సాక్షి అమరావతి : తెలుగుదేశంపార్టీ (టీడీపీ) నాయకత్వం పాత స్నేహాన్ని మర్చిపోయిందని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ విమర్శించారు. శనివారం గుంటూరు సిద్దార్థ గార్డెన్‌లో ఎన్డీఏ నాలుగేళ్ల విజయోత్సవ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన రామ్ మాధవ్ టీడీపీ తీరుపై నిప్పులు చెరిగారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుటిల రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. దుష్ట చరిత్ర ఉన్న కాంగ్రెస్‌తో జతకట్టి ఎన్టీఆర్ ఆశయాలకు తూట్లు పొడించారని విమర్శించారు. అధర్మ రాజకీయాలు చేస్తూ ధర్మపోరాటం చేయడం ఏంటని నిలదీశారు. ఎవరిది ధర్మపోరాటమో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. రాజకీయాల్లో వెన్నుపోటు పొడిచి పైకి రావడానికి కన్నా లక్ష్మీనారాయణకు మామ లేరని ఎద్దేవా చేశారు.
చివరకు దేవుడిపై కూడా ప్రభుత్వం రాజకీయాలు చేస్తుందని, వెంకటేశ్వర స్వామికి కూడా కులాన్ని అంటగట్టారని రామ్ మాధవ్ మండిపడ్డారు. కేవలం తమతో పొత్తు కారణంగానే 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిందన్నారు. నాలుగేళ్లు బీజేపీతో కలిసి ఉన్న టీడీపీ.. కదులుతున్న రైలు నుంచి దూకేసి, గాయం తగిలిందంటూ మొసలి కన్నీరు కారుస్తోందని చెప్పారు. నలభై ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకొనే చంద్రబాబు కంటే కన్నా లక్ష్మీనారాయణకే అనుభవం ఎక్కువని పేర్కొన్నారు. పోలవరానికి వంద శాతం నిధులు ఇస్తామని, ఏపీ విభజన చట్టంలోని హామీలు అన్నీ అమలు చేస్తామని వెల్లడించారు. ఒకరు థర్డ్ ఫ్రంట్ అంటే మరొకరు ఫోర్త్ ఫ్రంట్ అంటూ తిరుగుతున్నారని ప్రస్తావించారు. ఎన్ని ఫ్రంట్‌లు వచ్చినా బీజేపీని ఏం చేయలేవంటూ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీకి ప్రతిపక్షం లేదని, నాలుగేళ్లలో మచ్చలేని పాలన అందించారన్నారు.
అవినీతి చేసి దొరకనప్పుడు అందరూ ప్రజాసేవ, అవినీతి రహితం అంటూ మాట్లాడుతారని రామ్ మాధవ్ ఎద్దేవా చేశారు. టీడీపీ తప్పుడు విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామని అన్నారు. ప్రజాసేవే లక్ష్యంగా నాలుగేళ్లపాటు స్వచ్ఛమైన పరిపాలన అందించామని పేర్కొన్నారు. కన్నా లక్ష్మీనారాయణ నాయకత్వంలో ఏపీలో నూతన ఒరవడి సృష్టిస్తామన్నారు. 2022 నాటికి దేశంలో పేదరికం లేని కొత్త భారతదేశం నిర్మాణానికి మోదీ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఇతర నేతలు సిద్ధార్థ్‌నాథ్ సింగ్, జీవీఎల్ నరసింహా రావు, సోము వీర్రాజు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment