సాక్షి, విజయవాడ : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, ప్రధాని నరేంద్ర మోదీని అవహేళన చేయడం మానుకోవాలని బీజేపీ అధికార ప్రతినిధి సుదీశ్ రాంబట్ల హితవు పలికారు. సోమవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఈసందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు చేసిన సహాయం, కేంద్రం ఏ రాష్ట్రానికి చేయలేదని అన్నారు. గతంలో సీఎం చంద్రబాబునాయుడు స్వయంగా ఈ విషయాన్ని అంగీకరించారని గుర్తు చేశారు. రాష్ట్రానికి చేసిన సహాయంపై టీడీపీ నాయకులు ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధం అంటూ సవాల్ విసిరారు. కేంద్రం ఇచ్చిన ప్రతిపైసాకు రాష్ట్రం లెక్కలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పది సంవత్పరాల్లో ఇవ్వాల్సిన విద్యాసంస్థలను ఒకే ఏడాదిలో బీజేపీ ప్రభుత్వం ఇచ్చిందని అన్నారు.
అన్ని సక్రమంగా ఉన్న భోగాపురం ఎయిర్‌పోర్టు టెండర్‌ను సీఎం చంద్రబాబు నాయుడు ఎందుకు రద్దు చేశారో సమాధానం చెప్పాలంటూ నిలదీశారు. తాము చెప్పిన లెక్కలు తప్పని తేలితే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. పవన్ కల్యాణ్ ప్రధాని మోదీని అవహేళన చేయడం మానుకోవాలంటూ హితవు పలికారు. అసలు పవన్ జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఎందుకు పెట్టారో తెలుసుకోవాలంటూ ఎద్దేవా చేశారు. జేఎఫ్‌సీలో ఉన్న సభ్యులు ఒక్కొక్కరు ఒక్కోవిధంగా మాట్లాడుతున్నారని, ఒకరు అవును అంటే మరొకరు కాదు అంటున్నారని విమర్శించారు. ముందు జేఎఫ్‌సీ విధివిధానాలు ప్రజలకు స్పష్టంగా చెప్పాలని, ఆ తర్వాతే ఇతర విషయాలు అడగాలంటూ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment