సాక్షి, ముంబై: నగరం, తూర్పు, పశ్చిమ శివారు ప్రాంతాల్లో గురువారం ఆరు లోక్‌సభ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో దళిత ఓటర్లు ప్రధానపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఈ ఆరు నియోజక వర్గాల్లో 9.62 లక్షల మంది దళిత ఓటర్లు ఉన్నారు. దీన్ని బట్టి ఒక్కో లోక్‌సభ నియోజకవర్గంలో సుమారు 1.50 లక్షలకుపైగా దళితులే ఉన్నట్లు స్పష్టమవుతోంది.
ఆయా నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం పెరగాలన్నా, తగ్గాలన్నా, చివరకు బరిలో దిగిన అభ్యర్థుల జాతకాలు మార్చేది కూడా దళిత ఓటరులే కావడంతో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి వివిధ పార్టీల నాయకులు వారిని దువ్వే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. దళిత ఓట్లతోపాటు ఇతర కులాల ఓట్లపై నాయకులు బేరీజు వేసుకున్నారు. దీంతో తమకు విజయం తథ్యమని ఎవరికి వారే అంచనాలు వేసుకున్నారు. ఈ ఎన్నికల బరిలో దిగిన వివిధ పార్టీలతోపాటు దళిత అభ్యర్థులు కూడా ఉన్నారు.
దళిత ఓట్లు తమకే వస్తాయంటూ కొందరు గంపెడాశతో ఉన్నారు. దక్షిణ-మధ్య ముంబై లోక్‌సభ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి ఏక్‌నాథ్ గైక్వాడ్, శివసేనకు చెందిన రాహుల్ శెవాలే దళిత ఓట్ల కోసం పోటీ పడ్డారు. మహాకూటమిలో ఆర్పీఐ (రాందాస్ ఆఠవలే) భాగస్వామి కావడంతో ఆ కూటమి అభ్యర్థి శెవాలే గెలుపుపై ధీమాతో ఉన్నారు. అదేవిధంగా గైక్వాడ్ తను అంబేద్కర్ అనుయాయుడినని చెప్పుకుంటూ ఓటు బ్యాంకును కాపాడుకుంటున్నారు. మాటుంగా లేబర్ క్యాంప్‌లో మహారాష్ర్ట నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్), శివసేన పార్టీల కారణంగా ఓట్లు చీలిపోయే ప్రమాదం ఉంది. ఈ నియోజకవర్గానికి చెందిన దళిత కార్యకర్తలతో శెవాలేకు సత్సంబంధాలు ఉన్నాయి. దీంతో గైక్వాడ్, ఎమ్మెన్నెస్ కంటే శెవాలేకే వాతావరణం అనుకూలంగా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఈశాన్య ముంబై లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్సీపీకి చెందిన సంజయ్ పాటిల్‌కు దళితులతో సత్సంబంధాలున్నాయి. కిరీట్ సోమయ్య దళిత బస్తీ వైపు తిరిగి చూడకపోవడంతో వారు అసంతృప్తితో ఉన్నారు. ఆమ్ ఆద్మీ తరఫున పోటీచేస్తున్న మేథా పాట్కర్‌పై దళితులకు సానుభూతి ఉంది. దీంతో ఆమెకు దళితుల ఓట్లు భారీగానే లభించే అవకాశాలున్నాయి. ఉత్తర ముంబైలో దళితుల ఓట్ల పరిస్థితి భిన్నంగా ఉంది. ఇక్కడ సంజయ్ నిరుపమ్ వైపే వీరంతా ఎక్కువ శాతం మొగ్గుచూపే ఆస్కారముంది. బీజేపీకి చెందిన గోపాల్ శెట్టికి దళిత ప్రాంతాల్లో అంతగా ప్రభావం లేదు. ఆ వర్గానికి చెందిన నాయకులెవరూ అతడివైపు తిరగడంలేదనే విమర్శలున్నాయి.
ఇదే సమయంలో నిరుపమ్ దళిత బస్తీల్లో తిరుగుతూ వారి మన్ననలు, కార్యకర్తల ఆత్మవిశ్వాసాన్ని చూరగొన్నారు. అదేవిధంగా వాయవ్య ముంబై లోక్‌సభ నియోజకవర్గంలో గురుదాస్ కామత్‌కు దళిత కార్యకర్తలతో నేరుగా సంబంధాలు లేవు. ఆయన వారితో భేటీ కూడా కాలేదనే ఫిర్యాదులున్నాయి. దీంతో దళితుల ఓట్లు శివసేనకు చెందిన గజానన్ కీర్తికర్‌కు పోలయ్యే అవకాశాలున్నాయి. ఉత్తర-మధ్య ముంబై లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రియాదత్‌కు దళిత ఓట్లు పోలయ్యే అవకాశాలు ఉన్నాయి. దత్‌తోపాటు ఎమ్మెల్యే కృపాశంకర్‌సింగ్, నవాబ్ మలిక్, జనార్థన్ చాందుర్కర్ దళితులతో సంబంధాలున్నాయి.
కాని వారి ఓట్లు దత్‌కే పోలయ్యే విధంగా ప్రయత్నాలు జరిగాయి. దక్షిణ ముంబైలో కూడా ఇదే పరిస్థితి ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి మిలింద్ దేవరాకు పూర్వం నుంచి దళిత కార్యకర్తలతో మంచి సంబంధాలున్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో కూడా వీరి మద్దతు ఆయనకే తప్పకుండా ఉండే అవకాశం ఉంది. కాని మహాకూటమిలో రాందాస్ ఆఠవలే ఉండడంవల్ల దళిత ఓట్లు శివసేన అభ్యర్థికీ పోలయ్యే అవకాశాలు లేకపోలేదు. దీంతో దక్షిణ ముంబైలో దళితుల ఓట్లు కాంగ్రెస్‌కు, శివసేనకు చీలిపోయే అవకాశాలున్నాయి.
దళితుల దయ.. వారి ప్రాప్తి!
Published Fri, Apr 25 2014 11:12 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement