
శుక్రవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ అయిన హైపవర్ కమిటీ సభ్యులు
సాక్షి, అమరావతి: రాజధాని రైతులకు ఇంతవరకూ జరిగిన దాని కంటే మెరుగైన ప్రయోజనం చేకూరుస్తామని రాష్ట్ర సమగ్రాభివృద్ధి–వికేంద్రీకరణపై ఏర్పాటైన హైపవర్ కమిటీ సభ్యుడు, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రైతులతో చేసుకున్న ఒప్పందాలకు అనుగుణంగా వారికి మరింత మేలు చేస్తామని, రాజధాని రైతులు ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదని.. ఇప్పటికైనా ఉపసంహరించుకోవాలని కోరారు. చంద్రబాబు మాయలో పడొద్దని ఆయన రైతులకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని హైపవర్ కమిటీ సభ్యులు కలిశారు. రైతులకు సంబంధించిన అంశాలు, జీఎన్ రావు కమిటీ, బీసీజీ నివేదికలపై చర్చించిన అంశాలు, ఇతర విషయాలపై కమిటీ సభ్యులు ముఖ్యమంత్రికి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ముఖ్యమంత్రితో భేటీ అనంతరం మంత్రి కురసాల కన్నబాబుతో కలిసి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని, రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఇది కూడా ఒక భాగమని.. దాని అభివృద్ధి తమ బాధ్యతేనని స్పష్టం చేశారు. రైతులకు చేయాల్సిన మేలు గురించి ముఖ్యమంత్రి కూడా కొన్ని సూచనలు చేశారని, వాటిని కూడా నివేదికలో పొందుపరుస్తామన్నారు. తమ ప్రభుత్వానికి రాష్ట్ర సమగ్రాభివృద్ధి పట్ల స్పష్టమైన విధానం, ప్రణాళిక ఉందని తెలిపారు. అవసరమైతే మరోసారి హైపవర్ కమిటీ సమావేశమవుతుందన్నారు.
సీఎం దృష్టికి రైతుల సమస్యలు
రాజధాని గ్రామాలకు చెందిన రైతులు తన వద్దకు వచ్చి వారి సమస్యలు చెప్పారని, వార్షిక కౌలు, పెన్షన్ సరిపోవడం లేదని తెలిపారన్నారు. రైతుల సమస్యల్ని సీఎం దృష్టికి తీసుకెళ్లామని, హైపవర్ కమిటీ నివేదికలోనూ ఆ విషయాలను పొందుపరుస్తామని బొత్స చెప్పారు. రైతులతో మాట్లాడేందుకు తాము సిద్ధమని, తమ అభిప్రాయాలను సీఆర్‌డీఏ అధికారులకు తెలపాలని రైతులకు సూచించామన్నారు. ‘రాజధానిలో 25 శాతానికిపైగా పూర్తయిన భవనాలన్నింటినీ తప్పకుండా పూర్తిచేసి వాడుకలోకి తెస్తాం. అన్నింటికీ ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. అన్ని ప్రాంతాల కోరికలు, అభిప్రాయాలను హైపవర్ కమిటీలో చర్చించాం. వాటన్నింటినీ క్రోడీకరించి సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తాం’ అని బొత్స తెలిపారు. తమకు వచ్చిన సిఫార్సులో అమరావతిని శాసన రాజధానిగా చేయాలనుందని.. దానిపై చర్చిస్తామని చెప్పారు. తమ ప్రభుత్వం రైతులకు బ్రాండ్ అంబాసిడర్ అని, ఏ రైతుకు చిన్న కష్టం వచ్చినా పెద్ద ఉపద్రవంగా భావిస్తామని, వారికి నష్టం జరగదన్నారు.
తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద మీడియాతో మాట్లాడుతున్న మంత్రి బొత్స సత్యనారాయణ. చిత్రంలో మంత్రి కన్నబాబు
అసెంబ్లీ తాత్కాలికమని చంద్రబాబు చెప్పలేదా?
అమరావతిపై ఐఐటీ మద్రాసు ఇచ్చిన నివేదిక పూర్తి వాస్తవమని మంత్రి బొత్స పేర్కొన్నారు. బీసీజీ నివేదికలో చెప్పిన దాన్ని తప్పంటే ఎలాగని.. కొన్ని పత్రికలు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. అసెంబ్లీ తాత్కాలికమని ఎవరు చెప్పారంటూ చంద్రబాబు ఇప్పుడు మాట మారుస్తున్నాడని.. మరి గతంలో ఎప్పుడూ అది శాశ్వతమని చంద్రబాబు ఎందుకు చెప్పలేదు? అని ప్రశ్నించారు. అసెంబ్లీ భవనం శాశ్వతమని చంద్రబాబు అన్నాడని ఎవరైనా చెబితే తాను తలవంచుకుని వెళ్లిపోతానని సవాల్ విసిరారు. ఇప్పుడు అసెంబ్లీ శాశ్వతమని చెబుతున్న చంద్రబాబు.. మరో అసెంబ్లీ భవనానికి ఎందుకు పునాది వేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తన వ్యక్తిగత స్వార్థం కోసం చంద్రబాబు ఆలోచిస్తాడని, ఏ పనిచేసినా అందులో తనకేంటని చూస్తాడని బొత్స ఆరోపించారు.
జోలె పట్టిన డబ్బులు ఏం చేశాడు?
చంద్రబాబు దేనికి జోలె పడుతున్నాడని.. వచ్చిన డబ్బును ఏంచేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో రాజధాని కోసం హుండీ పెట్టాడని.. ఆ డబ్బు ఏంచేశాడో ఎవరికీ తెలియదన్నారు. రాజధానికి 30 వేల ఎకరాల ప్రభుత్వ భూమి కావాలని జగన్‌మోహన్‌రెడ్డి చెబితే దాన్ని వక్రీకరించారని విమర్శించారు. పచ్చని పంటలు పండే భూములను తీసుకోవద్దని జగన్ చెప్పారని.. ఆయన మాటలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని తప్పుపట్టారు. బీజేపీతో జనసేన కలవడంపై స్పందిస్తూ.. వారి విధానం వారిదని, ఉనికి కోసం అవన్నీ జరుగుతున్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment