బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు
విశాఖపట్నం: వారంలో ఒక్క రోజు బ్యాగ్ లేకుండా విద్యార్థులను బడికి పంపడం అభినందనీయమని, అలాగే పోలీస్ శాఖలో ఒక్క రోజు సెలవు ఇవ్వడం మంచి విధానమని బీజేపీ మాజీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న ప్రతి నిర్ణయానికి ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తోందని వ్యాఖ్యానించారు. ఇసుకపై ప్రభుత్వం జూలై 1 నుంచి అమల్లోకి తీసుకువస్తామన్న కొత్త విధానం సాహసోపేతమైన నిర్ణయమన్నారు. కానీ విధానం ఇంకా అమల్లోకి రాకముందే ఇసుక రవాణా జరిగితే..పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలన్న నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచించాలని సూచించారు.
గత ప్రభుత్వంలో నేతలు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడి, కోట్ల రూపాయలు స్వాహా చేశారని విమర్శించారు. ప్రతి అసెంబ్లీ సమావేశాల్లో ఇసుక మాఫియాపై గత టీడీపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం విశాఖపట్నంలో ఇసుక కొరత తీవ్రంగా ఉందని వెల్లడించారు. బీజేపీపై అక్రమంగా బురద జల్లడం వల్లే ఏపీలో టీడీపీ నామరూపాలు లేకుండా పోయిందని తూర్పారబట్టారు. అధికారం ఉంది కదా అని విచ్చలవిడిగా ప్రవర్తిస్తే తగిన గుణపాఠం తప్పదని 2019 ఎన్నికల ద్వారా రుజువైందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తిరుపతి పర్యటనలో సీఎం వైఎస్ జగన్ వ్యవహరించిన తీరుపై కొందరు నేతలు చేసిన వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment