
సాక్షి, అమరావతి : కృష్ణానదిలో అక్రమ కట్టడాలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టంచేశారు. నదీ పరీవాహక చట్టాలకు విరుద్ధంగా కరకట్ట లోపల ఉన్న అక్రమ కట్టడాలను తొలగించే ప్రక్రియను ప్రారంభించామన్నారు. విజయవాడలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చట్ట వ్యతిరేకమైన నిర్మాణాలకు గతంలోనే సీఆర్‌డీఏ నోటీసులు జారీ చేసిందని చెప్పారు. చట్టపరంగా, కోర్టు సూచనలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
అందులో భాగంగానే పాతూరు కోటేశ్వరరావుకు చెందిన అక్రమ కాంక్రీట్ నిర్మాణాన్ని సీఆర్‌డీఏ అధికారులు తొలగించారని, దీన్ని రాజకీయం చేస్తూ చంద్రబాబు నివాసం కూల్చేస్తున్నారని ఎల్లో మీడియా ద్వారా టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కాగా, చంద్రబాబు ఉంటున్న నివాసం కూడా అక్రమమేనని దాని యజమాని లింగమనేనితోపాటు పలు అక్రమ కట్టడాల యజమానులకు నోటీసులు జారీ చేశారని, వాటిని కూడా త్వరలో తొలగించాల్సి వుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment