
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తానన్న కేసీఆర్ బంగారం లాంటి ఇల్లు కట్టుకున్నాడనీ, వారి కుటుంబ సభ్యులకు మాత్రమే బంగారు భవిష్యత్తుని ఇచ్చేలా పాలన సాగిస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ అన్నారు. ఎల్బీనగర్‌లోని మన్సూరాబాద్‌లో నియోజకవర్గ నూతన ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన అధికార, ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు. గత నాలుగేళ్ల పాలనలో తెలంగాణలో అభివృద్ధి కుంటుబడిందనీ, అక్షరాస్యతలో రాష్ట్రం వెనకబడిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అడిగినంత ఆర్థిక సహాయం చేస్తున్నా కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారని విమర్శలు గుప్పించారు. కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలు అన్ని రాష్ట్రాల్లో అమలవుతున్నా తెలంగాణలో మాత్రం కొనసాగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంద్రసేనారెడ్డిని గెలిపించని చరిత్ర ఉంది..
ఎల్బీనగర్ నియోజకవర్గ అభ్యర్థి పేరాల శేఖర్‌రావుకు ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. శేఖర్‌కు రాష్ట్రంలోనే కాదు జాతీయ స్థాయిలో మంచి పేరుందని అన్నారు. టీడీపీ అంటే తెలుగు దేశం పార్టీ కాదని తెలుగు ద్రోహం పార్టీ అని వ్యాఖ్యానించారు. ఎల్బీనగర్ వాసులతో బీజేపీకి మంచి సంబంధాలు ఉన్న కారణంగానే శేఖర్‌ని ఇక్కడ నుంచి పోటీకి దింపుతున్నామని అన్నారు. గతంలో మలక్‌పేట నియోజకవర్గంలో భాగమైన ఎల్బీనగర్ నుంచి బీజేపీ అభ్యర్ధి ఇంద్రసేనారెడ్డి ఘాన విజయం సాధించారని ఆయన గుర్తుచేశారు.
టీఆర్‌ఎస్ పాలనపట్ల ప్రజలు అసహనంతో ఉన్నారనీ, ఆ పార్టీకి రోజులు దగ్గరపడ్డాయని విమర్శించారు. తెలంగాణలో అవినీతిమయమైన, నియంతృత్వ వంశ పరిపాలన కొనసాగుతోందని అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ అంటే ఒక అవినీతి పార్టీ అని దేశ వ్యాప్తంగా తెలిసిన విషయమేనని వ్యాఖ్యానించారు. కేంద్ర నాయకత్వం బలంగా ఉందనీ, తెలంగాణలో బీజేపీ జెండా ఎగరేయాలని ప్రధాన మంత్రి దృఢ సంకల్పంతో ఉన్నారని రాంమాధవ్ పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలోని 119 స్థానాల్లో పోటీ చేస్తుందని తెలిపారు. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో అధికారంలో కొనసాగుతున్న బీజేపీ మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగబోయే 5 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment