ప్రచారంలో కిషన్‌రెడ్డికి హారతి ఇస్తున్న మహిళలు
సాక్షి, సిటీబ్యూరో: లోక్‌సభ బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థులు సైతం ప్రచార జోరు పెంచారు. వారివారి కుటుంబ సభ్యులంతా కలిసి ఆయా నియోజకవర్గాల్లోని ముఖ్య నాయకులతో సమావేశమై గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నారు. ఓ వైపు పార్టీ కేడర్‌ను ఎన్నికలకు సన్నద్ధం చేస్తూనే.. మరో వైపు ఇంటింటికీ తిరిగి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో చేసిన అభివృద్ధి, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలనువివరిస్తున్నారు. మరోసారి తమకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నారు. ఇంకోవైపు పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఓటింగ్ పరంగా తమకు నష్టం కలిగించే ఇండిపెండెంట్ అభ్యర్థులను బుజ్జగించే పనిలో నిమగ్నమయ్యారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రధాని మోదీకి ప్రజల్లో ఉన్న ఆకర్షణ, అంకిత భావంతో పనిచేసే కార్యకర్తలు, ఓటర్లు ఉండటం, గ్రేటర్ పరిధిలోని నాలుగు స్థానాలపై అధిష్టానం దృష్టి సారించడం ఆ పార్టీ అభ్యర్థులకు ప్రధాన బలాలుగా ఉన్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఘోర పరాభవానికి గురికావడం బలహీనతగా చెప్పొచ్చు.
సీనియర్లతో కలిసి కిషన్‌రెడ్డి ప్రచారం
సికింద్రాబాద్ లోక్‌సభ నుంచి బీజేపీ తరఫున బరిలో నిలిచిన జి.కిషన్‌రెడ్డి సీతాఫల్‌మండి డివిజన్‌లో ఎన్నికల ప్రచారాన్ని బుధవారం ప్రాభించారు. బీదలబస్తీ, పార్శిగుట్ట, వారాసీగూడ ప్రాం తాల్లో ఆయన పర్యటించి ఎన్నికల ప్రచారం చేశారు. లష్కర్ ప్రజలు నరేంద్రమోదీ పాలనను మరోసారి కావాలనుకుంటున్నారని, ప్రజల్లో మోదీ ఇమేజ్, స్థానికంగా పార్టీకున్న పట్టు తనను భారీ మెజార్టీతో గెలిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సుస్థిర, సమర్థవంతమైన పాలన కేవలం బీజేపీతోనే సాధ్యమని చెబుతున్నారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, ఎంపీ దత్తాత్రేయతో కలిసి కిషన్‌రెడ్డి బర్కత్‌పురలో ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు.
‘ఆప్‌కీ బాత్ మోదీ సర్కార్’తో రామచందర్‌రావు
మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా దిగిన రామచందర్‌రావు తన ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. ‘ఆప్‌కీబాత్ మోదీ సర్కార్’ నినాదంతో ఆయన ముందుకు సాగుతున్నారు. ఈ మేరకు ఆయన బుధవారం ఎల్‌బీనగర్ నియోజకవర్గంలో సుడిగాలి ప్రచారం నిర్వహించారు. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో, ప్రియదర్శిని పార్కులో మార్నింగ్ వాకర్స్‌ను కలిశారు. గడ్డిఅన్నారంలో సీనియర్ సీటిజన్స్‌తోను, ఎల్‌బీనగర్‌లోని మేధావివర్గంతోను, రంగారెడ్డి జిల్లా న్యాయవాదులతో విడివిడిగా సమావేశమయ్యారు. మన్సూరాబాద్‌లోని నియోజకవర్గ కార్యాలయం లాల్‌బహదూర్ భవన్‌లో పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
ముఖ్య కార్యకర్తలతో చేవెళ్ల అభ్యర్థి
ఈ సెగ్మెంట్ బీజేపీ అభ్యర్థి బి. జనార్దన్‌రెడ్డి ఇప్పటికే మహేశ్వరం, రాజేంద్రనగర్, శేర్‌లింగంపల్లి, చేవెళ్ల, పరిగి, వికారాబాద్, తాండూరు ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. వికారాబాద్ పేరును అనంతగిరిగా మారుస్తానని హామీ ఇచ్చారు. తాజాగా బుధవారం ఆయన ఆయా ప్రాంతాల్లో పర్యటించి తనకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా అభ్యర్థించారు. సుస్థిర ప్రభుత్వంతోనే దేశం సుభిక్షంగా ఉంటుందని ప్రజలకు స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మద్దుతునిచ్చి గెలిపించాలిని కోరారు.
నేటి నుంచి భగవంతరావు ప్రచారం
గత ఎన్నికల్లో ఎంఐఎంకు గట్టిపోటీ ఇచ్చి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు భగవంతరావు సిద్ధమయ్యారు. పాతబస్తీలో బీజేపీకి గట్టిపట్టున్న ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తున్నారు. బుధవారం ఉదయం సిద్ధి అంబర్ బజార్‌లోని బెహతి భవన్‌లో బీజేపీ హైదరాబాద్ పార్లమెంటరీ కార్యాలయాన్ని ప్రారంభించారు. రాత్రి కా>ర్వాన్ అసెంబ్లీ నియోజకవర్గంలోని పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. గెలుపు కోసం వ్యూహరచన చేస్తున్న ఆయన గురువారం ఉదయం మలక్‌పేట నుంచి తన ప్రచారాన్ని మొదలు పెట్టేందుకు సిద్ధమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment