సాక్షి, అమరావతి: తాజా రాజకీయ పరిణామాలు, టీడీపీ నేతలు చేస్తున్న విమర్శల నేపథ్యంలో ఆ పార్టీతో పొత్తు విషయంలో తాడో-పేడో తేల్చుకునేందుకు బీజేపీ సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం నుంచి బీజేపీ మంత్రుల రాజీనామాపై బుధవారం అసెంబ్లీ లాబీలో జోరుగా చర్చ సాగింది. టీడీపీ తెగదెంపులు చేసుకోకముందే బీజేపీ మంత్రులు రాజీనామా చేస్తారంటూ ఊహాగానాలు చెలరేగాయి. రాజీనామాలకు సిద్ధం కావాలని పార్టీ హైకమాండ్ నుంచి బీజేపీ మంత్రులకు ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తోంది. రాష్ట్రాభివృద్ధి విషయంలో టీడీపీ మమ్మల్ని నిందిస్తే.. చూస్తూ ఊరుకోబోమని, ఆ పార్టీకి దీటైన జవాబు ఇస్తామని బీజేపీ ఎమ్మెల్యేలు అంటున్నారు.
బీజేపీఎల్పీ సమావేశం
తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీఎల్పీ సమావేశమై.. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించింది. ఈ భేటీలో పాల్గొన్న బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. ఒకవేళ అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు బీజేపీపై నిందలు వేస్తే.. ఏ విధంగా స్పందించాలనే దానిపై సమాలోచనలు చేశారు. టీడీపీ చర్యను బట్టి తమ ప్రతిచర్య ఉంటుందని, టీడీపీపై దాడి చేయాల్సిన పరిస్థితి ఇప్పుడైతే తమకు లేదని మంత్రి మాణిక్యాలరావు అన్నారు.
ఢిల్లీకి పిలుపు
దేశ రాజధాని ఢిల్లీకి రావాలని బీజేపీ నేతలకు అమిత్ షా సూచించారు. గురువారం ఏపీ బీజేపీ నేతలతో అమిత్‌షా ఢిల్లీలో భేటీ కానున్నారు. టీడీపీతో పొత్తు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment