నల్లగొండలో సభా ప్రాంగణం వద్ద పోలీసులు (ఇన్‌సెట్‌లో బొడ్డుపల్లి శ్రీనివాస్)
సాక్షి, నల్లగొండ: రాజకీయంగా ఎదుర్కోలేకే అధికార టీఆర్‌ఎస్ నేతలు హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. నల్లగొండ మర్రిగూడ బైపాస్‌లో గల ఎంఎన్‌ఆర్ కన్వెన్షన్‌లో ఆదివార మధ్యాహ్నం కాంగ్రెస్ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్ సంతాప సభ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా, పీసీపీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీనియర్ నేతలు జైపాల్‌రెడ్డి, జానారెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, వీహెచ్, రేవంత్ రెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, మధుయాష్కీ గౌడ్ తదితరులతోపాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సభలో బొడ్డుపల్లి శ్రీనివాస్ కుటుంబసభ్యులను చూసి కోమటిరెడ్డి సోదరులు కన్నీటి పర్యంతమయ్యారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి బలం లేకనే హత్యా రాజకీయాలకు పాల్పడుతోందని, పోలీసులు టీఆర్ఎస్ పార్టీ ఏజెంట్లుగా మారారని మండిపడ్డారు. టీఆర్ఎస్ పతన౦ నల్లగొండ జిల్లా నుంచే ప్రారంభమైందని అన్నారు. కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబానికి మాత్రమే తెలంగాణ, బంగారు తెలంగాణగా మారిందన్నారు. నల్లగొండ జిల్లా ఎస్పీ, డీఎస్పీ పోలీసు శాఖకే మచ్చగా మారారని ఆరోపించారు. రాజకీయ హత్యను చిల్లర హత్యగా చిత్రీకరించారని విమర్శించారు. .తెలంగాణ ద్రోహుల పార్టీ టీఆర్ఎస్ అని మండిపడ్డారు.
ఈ సంతాప సభ సందర్భంగా నల్లగొండలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాట్లుచేశారు. వందలమంది కానిస్టేబుళ్లతోపాటు 42 మంది ఎస్సైలు, 32 మంది సీఐలు, నలుగురు డీఎస్సీలు బందోబస్తులో పాల్గొన్నారు. కాంగ్రెస్ శ్రేణులు ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించే అవకాశం ఉందన్న సమాచారంతో అక్కడ కూడా బలగాలను మొహరించారు.
Comments
Please login to add a commentAdd a comment