సాక్షి, బళ్లారి : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా,కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్పలు శతవిధాలా ప్రయత్నం చేసినా కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి రావడం కల‍్ల అని కాంగ్రెస్ సినియర్ నేత, విధాన పరిషత్ సభ్యుడు ఉగ్రప్ప పేర్కొన్నారు. ఆయన బుధవారం నగరంలోని ప్రభుత్వ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు.
దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాప్రభుత్వ వ్యవస్థనే భ్రష్టుపట్టిస్తున్నారని మండిపడ్డారు. దేశ వ్యాప్తంగా బీజేపీ గాలి రోజు రోజుకూ తగ్గుముఖం పడుతోందన్నారు. ఇందుకు ఇటీవల జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలే సాక్ష్యం అన్నారు. గుజరాత్‌లో కూడా బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటికీ నైతికంగా కాంగ్రెస్‌దే విజయమని చెప్పారు.
కర్ణాటకలో బీజేపీ పాచికలు పారవన్నారు. యడ్యూరప్ప బీజేపీ పరివర్తన యాత్ర పేరుతో అన్ని జిల్లాలు పర్యటిస్తున్నారని, అయితే ఆయా జిల్లాలో ప్రజల నుంచి పెద్ద స్పందన లేదని గుర్తుచేశారు. కాంగ్రెస్ హయాంలో ఎలాంటి అవినీతి అక్రమాలకు తావు లేకుండా పాలన జరుగుతుందనే విషయం ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. అక్రమ మైనింగ్ సంబంధించి, రాష్ట్రాల సరిహద్దులు గుర్తించే విషయమై సీఎం సిద్ధరామయ్యతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. సీట్లు పంపిణీ విషయం తన పరిధిలో లేదని,హైకమాండ్ ఆదేశిస్తే తాను కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు.
బీజేపీ నేతలు అసెంబ్లీ ఎన్నికలు చావోరేవో అనే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తాము చేపట్టిన అభివృద్ధి పనులే ఈ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రావడానికి దోహదం చేస్తాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment