'సీఎంను కూడా ఆమె లెక్కచేయడం లేదు'
తిరువనంతపురం: కేంద్ర మంత్రి మేనకా గాంధీ 'మోసకారి' అంటూ కేరళ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రమేశ్ చెన్నితల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేరళలో వీధి కుక్కలను చంపొద్దని చెప్పడానికి ఆమె ఎవరు అని అసెంబ్లీలో ప్రశ్నించారు.
గురువారం ఆయన శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడుతూ... 'మేనకా గాంధీ మోసకారి. ఆమె గురించి ఆమె ఏమనుకుంటున్నారు. ముఖ్యమంత్రిని కూడా ఆమె లెక్కచేయడం లేదు. ఈ అధికారం ఆమెకు ఎవరు ఇచ్చారు. దీన్ని ఏమాత్రం అంగీకరించబోమ'ని రమేశ్ అన్నారు.
ఇటీవల కాలంలో కేరళలో వీధి కుక్క బెడద ఎక్కువైంది. తిరువనంతపురం జిల్లాలో 90 ఏళ్ల వృద్ధురాలిని కుక్కులు పిక్కుతిన్నాయి. దీంతో కాంగ్రెస్(ఎం) యువజన నాయకులు పెద్ద సంఖ్యలో వీధి కుక్కలను పట్టుకుని విచక్షణారహితంగా చంపారు. జంతు ప్రేమికురాలైన మేనకా గాంధీ దీన్ని ఖండించారు. వీధి కుక్కలను చంపిన వారిపై అసాంఘిక కార్యకలాపాల వ్యతిరేక చట్టం(కాపా) ప్రయోగించాలని ఆమె డిమాండ్ చేశారు. మూగజీవాలను చంపడానికి ఉసిగొల్పిన వారికి మరణశిక్ష విధించాలని వ్యాఖ్యానించారు. మేనకా గాంధీ వ్యాఖ్యలపై బుధవారం కేరళ అసెంబ్లీలో దుమారం రేగింది. ఆమెను వ్యాఖ్యలను అధికార, విపక్ష సభ్యులు ఖండించారు.