బెంగళూరు : ఇన్నాళ్లు అందానికి సంబంధించిన విమర్శలు కేవలం గ్లామర్ ఫీల్డ్‌లో మాత్రమే కనిపించేవి. కానీ ఈ సారి ఎన్నికల్లో మాత్రం కొందరు నాయకులు ప్రత్యర్థుల ముఖారవిందం గురించి విమర్శలు చేయడం గమనార్హం. కొన్ని రోజుల క్రితం కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి.. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ.. బహిరంగ సభకు హాజరవ్వడానికి ముందు మోదీ మేకప్ చేసుకుంటారని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే రాజూ కాగే ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘కుమారస్వామి.. మోదీ జనాల్లోకి వచ్చే ముందు పది సార్లు పౌడర్ రాసుకుంటారని... రోజుకు పది జతల బట్టల మారుస్తారని ఆరోపిస్తున్నారు. అరే మోదీ అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. ఆయనకు మేకప్ అవసరం లేదు. అదే మీరు రోజుకు 100 సార్లు స్నానం చేసినా వేస్టే.. మీరు బర్రెలానే కనిపిస్తారు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాజు వ్యాఖ్యలు కన్నడ నాట వివాదాన్ని రాజేస్తున్నాయి.
గతంలో కుమారస్వామి మోదీని ఉద్దేశిస్తూ.. జనాల్లోకి రావడానికంటే ముందు మోదీ మేకప్, వ్యాక్సింగ్ చేసుకుని వస్తారు. అందుకే ఆయన ముఖం మీద ఆ మెరుపు అలానే ఉంటుంది. అదే మన విషయం తీసుకుంటే.. ఈ రోజు ఉదయం స్నానం చేస్తే.. తిరిగి మరునాటి ఉదయమే స్నానం చేసి మొహం కడుగుతాం. దాంతో మన మొహాలు కెమరాలో సరిగా కనపడవు. అందుకే మీడియా మిత్రుల మన ముఖాలను ప్రసారం చేయడానికి ఆసక్తి చూపరు. కేవలం మోదీని మాత్రమే ప్రసారం చేస్తారు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment