సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు బడుగు వర్గాల ద్రోహి అని రాష్ట్ర మున్సిపల్, పట్ణణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. జనాభా ప్రతిపాదికన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు 59 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా టీడీపీ నేతలు కోర్టుకు వెళ్లారని విమర్శించారు. ఆయన సోమవారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడారు. బడుగులకు 59 శాతం రిజర్వేషన్ ఇస్తే చంద్రబాబుకు ఎందుకు కడుపు మంట అని నిలదీశారు. బడుగుల మేలు కోసం ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి బాబు అడ్డుతగులుతున్నారని ధ్వజమెత్తారు. బలహీనవర్గాలు టీడీపీని ఎప్పటికీ క్షమించవన్నారు.
టీడీపీ కుట్ర కారణంగానే..
‘‘డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్ఫూర్తితో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం 50 శాతం రిజర్వేషన్లకు లోబడే ఎన్నికలకు వెళ్తాం. టీడీపీ కుట్ర కారణంగానే బలహీన వర్గాలకు న్యాయం చేయలేకపోయాం. రిజర్వేషన్ల ప్రక్రియను మూడు, నాలుగు రోజుల్లో పూర్తిచేస్తాం’’ అని బొత్స సత్యనారాయణ చెప్పారు.
టీడీపీ శనిలా దాపురించింది
‘‘చంద్రబాబు కుట్ర వల్లే వెనుకబడిన వర్గాలు రిజర్వేషన్లు కోల్పోయాయి. టీడీపీకి చెందిన ప్రతాప్‌రెడ్డి అనే వ్యక్తే రిజర్వేషన్లకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతాప్‌రెడ్డి రాష్ట్రంలో ఎన్‌ఆర్‌జీఎస్ స్టేట్ కమిటీలో మెంబర్. బలహీన వర్గాలు వైఎస్సార్‌సీపీకి మద్దతుగా నిలవడం చూడలేక చంద్రబాబు వారికి అన్యాయం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరగకూడదు, కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగిపోవాలి, గ్రామీణ, పట్టాణాభివృద్ధి జరగకూడదు అన్నట్లుగా టీడీపీ వ్యవహరిస్తోంది. ఇందుకు చంద్రబాబుకు, టీడీపీ నేతలకు సిగ్గుండాలి. పేద ప్రజల పాలిట తెలుగుదేశం పార్టీ ఒక శనిలా దాపురించింది. చట్టప్రకారం అమరావతిలో బలహీన వర్గాలకు 1,251 ఎకరాలు ఇస్తామని చెప్పాం. దానిపై కూడా చంద్రబాబుకు కడుపు మంట ఎందుకు?’’ అని మంత్రి బొత్స నిప్పులు చెరిగారు.
Comments
Please login to add a commentAdd a comment