లక్నో: లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీలు దళిత ఓటర్లకు గాలంవేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. దానిలో భాగంగానే బీజేపీ ఉత్తరప్రదేశ్‌లో ‘గ్రామ స్వరాజ్ అభియాన్’ పేరుతో ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దళితులు, గిరిజనులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కేంద్రమంత్రులు, పార్టీ ఎంపీలు, ముఖ్యనేతలు, పర్యటించి దళిత వాడల్లో భోజనం చేసి, అక్కడే బస చేయటమే ఈ కార్యక్రమం ఉద్దేశం. బీజేపీ నేతలు దళిత వాడల్లో పర్యటించడాన్ని బీఎస్పీ అధినేత్రి మాయావతి తీవ్రంగా ఖండిచారు. దళిత వ్యతిరేక విధానాలు అవలంబించే బీజేపీ దళిత వాడల్లో బస చేయడంలో ఉద్దేశం ఏంటని ఆమె ప్రశ్నించారు.
ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఓట్ల కోసమే బీజేపీ నేతలు దళిత, గిరిజన వాడల్లో పర్యటిస్తున్నారని విమర్శించారు. బీజేపీ నేతల పర్యటనను తిప్పికొట్టేందుకు, బహుజనుల ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు బీఎస్పీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు, జిల్లాస్థాయి నాయకత్వం సిద్ధంగా ఉండాలని మాయావతి ఆదేశించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీజేపీపై దళితులు, గిరిజనులు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, దానినుంచి ప్రజలను దారిమళ్లించడం కోసమే బీజేపీ కొత్త నాటకం మొదలుపెట్టిందని ఆమె విమర్శించారు. ఏప్రిల్ 2న దేశవ్యాప్తంగా జరిగిన భారత్‌బంద్‌లో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకోవడం బీజేపీని ఇరుకునపెట్టే అంశమే. బంద్‌లో చోటుచేసుకున్న ఘర్షణలో మధ్యప్రదేశ్‌లో 12 మంది మృతి చెందారని, వాటి నుంచి తప్పించుకునేందుకే బీజేపీ నేతలు దళిత వాడల్లో పర్యటిస్తున్నారని బీఎస్‌పీ నేతలు విమర్శిస్తున్నారు.
దళితుల, ఆదివాసీల, బీసీల సంక్షేమాన్ని బీజేపీ పూర్తిగా విస్మరించిందని మాయావతి ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీలు నాణెనికి రెండు వైపుల్లాంటి పార్టీలని, వారు ఎన్నడూ దళితుల అభ్యున్నతి కృషిచేయలేదని మాయావతి విమర్శించారు. ఉత్తరప్రదేశ్ జనాభాలో దళిత సామాజిక వర్గం 20శాతం వరకు ఉండటం.. రాజకీయంగా వారు అత్యంత ప్రాధాన్య వర్గాలు కావడంతో.. ఎన్నికల్లో వారిని ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు ఇప్పటినుంచి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి కేంద్రంలో భారీ మెజారిటీ రావడానికి దళిత ఓట్లు ఎంతో ఉపకరించాయి.
Comments
Please login to add a commentAdd a comment