నితీష్ కుమార్-అమిత్ షా
పాట్నా : 2019 లోకసభ ఎన్నికల్లో బీజేపీ-జేడీయూ పొత్తు అనుమానంగానే మారుతోంది. తమకు ఎక్కువ సీట్లు కావాలని జేడీయూ పట్టుపడుతుండగా.. 2014 ఎన్నికల్లో తాము విజయం సాధించిన 31 స్థానాల్లో పోటీ చేస్తామని బీజేపీ ప్రకటించింది. సీట్లు పంపకాల విషయంలో రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరని నేపథ్యంలో బీజేపీ ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్దమవుతోంది. జూలై మొదటి వారంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా బిహార్‌లో పర్యటించి, జేడీయూతో సీట్ల పంపకంపై కీలక ప్రకటన చేస్తారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేందర్ సింగ్ తెలిపారు. అమిత్ షా రాష్ట్ర పర్యటనకు వస్తున్న నేపథ్యంలో బిహార్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.
2014లోతమతో కలిసి పొత్తు పెట్టుకున్న పార్టీలకు అన్యాయం జరగకుండా రానున్న ఎన్నికల్లో 40 సీట్లలో బీజేపీ పోటీ చేస్తుందని సోమవారం ససారంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో రాజేందర్ సింగ్ ప్రకటించారు. బీజేపీ ఒంటరిగా పోటీ చేసినా తప్పక విజయం సాధించితీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే తమకే ఎక్కువ సీట్లు కావాలని, బీజేపీకి గతంలో వచ్చినన్ని సీట్లు ఈసారి రావని జేడీయూ ప్రధాన కార్యదర్శి సంజయ్ సింగ్ పేర్కొన్నారు. కాగా ఎన్డీయే కూటమి నుంచి నితీష్ కుమార్ బయటకు వస్తే తమ కూటమి తరుఫున నితీష్‌నే సీఎం అభ్యర్ధిగా ప్రకటిస్తామని బిహార్ మాజీ సీఎం జితన్‌రాం మాంఝీ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment