ఎమ్మెల్యే బాలకృష్ణ
సాక్షి, అమరావతి, సాక్షి నెట్‌వర్క్: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారికంగా నిర్వహించిన దీక్షా వేదికపై నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ.. మఖ్కీ ఛూస్, శిఖండి, కొజ్జా అంటూ దుర్భాషలాడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక శాసనసభ్యుడై ఉండి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్వయానా బావమరిది అయిన బాలకృష్ణ ప్రధానిని ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలపై విస్మయం వ్యక్తమవుతోంది.
బావమరిది వ్యాఖ్యలను సమర్థిస్తున్నట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. సాక్షాత్తూ దేశ ప్రధానిపై బాలకృష్ణ ఇష్టానుసారం మాట్లాడుతున్నా చంద్రబాబు, ఇతర టీడీపీ ముఖ్యనేతలు వారించే ప్రయత్నం చేయలేదు. పైగా నవ్వులు, ఈలలు, చప్పట్లతో మరింత ప్రోత్సహించినట్టుగా ప్రవర్తించడంపై సోషల్ మీడియాలో సైతం విమర్శలు వ్యక్తమయ్యాయి. ‘ఒక శిఖండిలాగా.. ఒక కొజ్జాలాగా సీట్లు గెలవచ్చనుకుంటున్నారు... టీ కప్పులో పడ్డ ఈగను కూడా చీకుతావా.. మఖ్కీ ఛూస్ .. జాగ్రత్త!.. ఇక దండోపాయమే. ఇది వార్నింగ్. ద్రోహి..నమ్మకద్రోహి. నిన్ను పరుగెత్తించి కొడతారు.
బంకర్‌లో దాక్కున్నా సరే భరతమాత నిన్ను క్షమించదు. సమాధి చేసేస్తుంది..’ అని దూషించడంతో పాటు ‘మీ ఇంట్లో వారిని గౌరవించడం చేతకాదు. మీ భార్యను గౌరవించడం చేతకాదు..’ అంటూ వ్యక్తిగత విమర్శలు సైతం చేయడంపై బీజేపీ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నాయి. శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగాయి. పలుచోట్ల బాలకృష్ణ దిష్టిబొమ్మలను దహనం చేశారు. విశాఖ వచ్చిన గవర్నర్ నరసింహన్‌కు బీజేపీ నేతలు బాలయ్యపై ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లోని బాలకృష్ణ నివాసాన్ని ముట్టడించి ఆయన కారును అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
గవర్నర్‌కు ఫిర్యాదు
బీజేపీ శాసనసభాపక్ష నేత పి.విష్ణుకుమార్‌రాజు, ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్‌ల ఆధ్వర్యంలో పార్టీ నేతలు గవర్నర్‌ను కలిశారు. ఆనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ప్రధానిని దుర్భాషలాడిన ఎమ్మెల్యేపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం పట్ల గౌరవం లేని వ్యక్తి ప్రజాప్రతినిధిగా కొనసాగేందుకు ఎంతమాత్రం అర్హుడు కాదన్నారు. ఈ కేసులో చంద్రబాబును కూడా సాక్షిగా చేర్చాలన్నారు. బాలకృష్ణ నోటిని అదుపులో ఉంచుకోవాలని విశాఖ ఎంపీ కె.హరిబాబు హెచ్చరించారు.
ఓయూ పోలీస్ స్టేషన్‌లో బాలకృష్ణపై ఫిర్యాదు
శనివారం సాయంత్రం హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నం.1లోని బాలకృష్ణ ఇంటిని బీజేవైఎం కార్యకర్తలు పెద్ద ఎత్తున ముట్టడించారు. అదే సమయంలో తన ఇంటి నుంచి కారులో వెళుతున్న బాలకృష్ణను అడ్డుకునేందుకు ప్రయత్నించటంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వారిని చెదరగొట్టి బాలకృష్ణను భారీ బందోబస్తు మధ్య క్షేమంగా తరలించారు. ఇద్దరు మహిళా కార్యకర్తలు సహా 38 మందిని అరెస్ట్ చేశారు.
మరోవైపు నెల్లూరులోని గాంధీ బొమ్మ సెంటర్‌లో బాలకృష్ణ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించిన బీజేపీ కార్యకర్తలను టీడీపీ శ్రేణులు అడ్డుకోవటంతో ఉద్రికత్త నెలకొంది. బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పూడి తిరుపతిరావు శ్రీకాకుళం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో బాలకృష్ణపై ఫిర్యాదు చేశారు. బాలకృష్ణపై హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో కూడా ఎమ్మెల్సీ, బీజేపీ హైదరాబాద్ నగర అధ్యక్షుడు రామచందర్‌రావు ఫిర్యాదు చేశారు. దీనిపై న్యాయ నిపుణుల సలహా మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని ఓయూ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ జి.జగన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment