సోయం పారిపోయే లీడర్‌ కాదు | BJP Leader Shankar Fires On Jogu Ramanna About Soyam Bapu Rao In Adilabad | Sakshi
Sakshi News home page

సోయం పారిపోయే లీడర్‌ కాదు

Published Sat, Nov 2 2019 7:54 AM | Last Updated on Sat, Nov 2 2019 8:10 AM

BJP Leader Shankar Fires On Jogu Ramanna About Soyam Bapu Rao In Adilabad - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌ : ఇటీవల ఉట్నూర్‌లో జరిగిన ఐటీడీఏ గవర్నింగ్‌ బాడీ సమావేశంలో ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావ్‌ సమస్యలపై చర్చించకుండా మధ్యలో నుంచి పారిపోయాడని ఎమ్మెల్యే జోగు రామన్న చేసిన వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌ తీవ్రంగా ఖండించారు. సోయం బాపురావ్‌ పారిపోయే లీడర్‌ కాదని, ఇతరులను పారిపోయేలా చేసే లీడర్‌ అన్నారు. ఎంపీపై ఇకనైనా వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకోవాలన్నారు.

శుక్రవారం ఆదిలాబాద్‌ పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే జోగు రామన్న పదవుల కోసం రాజకీయం చేస్తే, ఎంపీ సోయం బాపురావ్‌ అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్న ఆదివాసీ జాతి కోసం ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాటం చేస్తున్నాడన్నారు. జోగు రామన్న ఎంపీపై చేసిన వ్యాఖ్యలు అధికార దురహంకారానికి నిదర్శమని విమర్శించారు. విమర్శలు చేసేముందు ఎమ్మెల్యే సోయం బాపురావ్‌ చరిత్రను తెలుసుకోవాలని అన్నారు.

ఎమ్మెల్యే వెంటనే ఎంపీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలోని అన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించమని చెబుతున్న ఎమ్మెల్యే జోగు రామన్న, జిల్లాలో 243 ఆదివాసీ గ్రామాలు ఉంటే కేవలం 143 గ్రామాలకు మాత్రమే రోడ్డు సౌకర్యాలు కల్పించారని అన్నారు. ఐఏపీ నిధులు దుర్వినియోగం చర్చపై మా ఎంపీ అవసరం లేదని పార్టీ జిల్లా అధ్యక్షునిగా తనే వస్తానని స్థలం ఎక్కడ ఎంచుకుంటారో ఎంచుకోవాలని ఆధారాలతో రుజువు చేసేందుకు సిద్ధంగా ఉన్నానని సవాల్‌ విసిరారు. సమావేశంలో బీజేపీ నాయకులు సునంద రెడ్డి, జ్యోతి, రవి, ప్రవీణ్, సతీష్, ప్రవీణ్‌ పాల్గొన్నారు. 

సోయం అంటే టీఆర్‌ఎస్‌కు వణుకు 
బోథ్‌: ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపూరావ్‌ అంటే టీఆర్‌ఎస్‌ నేతలకు వెన్నులో వణుకు పుడుతుందని, ఆయన భయపడి పారిపోయే వ్యక్తి కాదని ఆత్మరాష్ట్ర మాజీ డైరెక్టర్‌ రాజుయాదవ్‌ ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్నను ఉద్దేశించి అన్నారు. శుక్రవారం బోథ్‌ మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ... ఉట్నూర్‌లో జరిగిన ఐటీడీఏ పాలకవర్గం సమావేశంలో ఎంపీ సోయం బాపూరావ్‌ సమావేశం నుంచి పారిపోయాడని ఎమ్మెల్యే జోగురామన్న గురువారం చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. 

(చదవండి : సభలోంచి ఎందుకు పారిపోయావ్‌)

జోగురామన్నకు ఆదివాసీలంటే ఏమిటో చూపెడతాం
ఎమ్మెల్యే జోగురామన్న ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు సోయం బాపురావుపై అవాకులు చవాకులు పేలితే ఆదివాసీల సత్తా ఏమిటో చూపెడతామని తుడుందెబ్బ బోథ్‌ డివిజన్‌ అధ్యక్షుడు శంకర్‌ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన ఆదివాసీలు ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగురామన్నకు వ్యతిరేకంగా నినాదాలు చేసి చేశారు. వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వెంటనే ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో అట్రాసిటీ కేసు నమోదు చేయిస్తామని అన్నారు.

సుప్రీం కోర్టు ఇచ్చిన నోటీసులపై తెలంగాణ ప్రభుత్వం వివరణ ఇచ్చే విధంగా చూడాలన్నారు. స్వార్థ రాజకీయాలు కాకుండా లంబాడీలు ఎస్టీ కాదనే విషయంపై స్పష్టమైన వైఖరి తెలపాలన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సాంబన్న, సోనేరావు, కోటేశ్వర్, నాయక్‌పోడ్‌ సంఘం మండల అధ్యక్షుడు గంగాధర్, వివిధ గ్రామాల పటేళ్లు, యువకులు తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement