సాక్షి, అమరావతి : రాజధాని విషయంలో తన వ్యాఖ్యలను చంద్రబాబు ఇంతలా వక్రీకరిస్తారని అనుకోలేదని మంత్రి బొత్స సత్యనారాయణ విస్మయం వ్యక్తం చేశారు. రాజధానిలో వరదల గురించి తాను మాట్లాడితే..విషయాన్ని వక్రీకరించి ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లుగా రాసుకున్నారన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..రాజధాని ఉంటుందని లేదా ఉండదని తాను మాట్లాడలేదన్నారు. రాజధాని విషయంలో శివరామకృష్ణన్ రిపోర్టుని పరిగణనలోకి తీసుకోమని కేంద్ర ప్రభుత్వం చెబితే... చంద్రబాబు మాత్రం మంత్రి నారాయణ నివేదికను పరిగణనలోకి తీసుకున్నారని తెలిపారు.
‘పదేళ్ల క్రితం పదకొండున్నర లక్షల క్యూసెక్కుల వరదతో అమరావతి ప్రాంతం అతలాకుతలమైంది. మొన్న ఎనిమిదిన్నర లక్షల క్యూసెక్కుల వరద వస్తే రాజధాని ప్రాంతమంతా మునిగిపోయింది. ఈ క్రమంలో రాజధానిపై ఉన్న వాస్తవాలను మాత్రమే నేను మాట్లాడాను’ అని బొత్స స్పష్టం చేశారు. ఈ క్రమంలో చంద్రబాబు ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిలా మాట్లాడుతూ..తన మాటలను వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. అమరావతి చుట్టూ భూములు కొన్నది టీడీపీ నేతలు, చంద్రబాబు బినామిలేనని ఆరోపించారు. ధరలు తగ్గిపోతున్నాయి కాబట్టి ప్రస్తుతం వారికి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. కాగా తరచుగా వరదలకు గురవుతున్న చెన్నై, ముంబైల గురించి ప్రస్తావిస్తూ... ‘ చెన్నై, ముంబైలు ఎప్పుడో కట్టిన రాజధానులు.. ముంపునకు గురవుతుందని తెలిస్తే చెన్నై, ముంబైలను మునిగిపోయే ప్రాంతంలో కట్టేవారు కాదు’ అని వ్యాఖ్యానించారు. ఇక రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరగాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని.. తద్వారా 25 లక్షల కోట్ల సంపద సృష్టించబోతున్నామని బొత్స పేర్కొన్నారు. వోక్స్ వేగన్ కేసులో తాను సాక్షిని మాత్రమేనని.. 60వ సాక్షిగా తనను పిలిచారని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment