లక్నో : సార్వత్రిక ఎన్నికల కోసం బద్ధశత్రువులు ఎస్పీ-బీఎస్పీలు చేతులు కలిపేందుకు సిద్ధమైన క్రమంలో భారతీయ జనతా పార్టీ రంగంలో దిగింది. అవమానాల్ని మరిచిపోయి మరీ మాయావతి.. ఎస్పీ పంచన చేరుతోందంటూ చెబుతోంది. రాజ్యసభ ఎన్నికల్లో తమ అభ్యర్థిని ఓడించేందుకు బీజేపీ కుట్రపన్నిందని మాయావతి విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి సిధార్థ్ నాథ్ సింగ్ స్పందించారు.
బీఎస్పీ అధినేత్రి చేసిన ఆరోపణలు నిరాధారమని ఆయన చెప్పారు. అఖిలేశ్ యాదవ్ నుంచి రిటర్న్ గిప్ట్ రాకపోవటంతో ఆమె ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు. కనీసం 20 మంది ఎమ్మెల్యేలు లేని మాయావతి.. అసలు రాజకీయాల్లో ఎందుకు కొనసాగుతున్నారో అర్థం కావట్లేదని ఆయన అన్నారు. ‘పాతికేళ్ల క్రితం ములాయం చేసిన అవమానాల్ని ఆమె మరిచిపోయినట్లు ఉన్నారు. ఆ సమయంలో ములాయం నుంచి ప్రాణాపాయం ఉందని ఆరోపించిన మాయావతి.. ఇప్పుడు అఖిలేష్‌తో పొత్తు కోసం చర్చలు తహతహలాడుతున్నారు..
...ఏం ప్రాణహాని తండ్రి నుంచే తప్ప.. కొడుకు నుంచి లేదా? దళితులను కూడా ఆమె ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు. అఖిలేష్ తన సొంత ప్రయోజనాలను చూస్కుని ఆమెకు మేలు చేయలేదు. బీజేపీని ఓడించాలనే వారు జత కడుతున్నారు తప్ప.. స్వతహాగా ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన వారికి లేదు. ఒకరి ప్రయోజనాలు ఒకరు చూసుకుని ఎన్నికలకు వెళ్తున్నారు. ఈ లెక్కన రాజ్యసభ ఎన్నికల్లో ఎవరు తప్పుదారి పట్టారో ఒక్కసారి ఆమె ఆలోచించుకోవాలి. బీజేపీ అనైతికతకు పాల్పడలేదు’ అని సిధార్థ్‌నాథ్ పేర్కొన్నారు. అయితే ఆ వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం తమకు లేదని ఎస్పీ-బీఎస్పీ నేతలు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment