
బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు (ఫైల్‌ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై బీజేపీ ఎంపీ జీవిఎల్ నరసింహరావు తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. చంద్రబాబును ప్రధానిని చేస్తామని ఏ ఒక్క నేతా ప్రతిపాదించలేదని అన్నారు. తుమ్మితే ఊడిపోయే పదవి అని అప్పట్లో ఆయనే ప్రధాని పదవికి దూరంగా ఉండి త్యాగం చేసినట్టు ఫోజులు కొడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు పగటికలలు కంటున్నారని ఎద్దేవా చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ధర్మపోరాట సభలు పెట్టడం పట్ల జీవీఎల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర నిధులతో పార్టీ సభలు పెడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. తిరుమలను రాజకీయ వ్యవస్థగా మార్చాలని చూస్తున్నారని అన్నారు. అర్చకులను తొలగించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. అర్చకులను తొలగించినందుకు చంద్రబాబు చెంపలేసుకోవాలని డిమాండ్ చేశారు.
తిరుమల శ్రీవారి ఆభరణాల మాయంపై విచారణకు ఎందుకు వెనుకాడుతున్నారని ఆయన ప్రశ్నించారు. లక్షల కోట్ల రూపాయల విలువైన ఆభరణాలు ఏమయ్యాయో వెల్లడించాలని జీవీఎల్ నరసింహారావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment