సాక్షి, హైదరాబాద్: నంద్యాల ఉప ఎన్నికల సమయంలో అక్కడ ఏం జరిగిందో.. ఇక్కడ హుజూర్‌నగర్ ఉప ఎన్నికలు కూడా అదే తరహాలో జరిగాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. బీజేపీ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశానికి రెండో రాజాధానిగా హైదరాబాద్‌ను చేసే విషయంపై పార్టీలో చర్చ జరగలేదని స్పష్టం చేశారు. ‘రాజధాని చర్చ అనేది ప్రజల మధ్య జరగాలి. ఒకవేళ చర్చ జరిగితే తప్పేం ఉంది? అని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయండంపై విద్యాసాగర్ రావు కొత్తగా ఏం చెప్పలేదని, కేంద్రపాలిత ప్రాంతం ఆలోచనే లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సుస్థిర పాలనకు సీట్ల సంఖ్య పెరగాలని, మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అలాగే ఎన్నికల్లో అన్ని వార్డుల్లో పోటీ చేస్తామని తెలిపారు. ఇక రాష్ట్రంలో రైతు బంధు రావడం లేదని, కేంద్రం ఇచ్చే రూ. 2000 వేలు మాత్రమే అందుతున్నాయన్న విషయాన్ని ప్రజలు గమనించారని పేర్కొన్నారు.
కాగా ఆర్టీసీ సమస్య కేంద్రం పరిధిలో లేదని.. అది రాష్ట్ర పరిధిలోని అంశంమని లక్ష్మణ్ తెలిపారు. ఆర్టీసీ సమ్మెలో కేంద్రం ఇంతవరకు జోక్యం చేసుకోలేదని, కేంద్రం దృష్టికి సమస్యను తాము తీసుకువెళ్తున్నామని వెల్లడించారు. తెలంగాణలో కేసీఆర్ అధికారం చేపట్టిన తొలి ఐదేళ్లలో పథకాలు జోరుగా సాగాయి.. కానీ ఇప్పుడు మాత్రం నత్తనడకన సాగుతున్నాయని ఎద్దేవా చేశారు. ‘రాష్ట్రంలో పాలన సజావుగా సాగడం లేదు రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం ఆగదు.. సమయం సందర్భం వచ్చినప్పుడు ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెడతాం’ అని ఆయన అన్నారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని.. అయితే బీజేపీ అడ్డదారిలో వెళ్లదని రాజ్యాంగ బద్ధంగానే ముందుకు సాగుతుందని తెలిపారు. ప్రజలలో తిరుగుబాటు వస్తే.. ఎమ్మెల్యేలు కూడా తిరుగుబాటు చేసి టీఆర్‌ఎస్ ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపెడతారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment