ‘ఇప్పటికే ఉన్న 50% రిజర్వేషన్ల విషయంలో చర్చ లేదు. అది కాకుండా ఇంకా నిర్ణయాత్మక చర్యలు ఏం తీసుకోగలమనేది ముఖ్యమైన విషయం’ అన్నారు. ‘ఆర్థిక వెనకబాటుదనం ప్రాతిపదికగా ఉన్నత కులాలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించే దిశగా ఈ ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేయాలనుకుంటోందా?’ అన్న ప్రశ్నకు.. ఆయన సూటిగా జవాబివ్వలేదు.