Ramesh Chennithala
-
అమల్లోకి వచ్చిన ‘వరద పన్ను’
తిరువనంతపురం: గత ఏడాది ఆగస్టు నెలలో భారీ వరదలతో అతలాకుతలమైన కేరళ పునర్నిర్మాణానికి అదనపు ఆదాయాన్ని సమీకరించడానికి ప్రజలపై వరద పన్ను విధించేందుకు 2019–20 బడ్జెట్లో కేరళ ప్రభుత్వం తీర్మానించింది. ఈ నిర్ణయంతో గురువారం నుంచి వస్తు సేవలపై ఒక శాతం పన్ను విధింపు అమల్లోకి వచ్చింది. రాబోయే రెండేళ్ల కాలానికి అమల్లోకి వచ్చే ‘కేరళ ఫ్లడ్ సెస్’ ద్వారా ఏటా రూ. 600 కోట్ల అదనపు ఆదాయాన్ని ఆర్జించాలని సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం దృష్టి సారించిందని అధికార వర్గాలు వెల్లడించాయి. కొత్త పన్ను ద్వారా సమీకరించిన మొత్తం రాష్ట్ర పునర్నిర్మాణం, వరద బాధితులకు పరిహారం చెల్లించడానికి ఉపయోగిస్తారు. వరద పన్నుతో కేరళలో 900 రకాల నిత్యవసర సరుకుల ధరలు పెరగనున్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేరల వర్తకుల సంఘం నిన్న ‘బ్లాక్‌డే’ పాటించింది. ద్రవ్యోల్బణం, వరద పన్నుతో రాష్ట్ర ప్రజలపై రూ. 1200 కోట్ల అదనపు భారం పడుతుందని ప్రతిపక్ష నేత రమేశ్ చెన్నితల అన్నారు. వరద బాధితుల కోసం మిగతా వారిని ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. వరద పన్నును సాకుగా చూపించి ఇష్టమొచ్చినట్టు ధరలు పెంచితే కఠిన చర్యలు తప్పవని వ్యాపారులను ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ హెచ్చరించారు. -
'బీజేపీ ఓ దుష్టశక్తి.. గట్టిగా నిలబడండి'
సాక్షి, తిరువనంతపురం : బీజేపీపై, ప్రధాని నరేంద్రమోదీపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. బీజేపీ ఓ దుష్టశక్తి అని.. దానిపై పోరాటానికి ప్రతి ఒక్కరు నిలబడాలని చెప్పారు. ఆ పార్టీ దేశాన్ని శక్తిమంతంగా తయారు చేయకపోగా బలహీన పరుస్తోందని మండిపడ్డారు. అలాంటి పార్టీ విషయంలో దేశ ప్రజలకు కఠినంగా ఉండాలని, అప్రమత్తంగా వ్యవహరించాలని హెచ్చరించారు. 'మేం (కాంగ్రెస్) ఎప్పుడూ ద్వేషాన్ని వ్యాపింపజేయబోము. దేశాన్ని విభజించం. దేశంలోని సంస్థలను మేం ధ్వంసం చేయం. ఆ సంస్థలను మేం గౌరవిస్తాం. వాటికి లోబడి పనిచేసేందుకు ఇష్టపడతాం, గౌరవంగా భావిస్తాం. కానీ, బీజేపీ మాత్రం విభజించడం ద్వారా దేశాన్ని బలహీన పరుస్తోంది. దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరు ఇలాంటి దుష్టశక్తికి వ్యతిరేకంగా నిలబడాలి' అని రాహుల్ చెప్పారు. కేరళలో ప్రతిపక్ష నేత రమేశ్ చెన్నితాల నిర్వహించిన రాష్ట్ర వ్యాప్త యాత్రలో గౌరవ ప్రసంగం చేసిన ఆయన ఈ మాటలు అన్నారు. అలాగే, కేరళలో అధికారంలో ఉన్న సీపీఎం పార్టీకి కూడా సవాల్ విసిరారు. ఫాసిస్టు శక్తులకు నిజంగా సీపీఎం వ్యతిరేకం అయితే, జాతీయ స్థాయిలో పోరాడేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ పెద్ద సవాల్‌ను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు. ఇదే తీసుకోవాల్సిన అతి ముఖ్యమైన సవాల్ అని కూడా చెప్పారు. -
‘జోక్యం చేసుకోండి.. మంత్రిని సాగనంపండి’
తిరువనంతపురం: కేరళ విద్యుత్‌శాఖ మంత్రి ఎంఎం మణి అనుచితవ్యాఖ్యలు చేయడంపై వివాద ముదురుతోంది. ఆయనను కేబినెట్ నుంచి తొలగించాలని కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష ఎన్డీఎఫ్ కూటమి గట్టిగా పట్టుబడుతోంది. ఈ విషయంలో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ప్రతిపక్ష నేత రమేశ్ చెన్నితల బుధవారం సీతారాం ఏచూరికి లేఖ రాశారు. దీన్ని మీడియాకు విడుదల చేశారు. మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులను అవమానించేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంఎం మణికి మంత్రిగా కొనసాగే నైతిక హక్కు లేదని రమేశ్ అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకమే కాకుండా నేరపూరితంగా కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలు, మహిళా సాధికారత, ప్రజల గౌరవానికి పెద్దపీట వేస్తామని చెప్పుకునే సీపీఎం.. మణిపై చర్య తీసుకోవాల్సిన అవసరముందున్నారు. ఆయనను మంత్రి పదవి నుంచి తప్పించేందుకు సీతారాం ఏచూరి జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, పార్టీ అడిగితే రాజీనామా చేసేందుకు సిద్ధమని ఎంఎం మణి ప్రకటించారు. -
'సీఎంను కూడా ఆమె లెక్కచేయడం లేదు'
తిరువనంతపురం: కేంద్ర మంత్రి మేనకా గాంధీ 'మోసకారి' అంటూ కేరళ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రమేశ్ చెన్నితల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేరళలో వీధి కుక్కలను చంపొద్దని చెప్పడానికి ఆమె ఎవరు అని అసెంబ్లీలో ప్రశ్నించారు. గురువారం ఆయన శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడుతూ... 'మేనకా గాంధీ మోసకారి. ఆమె గురించి ఆమె ఏమనుకుంటున్నారు. ముఖ్యమంత్రిని కూడా ఆమె లెక్కచేయడం లేదు. ఈ అధికారం ఆమెకు ఎవరు ఇచ్చారు. దీన్ని ఏమాత్రం అంగీకరించబోమ'ని రమేశ్ అన్నారు. ఇటీవల కాలంలో కేరళలో వీధి కుక్క బెడద ఎక్కువైంది. తిరువనంతపురం జిల్లాలో 90 ఏళ్ల వృద్ధురాలిని కుక్కులు పిక్కుతిన్నాయి. దీంతో కాంగ్రెస్(ఎం) యువజన నాయకులు పెద్ద సంఖ్యలో వీధి కుక్కలను పట్టుకుని విచక్షణారహితంగా చంపారు. జంతు ప్రేమికురాలైన మేనకా గాంధీ దీన్ని ఖండించారు. వీధి కుక్కలను చంపిన వారిపై అసాంఘిక కార్యకలాపాల వ్యతిరేక చట్టం(కాపా) ప్రయోగించాలని ఆమె డిమాండ్ చేశారు. మూగజీవాలను చంపడానికి ఉసిగొల్పిన వారికి మరణశిక్ష విధించాలని వ్యాఖ్యానించారు. మేనకా గాంధీ వ్యాఖ్యలపై బుధవారం కేరళ అసెంబ్లీలో దుమారం రేగింది. ఆమెను వ్యాఖ్యలను అధికార, విపక్ష సభ్యులు ఖండించారు. -
మంత్రికి సెల్యూట్ చేయాలని ప్రోటోకాల్‌లో లేదు!
తిరువనంతపురం: కేరళ హోంమంత్రి రమేష్ చెన్నీతాలాకు సెల్యూట్ చేయకపోవడంతో అడిషనల్ డీజీపీ రిషిరాజ్ సింగ్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకొనేందుకు ప్రభుత్వం రంగం సిద్దం చేస్తోంది. వివరాలు..శనివారం కేరళ రాష్ట్ర పోలీస్ అకాడమీలో కానిస్టేబుల్ పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. ఈ కార్యక్రమానికి హోం మంత్రి వచ్చే సమయంలో రిషిరాజ్ సింగ్ సెల్యూట్ చేయకుండా కూర్చున్నారు. దీనికి సంబంధించిన ఫోటోని మరుసటి రోజు (ఆదివారం) ప్రముఖ దినపత్రికలలో ముద్రించారు.ఈ వ్యవహారం పై వివరణ కోరగా మంత్రివచ్చినప్పుడు నిలబడి సెల్యుట్ చేయాలన్న నిబంధన ప్రోటోకాల్‌లో లేదని ఆ అధికారి చెప్పిన సమాధానం ప్రభుత్వానికి మరింత చిరాకు తెప్పించినట్టయింది. అయితే నెటిజన్స్, ప్రతిపక్షాలు మాత్రం ఆ సీనియర్ పోలీస్ అధికారికి బాసటగా నిలిచాయి. అయితే వెనుక నుంచి వస్తున్న మంత్రిని వేదిక ముందు వైపు కూర్చున్న తను ఎలా చూడగలనని సింగ్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఆ కార్యక్రమానికి నన్ను అతిథిగా పిలిచారు. తనకు ఇచ్చిన ఆహ్వాన లేఖలో జాతీయ గీతం వచ్చే సమయంలో మాత్రమే నిలబడాలని ఉంది అని అయన అన్నారు. ఈ సంఘటన పై ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తపరిచారు. ఇదిలా ఉండగా సింగ్‌కి పోలీస్ శాఖలో ఒక మంచిపేరుంది. ట్రాన్స్ పోర్ట్ కమిషనర్‌గా ఉన్నపుడు ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలుపరిచారు. స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డులో పని చేసినపుడు అవినీతిని అరికట్టారు. వారం రోజుల కిందే అడిషనల్ డీజీపీ(బెటాలియన్)గా బదిలీ అయ్యారు. సింగ్‌ను తరచూ ట్రాన్స్ఫర్ చేయడంపై ప్రతిపక్షాలు ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. బ్రిటీష్ కాలం నాటి వీవీఐపీ సంస్కృతిని ప్రభుత్వం ఇంకా అనుసరిస్తుందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. 'మీకన్నా నేనే గొప్ప అని చెప్పుకొవడానికే బ్రిటీష్ వాళ్లు ఈ పద్దతి పాటించారని ఇప్పుడు ప్రభుత్వం కూడా అదే విధానాన్ని అవలంభిస్తున్నాయని' విపక్షాలు విమర్శిస్తున్నాయి. -
'కారు రాలేదు..సీఎం టాక్సీ ఎక్కి వెళ్లాడు'
అనుకున్న సమయానికి ముఖ్యమంత్రిని తీసుకువెళ్లడానికి వాహనం రాలేదు. దాంతో వేచి చూడటం ఇష్టం లేక ముఖ్యమంత్రి చేత్తో ఓ సైగ చేసి వచ్చిన కారులో ఎక్కి కార్యాలయానికి చేరుకున్నారు. ఈ ఘటన కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీకి ఎదురైంది. దేశ రాజధానిలో పర్యటన ముగించుకుని నుంచి రాష్ట్ర రాజధానికి చేరుకున్న ఉమెన్ చాందీని తీసుకువెళ్లాడానికి అనుకున్న సమయానికి వాహనం...విమానాశ్రాయానికి చేరలేకపోయింది. దాంతో అధికార వాహనం కోసం వేచి చూడటం ఇష్టం లేక ప్రైవేట్ టాక్సీలో తన కార్యాలయాన్ని చేరుకున్నారు. ముఖ్యమంత్రి టాక్సీలో వెళ్లడం భద్రత పరమైన లోపాలంటూ కేరళ రాజధాని తిరువనంతపురంలో పెద్ద దుమారాన్నే లేపింది. అయితే అలాంటిదేమి లేదని.. భద్రతాపరమైన సమస్య కానే కాదు. నేను ఢిల్లీలో కూడా ప్రైవేట్ వాహనంలోనే ప్రయాణిస్తాను అని చాందీ అన్నారు. అయితే ఈ విషయాన్ని కేరళ పోలీసులు సీరియస్ గానే తీసుకున్నారు. వాహనం సకాలంలో ఎందుకు చేరలేదని అంశంపై విచారణకు ఆదేశించారు. ఈ అంశాన్ని పెద్ద సమస్యగా చూడవద్దని.. అనుకున్న సమయం కంటే ముందుగా విమానం తిరువనంతపురానికి చేరుకోవడం కారణంగానే తాను టాక్సీలో కార్యాలయంలో చేరుకున్నాను అని చాందీ వివరణ ఇచ్చారు. వాస్తవానికి ఢిల్లీ విమానం 10.50 నిమిషాలకు చేరుకోవాల్సి ఉండగా, 10.18 నిమిషాలకే తిరువనంతపురానికి చేరుకుంది. ఈ విషయంపై అనవసర రాద్దాంతం చేయవదు అని కేరళ స్టేట్ కాంగ్రెస్ చీఫ్ రమేశ్ చెన్నితల మీడియాకు విజ్క్షప్తి చేశారు.