సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మొదటిసారిగా అసెంబ్లీలో తెలుగులో మాట్లాడి ఆకట్టుకున్నారు. ఆదివారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో తాను తెలుగులోనే మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పారు. ఈ సందర్భంగా తెలుగు బాగా నేర్చుకోవాలని టీఆర్‌ఎస్ ఎమెల్యేలు ఆయనకు సూచించారు. గవర్నర్ ప్రసంగం బాగుందని, కొన్ని అంశాల్లో తనకు అనుమానాలు ఉన్నాయన్నారు. సభలో గవర్నర్ ప్రసంగంలోని అంశాల గురించి మాట్లాడాలేకానీ కొందరు ఎమ్మెల్యేలు రాజకీయాల గురించి మాట్లాడారన్నారు.
ఏ పార్టీ సీఎం ఉంటే ఆయన కాళ్లు పట్టుకునే ప్రజాప్రతినిధులు కొందరు ఉంటారని, చంద్రబాబు మొదలుకొని వైఎస్, కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇప్పుడు కూడా అలా కాళ్లు పట్టుకొని తిరుగుతున్న నేతలు ఉన్నారని పేర్కొన్నారు. అయితే, సీఎంలు జాగ్రత్తగా ఉండాలని, వాళ్లు కాళ్లు పట్టుకోవడమే కాకుండా కాళ్లు పట్టి గుంజే అవకాశం కూడా ఉంటుందని అన్నారు. కేసీఆర్ కిట్ పథకం బాగుందని, అందులో రాష్ట్ర వాటా ఎంత? కేంద్ర వాటా ఎంత? అనే వివరాలు ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఉస్మానియా ఆసుపత్రి భవనం కూలిపోయే పరిస్థితి నెలకొందని, హెరిటేజ్ అధికారులతో మాట్లాడి త్వరలో కొత్త భవనం కట్టించాలన్నారు.
కంటివెలుగులో ఎంతమందికి ఆపరేషన్లు అవసరం అనేది చెప్పలేదని, అనేక మంది అద్దాల కోసం తిరుగుతున్నారన్నారు. ప్రభుత్వం యూనివర్సిటీలు, కేజీ టూ పీజీ, ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. ఆసరా పెన్షన్లు కొంతమందికి రావడం లేదని, కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్‌లో పెళ్లయిన తరువాత ఒకటి రెండేళ్లకు చెక్‌లు వస్తున్నాయన్నారు. డ్రగ్స్ కేసులో ఎంతమంది సెలబ్రిటీలపై కేసులు పెట్టారు? ఎంతమందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారో ప్రభుత్వం చెప్పాలన్నారు. ధూల్‌పేట్ వాసులకు పునరావాసం విషయంలో పక్కా చర్యలు లేకుండాపోయాయన్నారు. సీఎం కూడా వస్తానని రాలేదని, ఆ కుటుంబాలకు పిల్లల ఫీజుల చెల్లించే పరిస్థితి లేకుండాపోయిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment