ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, విజయవాడ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు అత్యంత హోరాహోరీగా సాగుతున్నాయి. కర్ణాటక ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదని, ఫలితాల్లో హంగ్ వచ్చే అవకాశముందని సర్వేలు చాటుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు అధికార కాంగ్రెస్, అటు ప్రతిపక్ష బీజేపీ కర్ణాటక ఎన్నికల్లో గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. అగ్రనేతలను బరిలోకి దింపి ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇటు కాంగ్రెస్ నుంచి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, సీఎం సిద్దరామయ్య, మాజీ కేంద్రమంత్రులు, సీనియర్ నేతలు ప్రచారం చేస్తుండగా.. అటు బీజేపీ నుంచి ప్రధాని మోదీ, అమిత్‌షా, కేంద్రమంత్రులు, యడ్యూరప్ప తదితరులు జోరుగా ప్రచారంలో మునిగిపోయారు.
ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ ప్రచారం హోరాహోరీగా సాగుతుండగా.. కన్నడలో ఉన్న తెలుగు ఓటర్లను ఆకట్టుకునేందుకు తెలుగు రాష్ట్రాల బీజేపీ, కాంగ్రెస్ నేతలు కూడా రంగంలోకి దిగారు. తెలుగు ఓటర్లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పేరొందిన నాయకులు ప్రచారం చేశారు. మధ్యలో ఉద్యోగ సంఘాల నేత అశోక్‌బాబు లాంటివాళ్లు కూడా హంగామా చేశారు.
కర్ణాటకలో ఉన్న తెలుగు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి.. తెలుగు రాష్ట్రాల నుంచి అక్కడికి వెళ్లే బస్సులను వదిలిపెట్టడం లేదు. తాజాగా విజయవాడ ఆర్టీసీ కాంప్లెక్స్‌లో కర్ణాటకకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న బస్సుల్లో బీజేపీ నేతలు ప్రచారం చేశారు. కర్ణాకటలో బీజేపీకే ఓటు వేయాలని ప్రయాణికులను వారు కోరారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని ప్రయాణికులు వివరించారు. టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కయి.. బీజేపీని ఓడించాలని చూస్తున్నారని, ప్రజలు దీనిని గమనించాలని బీజేపీ నేతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment