మీడియాతో మాట్లాడుతున్న మంత్రి బొత్స సత్యనారాయణ, చిత్రంలో ఎమ్మెల్యే అమర్‌నాథ్
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్రంలో కొద్ది రోజులుగా సాగుతున్న ఐటీ దాడులపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నోరు విప్పాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. విశాఖలోని వైఎస్సార్‌సీపీ నగర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు పీఎస్‌గా పనిచేసిన శ్రీనివాసరావు నివాసంపై ఐటీ దాడులు జరిగినా స్పందించక పోవడమేంటని ప్రశ్నించారు.
ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావులపై చట్టపరంగానే ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. తప్పుదారి పడితే ఎంతటివారైనా అందుకు బాధ్యత వహించాల్సిందేనని చెప్పారు. ఇవేవో కక్షపూరిత చర్యలని టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. సీఎం వైఎస్ జగన్‌పై బురదజల్లాలని ప్రయత్నిస్తే బాగుండదని హెచ్చరించారు. తప్పు చేసిన అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటే తప్పెలా అవుతుందని ప్రశ్నించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా వికేంద్రీకరణ
ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి రాత్రికి రాత్రే చంద్రబాబు హైదరాబాద్‌ను వదిలేసి అమరావతికి ఎందుకొచ్చారో ప్రజలకు తెలుసన్నారు. ఆయన ఐదేళ్ల పాలనలో అమరావతి గ్రాఫిక్స్ చూపించి రాష్ట్రాన్ని లక్షా 95 వేల కోట్ల రూపాయల అప్పుల్లో ముంచారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ అమరావతి కోసమే అంత ధనం ఖర్చు చేయలేమన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థిలకు అనుగుణంగానే పరిపాలన వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తే రానున్న ఐదేళ్లలో విశాఖ నగరం హైదరాబాద్‌ను మించి అభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్నది సీఎం వైఎస్ జగన్ లక్ష్యం అని చెప్పారు. విశాఖ నగరపాలక సంస్థ పరిధిలోనే 1.75 లక్షల మంది ఉన్నారని, వీరందరికీ ఇంటి స్థలం ఇవ్వడానికి అధికారులు సర్వే ద్వారా 6,116.5 ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్ భూములను గుర్తించారని చెప్పారు. ఈ సమావేశంలో అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నా«థ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment