లక్నో : బీజేపీ నాయకులు ఆచితూచి మాట్లాడాలంటూ ఏకంగా ప్రధాని మోదీ హెచ్చరించినా వారి తీరు మారడం లేదు. ఇటీవలి కాలంలో పలువురు బీజేపీ నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లోకెక్కుతున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్‌తో చేతులు కలిపేందుకు సిద్ధమైన మమతా బెనర్జీని సూర్పణకతో పోల్చారు. రావణుని సోదరి అయిన శూర్పణకకు పట్టిన గతే ఆమెకు పడుతుందంటూ వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా మమత ముక్కు కోస్తారంటూ వివాదానికి తెరతీశారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీని రావణునితో పోలుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
‘బెంగాల్ మరో కాశ్మీర్ అయ్యేది’..
ఇటీవలి కాలంలో బెంగాల్‌లో చెలరేగిన అల్లర్ల నేపథ్యంలో సురేంద్ర ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. బెంగాల్‌లో హిందువులకు రక్షణ లేదన్నారు. ప్రజా సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కనీస బాధ్యత కూడా నిర్వర్తించడం లేదని విమర్శించారు. బంగ్లాదేశ్‌కు చెందిన ఉగ్రవాదులు బెంగాల్‌లో చొరబడి హిందువులను హింసిస్తున్నారన్నారు. మోదీ వంటి ప్రధాని ఉండడం మన అదృష్టం అని.. లేకుంటే ఈపాటికి బెంగాల్ మరో కాశ్మీర్ అయ్యేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలోనూ సురేందర్ సింగ్ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శల పాలయ్యారు. ఉన్నావ్ అత్యాచార కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కుల్దీప్ సింగార్‌ను సమర్థిస్తూ బాధితురాలి గురించి అసభ్యకర వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment