
ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ (ఫైల్ ఫొటో)
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు తనయుడు, ఐటీ శాఖ మంత్రి లోకేష్‌ను సీఎం చేసేందుకే దుర్గ గుడిలో తాంత్రిక పూజలు జరిగాయని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాంత్రిక పూజల వెనుక ముఖ్యమంత్రి ఉన్నారని అన్నారు.
పూజ చేస్తూ దొరికిపోయిన తర్వాత ఆ తప్పును అధికారులపై నెట్టేయడానికి యత్నిస్తున్నారని ఆరోపించారు. అధికారం నిలబెట్టుకునేందుకు వేల కోట్ల నల్లధనాన్ని ఖర్చు చేస్తున్నారని అన్నారు. ఆంగ్ల సంవత్సర సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు జరగలేదని చెప్పారు. అయితే, ఇదే సమయంలో చంద్రబాబు కుటుంబాన్ని వేద పండితులు ఆశీర్వదించారని అన్నారు.
నూతన సంవత్సరం సందర్భంగా మద్యం దుకాణాలకు నిబంధనల సడలింపు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలను బట్టి చూస్తే ఆయనకు మతిస్థిమితం ఉందా? అని అనుమానం వస్తోందన్నారు. ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఓట్లు ఎందుకు వేయాలో చెప్పాలన్నారు.
ఇందిరాసాగర పోలవరం ప్రాజెక్టును నిర్మించినందుకా? లేక 600 వాగ్ధానాలు చేసి పట్టుమని పది కూడా నిలబెట్టుకోనందుకా? అని నిప్పులు చెరిగారు. పారిశ్రామిక సదస్సుల పేరిట వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని, వాటి వల్ల రాష్ట్రానికి ఒనగూరిన ప్రయోజనం శూన్యం అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment