
సాక్షి, అమరావతి: అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. జీఎన్ రావు కమిటీ నివేదిక సందర్భంగా ఆయన శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, అయిదు కోట్ల ప్రజల ఆకాంక్షలే ముఖ్యమన్నారు.13 జిల్లాలను అభివృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ విధామన్నారు. ప్రజలకే తప్ప, తాము ప్రతిపక్షాలకు జవాబుదారీ కాదని మంత్రి బొత్స వ్యాఖ్యలు చేశారు. రూ.లక్ష కోట్లు పెట్టి రాజధాని నిర్మించే పరిస్థితిలో ప్రభుత్వం లేదని, అమరావతిని మాత్రమే అభివృద్ధి చేస్తే...మిగతా 12 జిల్లాల సంగతి ఏంటని ఆయన అన్నారు.
చదవండి: అమరావతిలోనే అసెంబ్లీ, రాజభవన్
రైతుల ప్రయోజనాలు కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి బొత్స ...గత ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం ప్లాట్లను అభివృద్ధి చేసి ఇస్తామన్నారు. మంత్రి పెద్దిరెడ్డి అసైన్డ్ భూములపై మాత్రమే మాట్లాడారని తెలిపారు. అసైన్డ్ భూములు మాత్రం రైతులకు ఇచ్చేస్తామని తెలిపారు. రాజధాని ప్రకటనకు 2 నెలలకు ముందే హెరిటేజ్ భూములు కొనుగోలు చేసిందని, ఇది ఇన్‌సైడర్ ట్రేడింగ్ కాదా అని సూటిగా ప్రశ్నించారు. చుట్టాల కోసం టీడీపీ ప్రజల సొమ్ము దోపిడీకి పాల్పడిందని ధ్వజమెత్తారు. భూ సేకరణలో సేకరించిన భూములు ప్రభుత్వం వినియోగిస్తుందన్నారు. ప్రతిపక్షాల నేతలు రాజకీయాల కోసం ఏమైనా మాట్లాడతారని మండిపడ్డారు.
ఏ అంశమైనా కేబినెట్‌లో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అమరావతిని ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతామని మంత్రి బొత్స తెలిపారు. అసెంబ్లీ, రాజ్‌భనవ్ ఇక్కడే ఉంటుందన్నారు. సీఎం క్యాంప్ కార్యాలయం విజయవాడలో కూడా ఉంటుందన్నారు. జీఎన్ రావు కమిటీలో అందరూ అవగాహన ఉన్న నిపుణులే అని, అన్ని పరిశీలించాకే నివేదిక ఇచ్చారన్నారు. తుది నివేదికను మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment