‘జోక్యం చేసుకోండి.. మంత్రిని సాగనంపండి’
తిరువనంతపురం: కేరళ విద్యుత్‌శాఖ మంత్రి ఎంఎం మణి అనుచితవ్యాఖ్యలు చేయడంపై వివాద ముదురుతోంది. ఆయనను కేబినెట్ నుంచి తొలగించాలని కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష ఎన్డీఎఫ్ కూటమి గట్టిగా పట్టుబడుతోంది. ఈ విషయంలో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ప్రతిపక్ష నేత రమేశ్ చెన్నితల బుధవారం సీతారాం ఏచూరికి లేఖ రాశారు. దీన్ని మీడియాకు విడుదల చేశారు.
మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులను అవమానించేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంఎం మణికి మంత్రిగా కొనసాగే నైతిక హక్కు లేదని రమేశ్ అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకమే కాకుండా నేరపూరితంగా కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలు, మహిళా సాధికారత, ప్రజల గౌరవానికి పెద్దపీట వేస్తామని చెప్పుకునే సీపీఎం.. మణిపై చర్య తీసుకోవాల్సిన అవసరముందున్నారు. ఆయనను మంత్రి పదవి నుంచి తప్పించేందుకు సీతారాం ఏచూరి జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, పార్టీ అడిగితే రాజీనామా చేసేందుకు సిద్ధమని ఎంఎం మణి ప్రకటించారు.