
సాక్షి, తిరువనంతపురం : బీజేపీపై, ప్రధాని నరేంద్రమోదీపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. బీజేపీ ఓ దుష్టశక్తి అని.. దానిపై పోరాటానికి ప్రతి ఒక్కరు నిలబడాలని చెప్పారు. ఆ పార్టీ దేశాన్ని శక్తిమంతంగా తయారు చేయకపోగా బలహీన పరుస్తోందని మండిపడ్డారు. అలాంటి పార్టీ విషయంలో దేశ ప్రజలకు కఠినంగా ఉండాలని, అప్రమత్తంగా వ్యవహరించాలని హెచ్చరించారు.
'మేం (కాంగ్రెస్) ఎప్పుడూ ద్వేషాన్ని వ్యాపింపజేయబోము. దేశాన్ని విభజించం. దేశంలోని సంస్థలను మేం ధ్వంసం చేయం. ఆ సంస్థలను మేం గౌరవిస్తాం. వాటికి లోబడి పనిచేసేందుకు ఇష్టపడతాం, గౌరవంగా భావిస్తాం. కానీ, బీజేపీ మాత్రం విభజించడం ద్వారా దేశాన్ని బలహీన పరుస్తోంది. దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరు ఇలాంటి దుష్టశక్తికి వ్యతిరేకంగా నిలబడాలి' అని రాహుల్ చెప్పారు. కేరళలో ప్రతిపక్ష నేత రమేశ్ చెన్నితాల నిర్వహించిన రాష్ట్ర వ్యాప్త యాత్రలో గౌరవ ప్రసంగం చేసిన ఆయన ఈ మాటలు అన్నారు. అలాగే, కేరళలో అధికారంలో ఉన్న సీపీఎం పార్టీకి కూడా సవాల్ విసిరారు. ఫాసిస్టు శక్తులకు నిజంగా సీపీఎం వ్యతిరేకం అయితే, జాతీయ స్థాయిలో పోరాడేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ పెద్ద సవాల్‌ను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు. ఇదే తీసుకోవాల్సిన అతి ముఖ్యమైన సవాల్ అని కూడా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment