బీజేపీ అధికార ప్రతినిధి శ్రీధర్ రెడ్డి(పాత చిత్రం)
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ‘ప్రతి రోజూ ముందస్తు ఎన్నికలు.. ఎప్పుడొస్తాయో.. నాకు అధికారం వస్తదా.. నా కుమారుడికి అధికారం వస్తదా అనే ఆలోచనే తప్ప.. ప్రజల ఆరోగ్యం గురించి పట్టింపే లేద’న్నారు. హైదరాబాద్‌లో ఉన్న ఆసుపత్రిలోనే కాలు విరిగి వచ్చిన వ్యక్తి మీద పెచ్చులూడి మీద పడితే ఐసీయూలో చేర్చారు, హైదరాబాద్‌లోనే ఇట్లా ఉంటే ఊర్లలో పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
డాక్టర్లు, నర్సులు భయంగా పనిచేయాల్సిన పరిస్థితి దాపురించిందని వ్యాఖ్యానించారు. సీఎం కంటికి ఢిల్లీ వెళ్లి వైద్యం చేసుకుంటారు కానీ ఊర్లలో ఉన్న ప్రజలు ఉస్మానియా ఆసుపత్రికి కూడా రావొద్దా అని సూటిగా అడిగారు. రోజూ కొత్తకొత్త ప్రకటనలు మాత్రం చేస్తారురూ.200 కోట్లు ఇచ్చినట్లుగానే ఇచ్చి రూ.6 కోట్లు మాత్రమే శాంక్షన్ చేశారు. చివరికి రూపాయి కూడా ఖర్చు చేయలేదని మండిపడ్డారు. పండుగలకు పబ్బాలకు, ఇఫ్తార్‌లకు వందల కోట్లు ఖర్చు పెట్టే మీరు ఆసుపత్రులకు డబ్బులు కేటాయించడానికి చేతులు రావడం లేదా అని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చిన డయాలిసిస్ సెంటర్లకు రిబ్బన్ కట్ చేసి పబ్బం గడపుకుంటున్నారని విమర్శించారు.
ప్రగతి నివేదన సభకు రూ.200 కోట్లు ఖర్చు పెడతారు కానీ అందులో పదిశాతం ఉస్మానియా ఆసుపత్రికి ఇవ్వరా అని సూటిగా అడిగారు. సీఎం సామాజిక వర్గానికి చెందిన కార్పొరేట్ ఆసుపత్రుల యజమాని మాత్రం బిల్డింగ్‌ల మీద బిల్డింగ్‌లు కడుతున్నారని తెలిపారు. ఎన్నికలు రాగానే కేంద్రాన్ని తిట్టడం కేసీఆర్‌కు సాధారణమైపోయిందని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వ సాయం లేకుండా కనీసం పూట గడవదు. అన్నీ తెచ్చుకుని కేంద్రంపైనే విమర్శలా అని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి బాలేదు కాబట్టే బీజేపీని విమర్శించడం మొదలు పెట్టారని అన్నారు. ముందస్తు హడావిడి అంతా రాజకీయ జిమ్మిక్కని, ముందస్తు రాదు.. టీఆర్‌ఎస్, బీజేపీతో కలిసే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment