సాక్షి, హైదరాబాద్ : తెలుగుదేశం వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పేరు ఎక్కడా కనిపించకుండా చేసేందుకు చంద్రబాబు పన్నిన కుట్రలు బహిర్గతమైన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ పేరును ఏ ప్రభుత్వ పథకానికీ లేకుండా చేసేందుకు చంద్రబాబు, తోకపత్రిక యజమాని రాధాకృష్ణ మధ్య జరిగిన సంభాషణ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏకంగా ఎన్టీఆర్‌ను వాడు.. వీడు అని చంద్రబాబు దుర్భాషలాడటంతో ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ బాగోతాలపై ఏపీ బీజేపీ అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్రస్ధాయితో ధ్వజమెత్తారు. కెమెరా ముందు సంసారులుగా నటిస్తూ.. కెమెరా వెనకాల వ్యభిచారం సాగిస్తున్నారని మండిపడ్డారు. ట్విటర్ వేదికగా విమర్శలు ఎక్కుపెట్టారు. ‘ కెమెరా ముందు సంసారం...కెమెరా వెనుక వ్యభిచారం. ఇదీ మీ పచ్చ పత్రికల బాగోతం. ఎన్టీఆర్‌ను చంపారు. కాంగ్రెస్‌తో పొత్తుట్టుకుని ఆయన విలువలకు అంత్యక్రియలు చేశారు. ఇప్పుడు ఆయన్ని చరిత్ర నుంచి తుడిపేయడానికి తెగించారు. ఏపీ రాజకీయ చరిత్రకు చంద్రబాబు ఒక అవినీతి మచ్చ’ అని వ్యాఖ్యానించారు. (చదవండి : ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ నుంచి ‘వాడి’ పేరు తీసేస్తా)
అదంతా నాటకమే..!
సాక్షి, విజయవాడ: తెలుగుదేశం వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పట్ల చంద్రబాబు చేసిన కించపరిచే వ్యాఖ్యలపై ఏపీ మాజీ హోం మంత్రి, వసంత నాగేశ్వరరావు మండిపడ్డారు. ‘బాబు వ్యాఖ్యలతో అన్నగారి ఆత్మ క్షోభిస్తుంది. తాజా ఘటనతో ఎన్టీఆర్ పట్ల చంద్రబాబు నిజమైన వైఖరి బయటపడింది. ఎన్టీఆర్ విగ్రహాలకు దండలు వేసి బాబు నివాళులు అర్పించడం నాటకమని ప్రజలు అర్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికైనా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కళ్ళు తెరవాలి. అన్నగారి ఆత్మగౌరవం కాపాడాల్సిన కనీస బాధ్యత ఆయన వారసులపై ఉంది’ అన్నారు.
బాబుకు నరనరాల్లోనూ విద్వేషం..
విజయవాడ: ఎన్టీఆర్ పట్ల మొదటి నుంచి చంద్రబాబుది కపట ప్రేమేనని టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేష్ఠ రమేష్‌బాబు అన్నారు. ఎన్టీఆర్ అంటే బాబుకు నరనరాల్లోనూ విద్వేషం ఉందని, గత్యంతరం లేక ఎన్టీఆర్ పేరును ఇప్పటి వరకు వాడుకున్నాడని విమర్శించారు. తెలుగు ప్రజలు దైవంగా భావించే ఎన్టీఆర్‌ను నీచంగా సంబోధిస్తూ వ్యాఖ్యలు చేయడం దారుణమని మండిపడ్డారు. చంద్రబాబు అహంకారానికి ఎన్టీఆర్ అభిమానులు సరైన బుద్ది చెబుతారని ఆకాక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment