Dalit voters
-
దళితులకు టీడీపీ నేతల బెదిరింపులు
-
టీడీపీకి ఓటేయకపోతే అంతుచూస్తాం
-
టీడీపీకి ఓటేయకపోతే అంతుచూస్తాం
చంద్రగిరి(చిత్తూరు జిల్లా) : అధికార పార్టీ నాయకుల దౌర్జన్యం శ్రుతిమించింది. ఎన్నికల్లో టీడీపీకి ఓటేయకపోతే అంతుచూస్తామంటూ చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ నాయకులు దళితులపై దాడులకు దిగారు. చంద్రగిరి మండలం పనపాకం దళితవాడలో ఈ అమానుషం చోటు చేసుకుంది. టీడీపీ నుంచి పసుపు–కుంకుమ తీసుకుంటున్నారు కదా! మీరు కానీ టీడీపీకి ఓటు వేయకపోతే అంతు చూస్తాం అంటూ బెదిరింపులకు దిగారు. మూడురోజులుగా రోజూ రాత్రి పూట దళితవాడ వాసుల వద్దకు వెళ్లి భయపెడుతూ వస్తున్న టీడీపీ నేతలు శనివారం రాత్రి శ్రుతిమించి వారిపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. టీడీపీ మండల అధ్యక్షుడు సుబ్రమణ్యం నాయుడు, జూపార్క్ డైరెక్టర్ మణి యాదవ్, ఆ పార్టీ నాయకులు రమేష్, గురవయ్య, రాజారత్నం, వారి అనుచరులు కలసి మూకుమ్మడిగా దళితవాడలోకి వెళ్లి బీభత్సం సృష్టించారు. కనపడిన వారందరినీ చితకబాదారు. చివరకు మహిళలు, పిల్లలను కూడా వదిలిపెట్టలేదు. మహిళల బట్టలు చింపేయడమేగాక.. తరిమి తరిమికొట్టారు. చిన్న పిల్లలని కూడా చూడకుండా దాడి చేశారు. అంతేగాక పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తామంటూ వారిని బెదిరించారు. రక్షణ కల్పించండి : టీడీపీ నేతల దాడులతో భయాందోళనకు గురైన పనపాకం దళితవాడ వాసులు తమకు రక్షణ కల్పించాలంటూ అధికారులను వేడుకుంటున్నారు. కనీసం మహిళలని కూడా చూడకుండా టీడీపీ నాయకులు విచక్షణరహితంగా దాడి చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. స్వేచ్ఛగా ఓటు వేసుకోవడాన్ని కూడా టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారన్నారు. -
‘ఓట్ల కోసం బీజేపీ కొత్త నాటకం’
లక్నో: లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీలు దళిత ఓటర్లకు గాలంవేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. దానిలో భాగంగానే బీజేపీ ఉత్తరప్రదేశ్‌లో ‘గ్రామ స్వరాజ్ అభియాన్’ పేరుతో ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దళితులు, గిరిజనులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కేంద్రమంత్రులు, పార్టీ ఎంపీలు, ముఖ్యనేతలు, పర్యటించి దళిత వాడల్లో భోజనం చేసి, అక్కడే బస చేయటమే ఈ కార్యక్రమం ఉద్దేశం. బీజేపీ నేతలు దళిత వాడల్లో పర్యటించడాన్ని బీఎస్పీ అధినేత్రి మాయావతి తీవ్రంగా ఖండిచారు. దళిత వ్యతిరేక విధానాలు అవలంబించే బీజేపీ దళిత వాడల్లో బస చేయడంలో ఉద్దేశం ఏంటని ఆమె ప్రశ్నించారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఓట్ల కోసమే బీజేపీ నేతలు దళిత, గిరిజన వాడల్లో పర్యటిస్తున్నారని విమర్శించారు. బీజేపీ నేతల పర్యటనను తిప్పికొట్టేందుకు, బహుజనుల ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు బీఎస్పీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు, జిల్లాస్థాయి నాయకత్వం సిద్ధంగా ఉండాలని మాయావతి ఆదేశించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీజేపీపై దళితులు, గిరిజనులు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, దానినుంచి ప్రజలను దారిమళ్లించడం కోసమే బీజేపీ కొత్త నాటకం మొదలుపెట్టిందని ఆమె విమర్శించారు. ఏప్రిల్ 2న దేశవ్యాప్తంగా జరిగిన భారత్‌బంద్‌లో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకోవడం బీజేపీని ఇరుకునపెట్టే అంశమే. బంద్‌లో చోటుచేసుకున్న ఘర్షణలో మధ్యప్రదేశ్‌లో 12 మంది మృతి చెందారని, వాటి నుంచి తప్పించుకునేందుకే బీజేపీ నేతలు దళిత వాడల్లో పర్యటిస్తున్నారని బీఎస్పీ నేతలు విమర్శిస్తున్నారు. దళితుల, ఆదివాసీల, బీసీల సంక్షేమాన్ని బీజేపీ పూర్తిగా విస్మరించిందని మాయావతి ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీలు నాణెనికి రెండు వైపుల్లాంటి పార్టీలని, వారు ఎన్నడూ దళితుల అభ్యున్నతి కృషిచేయలేదని మాయావతి విమర్శించారు. ఉత్తరప్రదేశ్ జనాభాలో దళిత సామాజిక వర్గం 20శాతం వరకు ఉండటం.. రాజకీయంగా వారు అత్యంత ప్రాధాన్య వర్గాలు కావడంతో.. ఎన్నికల్లో వారిని ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు ఇప్పటినుంచి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి కేంద్రంలో భారీ మెజారిటీ రావడానికి దళిత ఓట్లు ఎంతో ఉపకరించాయి. -
దళితుల దయ.. వారి ప్రాప్తి!
సాక్షి, ముంబై: నగరం, తూర్పు, పశ్చిమ శివారు ప్రాంతాల్లో గురువారం ఆరు లోక్‌సభ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో దళిత ఓటర్లు ప్రధానపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఈ ఆరు నియోజక వర్గాల్లో 9.62 లక్షల మంది దళిత ఓటర్లు ఉన్నారు. దీన్ని బట్టి ఒక్కో లోక్‌సభ నియోజకవర్గంలో సుమారు 1.50 లక్షలకుపైగా దళితులే ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఆయా నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం పెరగాలన్నా, తగ్గాలన్నా, చివరకు బరిలో దిగిన అభ్యర్థుల జాతకాలు మార్చేది కూడా దళిత ఓటరులే కావడంతో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి వివిధ పార్టీల నాయకులు వారిని దువ్వే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. దళిత ఓట్లతోపాటు ఇతర కులాల ఓట్లపై నాయకులు బేరీజు వేసుకున్నారు. దీంతో తమకు విజయం తథ్యమని ఎవరికి వారే అంచనాలు వేసుకున్నారు. ఈ ఎన్నికల బరిలో దిగిన వివిధ పార్టీలతోపాటు దళిత అభ్యర్థులు కూడా ఉన్నారు. దళిత ఓట్లు తమకే వస్తాయంటూ కొందరు గంపెడాశతో ఉన్నారు. దక్షిణ-మధ్య ముంబై లోక్‌సభ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి ఏక్నాథ్ గైక్వాడ్, శివసేనకు చెందిన రాహుల్ శెవాలే దళిత ఓట్ల కోసం పోటీ పడ్డారు. మహాకూటమిలో ఆర్పీఐ (రాందాస్ ఆఠవలే) భాగస్వామి కావడంతో ఆ కూటమి అభ్యర్థి శెవాలే గెలుపుపై ధీమాతో ఉన్నారు. అదేవిధంగా గైక్వాడ్ తను అంబేద్కర్ అనుయాయుడినని చెప్పుకుంటూ ఓటు బ్యాంకును కాపాడుకుంటున్నారు. మాటుంగా లేబర్ క్యాంప్‌లో మహారాష్ర్ట నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్), శివసేన పార్టీల కారణంగా ఓట్లు చీలిపోయే ప్రమాదం ఉంది. ఈ నియోజకవర్గానికి చెందిన దళిత కార్యకర్తలతో శెవాలేకు సత్సంబంధాలు ఉన్నాయి. దీంతో గైక్వాడ్, ఎమ్మెన్నెస్ కంటే శెవాలేకే వాతావరణం అనుకూలంగా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈశాన్య ముంబై లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్సీపీకి చెందిన సంజయ్ పాటిల్‌కు దళితులతో సత్సంబంధాలున్నాయి. కిరీట్ సోమయ్య దళిత బస్తీ వైపు తిరిగి చూడకపోవడంతో వారు అసంతృప్తితో ఉన్నారు. ఆమ్ ఆద్మీ తరఫున పోటీచేస్తున్న మేథా పాట్కర్‌పై దళితులకు సానుభూతి ఉంది. దీంతో ఆమెకు దళితుల ఓట్లు భారీగానే లభించే అవకాశాలున్నాయి. ఉత్తర ముంబైలో దళితుల ఓట్ల పరిస్థితి భిన్నంగా ఉంది. ఇక్కడ సంజయ్ నిరుపమ్ వైపే వీరంతా ఎక్కువ శాతం మొగ్గుచూపే ఆస్కారముంది. బీజేపీకి చెందిన గోపాల్ శెట్టికి దళిత ప్రాంతాల్లో అంతగా ప్రభావం లేదు. ఆ వర్గానికి చెందిన నాయకులెవరూ అతడివైపు తిరగడంలేదనే విమర్శలున్నాయి. ఇదే సమయంలో నిరుపమ్ దళిత బస్తీల్లో తిరుగుతూ వారి మన్ననలు, కార్యకర్తల ఆత్మవిశ్వాసాన్ని చూరగొన్నారు. అదేవిధంగా వాయవ్య ముంబై లోక్‌సభ నియోజకవర్గంలో గురుదాస్ కామత్‌కు దళిత కార్యకర్తలతో నేరుగా సంబంధాలు లేవు. ఆయన వారితో భేటీ కూడా కాలేదనే ఫిర్యాదులున్నాయి. దీంతో దళితుల ఓట్లు శివసేనకు చెందిన గజానన్ కీర్తికర్‌కు పోలయ్యే అవకాశాలున్నాయి. ఉత్తర-మధ్య ముంబై లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రియాదత్‌కు దళిత ఓట్లు పోలయ్యే అవకాశాలు ఉన్నాయి. దత్‌తోపాటు ఎమ్మెల్యే కృపాశంకర్‌సింగ్, నవాబ్ మలిక్, జనార్థన్ చాందుర్కర్ దళితులతో సంబంధాలున్నాయి. కాని వారి ఓట్లు దత్కే పోలయ్యే విధంగా ప్రయత్నాలు జరిగాయి. దక్షిణ ముంబైలో కూడా ఇదే పరిస్థితి ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి మిలింద్ దేవరాకు పూర్వం నుంచి దళిత కార్యకర్తలతో మంచి సంబంధాలున్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో కూడా వీరి మద్దతు ఆయనకే తప్పకుండా ఉండే అవకాశం ఉంది. కాని మహాకూటమిలో రాందాస్ ఆఠవలే ఉండడంవల్ల దళిత ఓట్లు శివసేన అభ్యర్థికీ పోలయ్యే అవకాశాలు లేకపోలేదు. దీంతో దక్షిణ ముంబైలో దళితుల ఓట్లు కాంగ్రెస్‌కు, శివసేనకు చీలిపోయే అవకాశాలున్నాయి.