సాక్షి, హైదరాబాద్ : నగరంలో గుంతలేని రోడ్డు ఒక్కటి చూపించినా కేటీఆర్‌కి పదివేల రూపాయలు ఇస్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సవాల్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..తెలంగాణలో బీజేపీ పాగా వేయడానికి జాతీయ నాయకత్వం పూర్తి అండగా ఉందన్నారు. పేదవారి సొంతింటి కల నెరవేరుస్తానని అధికారంలోకి వచ్చిన కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చారన్నారు.
హైదరాబాద్‌ను విశ్వనగరంగా కాదు.. విషాదనగరంగా మార్చారని ఎద్దేవా చేశారు. ఎక్కడ నాలలో పడి కొట్టుకుపోతామో తెలియదన్నారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టే పార్టీ టీఆర్‌ఎస్ అని ఎద్దేవా చేశారు. హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డికే కేసీఆర్ అపాయిట్‌మెంట్ ఇవ్వడంలేదని.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే మహిళా రుణాల వడ్డీలు ఏకకాలంలో మాఫీ చేస్తామని హామి ఇచ్చారు.
హరీశ్‌రావు మాటలు హాస్యాస్పదం : దత్తాత్రేయ
కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేకి అని హరీశ్‌రావు అనడం హాస్యాస్పదం అని బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు. రైతులకు బేడీలు వేసి తీసుకెళ్లిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదని ఎద్దేవా చేశారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని మేనిఫెస్టోలో పెట్టి ఇప్పటి వరకూ ఇవ్వలేదని విమర్శించారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్య పెరిగిపోయాయన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని పంటలకు గిట్టుబాబు ధర పెంచిందని గుర్తు చేశారు.
రైతు బంధు పథకం అనేది రైతులు ఉపశమనం మాత్రమేనన్నారు. పంట బీమా పథకం కేంద్రం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించిందని ఆరోపించారు. 24గంటల కరెంట్ కేంద్రం చలవేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సొమ్మొకడిది సోకకడిది అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. అమిత్ షా అడిగిన ప్రశ్నలకు టీఆర్‌ఎస్ సమాధానం చెప్పలేకపోతుందన్నారు. బీజేపీకి భయపడే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందన్నారు. ఎన్నికల కోసం 32 కమిటీలు వేశామని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment