బుజ్జగింపులు షురూ  | Bose Raju meeting with Mukesh Goud | Sakshi
Sakshi News home page

బుజ్జగింపులు షురూ 

Published Wed, Jul 25 2018 1:31 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Bose Raju meeting with Mukesh Goud - Sakshi

తన నివాసానికి వచ్చిన బోసురాజుకు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలుకుతున్న మాజీ మంత్రి ముఖేశ్, ఆయన తనయుడు విక్రంగౌడ్‌

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌లో బుజ్జగింపుల పర్వం మొదలైంది. గతంలో రాష్ట్ర మంత్రులుగా, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, ఇతర ముఖ్య పదవుల్లో పనిచేసి ప్రస్తుతం అసంతృప్తిగా ఉన్న వారిని మళ్లీ పార్టీ లో క్రియాశీలం చేసే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆదేశాల మేరకు పార్లమెంటరీ నియోజకవర్గాల ఇన్‌చార్జిలుగా నియమితులయిన ముగ్గురు కార్యదర్శులు రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌ పార్లమెంట్‌ స్థానానికి ఇన్‌చార్జిగా ఉన్న ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు మంగళవారం మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్‌తో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. దాదాపు అరగంటకు పైగా చర్చలు జరిపి ఆయన్ను బుజ్జగించే ప్రయత్నం చేశారు. అలాగే వారం క్రితం మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహను ముగ్గురు కార్యదర్శులు కలిసినట్టు తెలుస్తోంది. మెదక్‌ మాజీ ఎంపీ విజయశాంతితో కూడా బోసురాజు నేడో, రేపో సమావేశమవుతారని సమాచారం. 

ఆ రెండు జిల్లాల నేతలకేనా ప్రాధాన్యం? 
బోసురాజుతో భేటీ సందర్భంగా మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్‌ తన అసంతృప్తికి గల కారణాలను వివరించారు. పార్టీలో కేవలం రెండు జిల్లాల నాయకుల మాటే చెల్లుబాటు అవుతోందని, మిగిలిన నేతలను కనీసం పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల నేతలే సర్వం అన్న రీతిలో వ్యవహరిస్తున్నారని, ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి నేతలను అసలు పట్టించుకోవడం లేదని ఆయన ఫిర్యాదు చేసినట్టు సమాచారం. మాజీ మంత్రి దానం నాగేందర్‌ పార్టీ మారతారనే ప్రచారం గత రెండేళ్లుగా జరుగుతున్నా పట్టించుకున్న నాథుడే లేడని, తాను అసంతృప్తితో ఉన్నానని తెలిసి కూడా ఏ ఒక్క నాయకుడూ తనతో మాట్లాడలేదని చెప్పారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 100 డివిజన్లలో తాను విస్తృతంగా పర్యటించానన్నారు.

తన అసంతృప్తి వెనుక ఉన్న కారణాలను పట్టించుకునే ప్రయత్నం టీపీసీసీ నేతలు చేయలేదని ముఖేశ్‌ చెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో బోసురాజు ముఖేశ్‌ను బుజ్జగించే ప్రయత్నం చేశారు. తనకు అన్ని పరిస్థితులు తెలుసునని, అన్ని విషయాలను రాహుల్‌కు చెప్పానని, పార్టీలోనే కొనసాగాలని పేర్కొన్నారు. రాహుల్‌ రాష్ట్ర పర్యటనలో ఆయనతో మాట్లాడిస్తానని హామీ ఇస్తానని చెప్పినట్టు ముఖేశ్‌ సన్నిహితుల ద్వారా తెలిసింది. మరోవైపు వారం రోజుల క్రితం మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో ముగ్గురు కార్యదర్శులు దాదాపు 2 గంటలు సమావేశమయ్యారని గాంధీభవన్‌ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా పార్టీ పట్ల తనకున్న అసంతృప్తిని వారి ముందు రాజనర్సింహ కుండబద్దలు కొట్టినట్టు తెలిసింది. సముద్రం లాంటి పార్టీలో కొన్నిసార్లు ఇబ్బందులు వస్తాయని, అన్నింటిని పరిష్కరించుకుని వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేద్దామని కార్యదర్శులు దామోదరకు సూచించినట్టు తెలిసింది. 

స్థానిక నేతలను వదిలి.. 
నియోజకవర్గాల పరిధిలో నేతల మధ్య సమన్వయం కోసమే నియమించిన కార్యదర్శులపైనే రాహుల్‌ నమ్మకం ఉంచినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే పార్టీలోని అసంతృప్తులను బుజ్జగించే బాధ్యతలను టీపీసీసీ నేతలకు కాకుండా కార్యదర్శులకే అప్పగించారు. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించిన కార్యదర్శులు రాష్ట్రవ్యాప్తంగా అసంతృప్తితో ఉన్న నేతల జాబితాను తయారు చేసుకున్నట్టు సమాచారం. ఈ జాబితా ప్రకారం క్రమంగా ఒక్కో నేతను కలిసి రాహుల్‌ పర్యటన నాటికి పార్టీలో అందరినీ క్రియాశీలం చేయాలనే కార్యాచరణ రూపొందించుకున్నట్టు తెలుస్తోంది. రాహుల్‌ పర్యటన అనంతరం రాష్ట్ర పార్టీలో అసంతృప్తులు లేకుండా చేయాలనే ధ్యేయంతోనే కార్యదర్శులు ముందుకెళ్తారని గాంధీభవన్‌ వర్గాలు వెల్లడించాయి. 

కాంగ్రెస్‌లోనే ఉన్నా: ముఖేశ్‌గౌడ్‌
తాను కాంగ్రెస్‌లోనే ఉంటానని మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్‌ చెప్పారు. ఏఐసీసీ కార్యదర్శి బోసురాజుతో సమావేశం అనంతరం ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. తన ఇల్లు గాంధీభవన్‌కు కూతవేటు దూరంలో ఉందని, తాను ఇంట్లో ఉన్నా గాంధీభవన్‌లో ఉన్నట్టేనని వ్యాఖ్యానించారు. బోసురాజు ఇచ్చిన సలహాలను స్వీకరించానని చెప్పారు. బోసురాజు మాట్లాడుతూ ముఖేశ్‌తో అన్ని విషయాలు చర్చించినట్టు చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement