సాక్షి, కాకినాడ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీలో ఒక మాట, తెలంగాణలో మరో మాట మాట్లాడుతున్నారని వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా దక్కకుండా నిలువునా దగా చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా రేపు తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలోని బాలజీ చెరువు సెంటర్‌లో జరిగే ‘వంచనపై గర్జన’ దీక్ష ఏర్పాట్లను ఆ పార్టీ నాయకులు వైవీ సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్, ఫ్రూటీ కుమార్‌లు గురువారం పరిశీలించారు. అనంతరం బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా విషయంలో ఏపీ ప్రజలను బీజేపీ, టీడీపీ రెండు మోసం చేశాయని అన్నారు. చంద్రబాబు తన అవసరం కోసమే కాంగ్రెస్‌తో కలిశారని తెలిపారు. ఊసరవెల్లిగా చంద్రబాబు రంగులు మారుస్తున్నారని మండిపడ్డారు. ఓటుకు కోట్లు కేసుతో చంద్రబాబు ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ను వదులుకున్నారని తెలిపారు.
చంద్రబాబుకు ఎన్నికల సమయంలో అవకాశవాద రాజకీయాలు చేయడం అలవాటేనని వ్యాఖ్యానించారు. టీడీపీతో టీఆర్‌ఎస్ పొత్తుకు తిరస్కరిస్తే.. చంద్రబాబు కాంగ్రెస్‌తో కలిశారని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌తో పొత్తు ప్రతిపాదనపై చంద్రబాబు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతలను కాపాడుకునేందుకే చంద్రబాబు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. బాబు తన పార్టీ నేతలను కాపాడుకోవడానికి ఏపీలో సీబీఐని అడుగుపెట్టకూడదంటూ తీర్మానాలు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ ఎప్పుడూ రాష్ట్ర ప్రయోజనాలను ఆకాక్షిస్తుందనే విషయాన్ని గుర్తుచేశారు. చంద్రబాబు కనుసన్నల్లో జనసేన నడుస్తుందని విమర్శించారు. జనసేనతో చంద్రబాబు చీకటి ఒప్పందాలు ఏంటో చెప్పాలన్నారు. చంద్రబాబుది ధృతరాష్ట్రుడి కౌగిలి అని.. జనసేన అధ్యక్షుడు ఇప్పటికైనా ఆలోచించుకోవాలని కోరారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై పవన్ చేస్తున్న ఆరోపణల్లో అర్థం లేదన్నారు. టీడీపీ అవినీతిని పవన్ పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. రేపు జరిగే వంచనపై గర్జన దీక్షను విజయవంతం చేయాలని కోరారు.
వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలను సాధించడంలో చంద్రబాబు విఫలమయ్యారని మండిపడ్డారు. ప్రజలను చంద్రబాబు ఏ విధంగా మోసం చేస్తున్నారో అందరు గమనిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవాడానికి అన్ని సంఘాలు, విద్యార్థులు, యువత వంచనపై గర్జన దీక్షలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment