సాక్షి, విశాఖపట్నం : తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలను కూడా అట్టహాసంగా ప్రచార ఆర్భాటంలా చేస్తూ.. ప్రధాని మోదీను దోషిగా నిలబెట్టేవిధంగా చంద్రబాబు ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీజేపీ ఏపీ ఎమ్మెల్సీ మాధవ్ ఆరోపించారు. ప్రధాని మోదీపై చంద్రబాబు వ్యాఖ్యలు అత్యంత హేయమైనవని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి తన స్థాయిని దిగజార్చి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. వెంటనే సీఎం తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో బీజేపీ పర్యటించలేదని, తుఫాను సాయాన్ని కేంద్రం అడ్డుకుంటోందన్న సీఎం వ్యాఖ్యలు వాస్తవం కాదన్నారు. తుఫాను వచ్చిన వెంటనే బీజేపీ ఏపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు ఆధ్వర్యంలో ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించామని, ఆ నివేదిక ప్రధానికి కూడా అందజేశామని చెప్పారు. తుఫాను బాధితులకు అందించిన సాయాన్ని పెద్ద పెద్ద హోర్డింగ్స్ రూపంలో బాబు ప్రచారం చేసుకోవటాన్ని ప్రజలు తిట్టుకుంటున్నారని విమర్శించారు. తుఫాను సాయం పచ్చజెండా పట్టుకొని.. పచ్చ కండువాను కప్పుకున్నవారికే అందుతోందని విమర్శించారు. పార్టీలకతీతంగా తుఫాను బాధితులకు సహాయం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పలాస వంటి ప్రాంతాల్లో ఎన్టీఆర్ సుజల స్రవంతి టాంకర్లు మాత్రమే తిరగాలని నిబంధన విధించడం నీచమైన ఆలోచన మండిపడ్డారు. తిత్లీ తుఫాను బాధితులను కేంద్రం ఉదారంగా ఆదుకుంటోందని, తల్చేర్-కోలార్ విద్యుత్ లైన్ పునరుద్ధరించి 24 గంటల్లో విద్యుత్‌ను కేంద్రం అందించిందన్నారు. రాజాం-పలాస 400 కేవీహెచ్‌వీ లైన్‌ను రేపటికల్లా పునరుద్ధరిస్తామన్నారు. రేపు కేంద్ర హార్టికల్చర్ బోర్డ్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తుందని, జీడీ, కొబ్బరి, వంటి పంట నష్టాలను పరిశీలిస్తుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment