experts committee
-
‘అదానీ’పై సుప్రీం నిపుణుల కమిటీ
న్యూఢిల్లీ: హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత దేశంలో 140 బిలియన్ డాలర్లకుపైగా సంపద ఆవిరైన నేపథ్యంలో మదుపర్ల ప్రయోజనాల పరిరక్షణ కోసం సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అదానీ–హిండెన్‌బర్గ్ వ్యవహారంపై విచారణ జరపడంతోపాటు మదుపర్ల ప్రయోజనాలను కాపాడేలా చర్యలను సిఫార్సు చేయడానికి ఆరుగురు సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే నేత్వత్వం వహించే ఈ కమిటీలో ఎస్బీఐ మాజీ చైర్మన్ ఒ.పి.భట్, బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జె.పి.దేవధర్, బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంకు, ఇన్ఫోసిస్ లిమిటెడ్ మాజీ అధినేత కె.వి.కామత్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) మాజీ అధినేత నందన్ నీలేకని, న్యాయవాది సోమశేఖర్ సుందరేశన్ సభ్యులుగా ఉంటారని తెలియజేసింది. స్టాక్ ధరల్లో అదానీ గ్రూప్ అవకతవకలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై కొనసాగిస్తున్న విచారణను రెండు నెలల్లోగా పూర్తి చేసి, నివేదికను సీల్డ్ కవర్లో సమర్పించాలని సెబీని ఆదేశించింది. హిండెన్‌బర్గ్ నివేదిక, అదానీ గ్రూప్ అక్రమాలపై దాఖలైన వివిధ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్దివాలాల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల వల్ల మదుపరులు భారీగా నష్టపోయారని, మార్కెట్ ఒడిదొడుకుల కారణంగా వారు నష్టపోకుండా నియంత్రణ సంస్థలను బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలను సూచించడానికి ఆరుగురు సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. పెట్టుబడిదారులను చైతన్యవంతంచేయడానికి చేపట్టాల్సిన చర్యలను సైతం సిఫార్సు చేయాలని కమిటీకి స్పష్టంచేసింది. కమిటీ సభ్యులకు గౌరవ వేతనం చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదానీ గ్రూప్ వ్యవహారాలపై దర్యాప్తునకు కమిటీని నియమించడానికి తమకు అభ్యంతరం లేదంటూ గత విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించినసంగతి తెలిసిందే. కేసు దర్యాప్తు పూర్తి పారదర్శకంగా జరగాలని కోరుకుంటున్నామని, తామే నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని ధర్మాసనం ఇప్పటికే తేల్చిచెప్పింది. కాగా, కోర్టు నిర్ణయంపై గౌతమ్ అదానీ స్పందించారు. నిర్దిష్ట గడువులోగా ఈ వ్యవహారమంతా ఒక కొలిక్కి వస్తుందని భావిస్తున్నామని వెల్లడించారు. సత్యం గెలుస్తుంది అని పేర్కొన్నారు. -
కోవావాక్స్ ‘మూడో దశ’కు నిపుణుల కమిటీ సిఫారసు
న్యూఢిల్లీ: కోవిడ్–19 వ్యాక్సిన్ కోవావాక్స్‌ను బూస్టర్ డోసుగా వినియోగించుకోవడం కోసం మూడో దశ ట్రయల్స్‌కు అనుమతినివ్వాలని ఇండియా సెంట్రల్ డ్రగ్ అథారిటీకి చెందిన నిపుణుల కమిటీ ఆదివారం సిఫారసు చేసింది. వయోజనుల్లో ఈ టీకాను బూస్టర్ డోసుగా వేసుకోవచ్చునని తెలిపింది. ది డ్రగ్స్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అత్యవసర పరిస్థితుల్లో ఈ టీకాను వినియోగించడానికి అనుమతినిచ్చింది. ఇప్పటికే స్పుత్నిక్ వీని కూడా బూస్టర్ డోసుగా వాడడానికి అనుమతులున్నాయి. ఇప్పుడు కొవొవాక్స్ ప్రయోగాలు పూర్తయితే మరో కరోనా టీకా అందుబాటులోకి వస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి. (చదవండి: మెట్రోలో టికెట్ కొని ప్రయాణించిన ప్రధాని మోదీ.. ఎక్కడంటే!) -
ఫిరోజాబాద్‌లో డెంగ్యూ మహమ్మారి
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో డెంగ్యూ మహమ్మారి చెలరేగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖకు చెందిన నిపుణులు బృందం నిర్ధారించింది. ఫిరోజాబాద్ పరిసర ప్రాంతాల్లో 200 శాంపిళ్లు సేకరించి పరీక్షించగా వాటిలో 50 శాతం మందికి డెంగ్యూ పాజిటివ్‌గా తేలినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో గత 10 రోజుల్లో 60 మందికి పైగా డెంగ్యూ కారణంగా మరణించగా, అందులో 50 మంది చిన్నారులు ఉన్నారు. చిన్నారులకు ప్రమాదకరమైన హీమరాజిక్ ఫీవర్ వస్తున్నట్లు నిపుణులు గుర్తించారు. హీమరాజిక్ డెంగ్యూ ఫీవర్‌లో ప్లేట్లెట్ల సంఖ్య ఉన్నట్టుండి పడిపోతుంది. దీంతో పాటు రక్తస్రావం కూడా అవుతుంది. దీంతో చిన్నారులు తక్కువ సమయంలోనే మరణిస్తున్నట్లు నిపుణులు బృందం తెలిపింది. యూపీలో చిన్నారులకు వ్యాపిస్తున్న జ్వరాలు హీమరాజిక్ డెంగ్యూ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు తెలిపినట్లు ఫిరోజాబాద్ కలెక్టర్ ఇటీవలే వెల్లడించారు. జనావాసాల పరిసరాల్లో నీరు నిల్వ ఉంటే వెంటనే వాటిని శుభ్రం చేయాలని తాజాగా ఆయన ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆరుగురు సభ్యులతో కూడిన నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ) బృందం ఫిరోజాబాద్ పరిసర ప్రాంతాల్లో పర్యటించింది. ఈ బృందంలో ఎంటొమాలజిస్టులు సహా పలు వెక్టర్–బోర్న్ వ్యాధుల నిపుణుల ఉన్నారు. వారు పరిశీలించిన అంశాలను కేంద్రానికి సోమవారం నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. ఎన్సీడీసీకి చెందిన తుషార్ ఎన్ నేల్ ఆధ్వర్యంలోని బృందం తమ ప్రాంతాన్ని పర్యటించి పరిస్థితులను పరిశీలించినట్లు ఫిరోజాబాద్‌లోని ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ అలోక్ కుమార్ శర్మ చెప్పారు. కేవలం ఫిరోజాబాద్‌లో మాత్రమేగాక మథుర, ఆగ్రా వంటి చోట్ల కూడా డెంగ్యూ ప్రబలుతోంది. మథురలో కేవలం 15 రోజుల్లోనే 11 మంది చిన్నారులు కన్నుమూశారు. కోవిడ్ అనంతర పరిస్థితుల నేపథ్యంలో కూడా ప్రభుత్వం ఏ మాత్రం నేర్చుకోలేదని, ఇప్పటికే వైరల్ ఫీవర్ కారణంగా 100 మందికి పైగా మరణించారంటూ కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ప్రభుత్వాన్ని విమర్శించారు. -
టీకా తీసుకున్న 60 మందికి సైడ్ ఎఫెక్ట్స్
న్యూఢిల్లీ: కోవిడ్ టీకా తీసుకున్న తర్వాత సుమారు 60 మందిలో తీవ్ర సైడ్ ఎఫెక్ట్స్ కనిపించినట్లు కేంద్ర నిపుణుల బృందం నివేదిక తెలిపింది. ఈ మేరకు నేషనల్ యాడ్వర్స్ ఈవెంట్స్ ఫాలోయింగ్ ఇమ్యునైజేషన్ (ఏఈఎఫ్ఐ) కమిటీ మే 27వ తేదీన కేంద్ర ఆరోగ్య శాఖకు నివేదిక అందజేసింది. మొత్తం 60 కేసులకు గాను 55 కేసులకు టీకాతో స్థిరమైన సంబంధమున్నట్లు స్పష్టం చేసింది. ఇందులోని 36 కేసుల్లో ఆందోళన సంబంధ సమస్యలు, 18 ఉత్పత్తి సంబంధమైనవి, ఒక్కటి మాత్రం ఈ రెండింటికీ చెందినదిగా వర్గీకరించింది. మిగతా, ఒక మరణం సహా 5 కేసులకు టీకాతో సంబంధం ఉన్నట్లు నిరూపణ కాలేదని పేర్కొంది. టీకా అనంతరం సంభవించిన ఈ మరణాన్ని యాదృచ్ఛిక ఘటనగా పేర్కొంది. దేశంలో జనవరి నుంచి ప్రారంభమైన వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో ఇప్పటి వరకు 40 కోట్ల మందికి టీకా ఇచ్చారు. -
కరోనా చికిత్స : ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఫీజులపై పరిమితి
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో రోగుల చికిత్సకు లక్షలాది రూపాయలు వసూలు చేస్తుండటం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఢిల్లీ ప్రైవేట్ ఆస్పత్రుల్లో కోవిడ్-19 చికిత్స రేట్లను తగ్గించాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన అత్యున్నత కమిటీ సిఫార్సు చేసింది. నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే పాల్ నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీ రాజధాని వాసులకు ఊరట కల్పించే సిఫార్సులు చేసింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఐసోలేషన్ బెడ్‌కు రోజుకు రూ. 8000-10,000, ఐసీయూలో ఉండే రోగులకు రూ 13,000-15,000, వెంటిలేటర్‌పై చికిత్సకు రూ 15,000-18,000 వరకూ ప్రైవేట్ ఆస్పత్రులు వసూలు చేయవచ్చని ఈ కమిటీ పేర్కొంది. పీపీఈ ఖర్చులు కూడా కలిపి ఈ మొత్తానికి మించి ఏ ఒక్క ప్రైవేట్ ఆస్పత్రి వసూలు చేయరాదని సూచించింది. ప్రస్తుతం పలు ప్రైవేట్ ఆస్పత్రులు ఐసోలేషన్ బెడ్స్‌కు రూ 25,000, ఐసీయూల్లో రోగులకు రోజుకు రూ 40,000 వసూలు చేస్తుండగా, వెంటిలేటర్‌పై ఉన్న రోగులకు రోజుకు రూ 44,000-54,000 వరకూ వసూలు చేస్తున్నాయి. చదవండి : కరోనా ఎఫెక్ట్ : ఆ జంటకు డిజిటల్ విడాకులు -
గ్యాస్ వివాదాలపై నిపుణుల కమిటీ
న్యూఢిల్లీ: చమురు, గ్యాస్ రంగాల్లో పెట్టుబడులపై వివాదాలు ప్రతికూల ప్రభావం చూపిస్తున్న నేపథ్యంలో ఈ అంశంపై కేంద్రం దృష్టి సారించింది. సుదీర్ఘ న్యాయపోరు సమస్యలు లేకుండా నిర్దిష్ట కాలవ్యవధిలోగా ఇంధనాల అన్వేషణ, ఉత్పత్తి సంబంధ వివాదాల సత్వర పరిష్కారం కోసం ప్రత్యేకంగా నిపుణుల కమిటీని నియమించింది. ఇందులో చమురు శాఖ మాజీ కార్యదర్శి జీసీ చతుర్వేది, ఆయిల్ ఇండియా మాజీ సీఎండీ బికాష్ సి బోరా, హిందాల్కో ఇండస్ట్రీస్ ఎండీ సతీష్ పాయ్ సభ్యులుగా ఉంటారని కేంద్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్లో వెల్లడించింది. కమిటీ కాల వ్యవధి మూడేళ్ల పాటు ఉంటుంది. వివాదాలను కనిష్టంగా మూడు నెలల్లో పరిష్కరించే అవకాశం ఉంటుంది. మధ్యవర్తిత్వం ద్వారా భాగస్వాముల మధ్య లేదా కాంట్రాక్టరు.. ప్రభుత్వం మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరించడంపై ఈ కమిటీ దృష్టి పెడుతుంది. ఇందుకోసం థర్డ్ పార్టీ సర్వీసులను కూడా తీసుకోవచ్చు. ఆర్బిట్రేషన్ కోసం నిపుణుల కమిటీని ఆశ్రయించిన తర్వాత.. మళ్లీ ప్రత్యేకంగా కోర్టుకు వెళ్లడానికి కుదరదు. అయితే, పరస్పర అంగీకారంతో సమస్య పరిష్కార ప్రక్రియ వ్యవధిని పెంచుకోవచ్చు. నిర్దిష్టంగా చట్టపరమైన అంశాలు ఉంటే తప్ప ఆయా సంస్థల ఉద్యోగులు, ఉన్నతాధికారులే.. కమిటీ ముందు వాదనలు వినిపించవచ్చు. అడ్వొకేట్లు, కన్సల్టెంట్ల పాత్రేమీ ఇందులో ఉండదు. -
వికేంద్రీకరణకే మొగ్గు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందేలా అమరావతిలో శాసన రాజధాని(లెజిస్లేటివ్ క్యాపిటల్), విశాఖలో పరిపాలన రాజధాని(ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్), కర్నూలులో న్యాయ రాజధాని(జ్యుడీషియల్ క్యాపిటల్) ఏర్పాటు చేయాలని జీఎన్ రావు కమిటీ తన నివేదికలో సూచించింది. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, రాజధాని, పరిపాలన వికేంద్రీకరణపై ఏర్పాటైన ఈ నిపుణుల కమిటీ శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి 125 పేజీలతో కూడిన నివేదికను సమర్పించింది. రాష్ట్రంలోని 13 జిల్లాల సమగ్రాభివృద్ధి ప్రతిబింబించేలా నివేదికలో పలు సూచనలు చేసింది. విశాఖపట్నంలో సచివాలయం, సీఎం క్యాంపు కార్యాలయం, హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని, వేసవిలో అక్కడే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని పేర్కొంది. అమరావతిలో అసెంబ్లీ, గవర్నర్ కార్యాలయం, సీఎం క్యాంపు కార్యాలయం.. కర్నూలులో హైకోర్టు ఉండాలని సూచించింది. వరద ముంపులేని ప్రాంతం రాష్ట్రానికి రాజధానిగా ఉండాలని.. రాజధాని కార్యకలాపాల్ని వికేంద్రీకరించాలని సలహానిచ్చింది. కమిటీ మొత్తం సుమారు 10,600 కిలోమీటర్లు రాష్ట్రమంతా పర్యటించి రాజధాని, అభివృద్ధి అంశాలపై అధ్యయనం చేసింది. ముఖ్యమంత్రికి నివేదిక అందచేసిన అనంతరం కమిటీ కన్వీనరు జీఎన్ రావు, సభ్యులు విజయమోహన్, ఆర్.అంజలీ మోహన్, డాక్టర్ మహావీర్, డాక్టర్ సుబ్బారా>వు, కేటీ రవీంద్రన్, అరుణాచలంలు మీడియాతో మాట్లాడారు. (చదవండి : చేనేతలకు ఆపన్నహస్తం) కమిటీ ప్రధాన సిఫార్సులు.. ►మహారాష్ట్ర, జమ్మూకశ్మీర్‌లో ఉన్నట్టు రాష్ట్రంలో అమరావతి, విశాఖపట్నంలో శాసన(లెజిస్లేచర్) వ్యవస్థ ఉండాలి. అసెంబ్లీ అమరావతిలో ఉన్నా.. వేసవికాల సమావేశాలు విశాఖలో నిర్వహించాలి. విశాఖపట్నంలో సచివాలయం, హెచ్ఓడీ కార్యాలయాలు, సీఎం క్యాంపు కార్యాలయం, హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి. అమరావతిలో అసెంబ్లీతో పాటు హైకోర్టు బెంచ్, సీఎం క్యాంపు కార్యాలయం, రాజ్‌భవన్ ఉండాలి. శీతాకాల అసెంబ్లీ సమావేశాలు అమరావతిలో నిర్వహించాలి. ►అన్ని ప్రభుత్వ విభాగాలను ఒకేచోట ఉంచాల్సిన అవసరం లేదని కె.సి.శివరామకృష్ణన్ కమిటీ చెప్పింది. అమరావతిలో భూమి తీరు, వరద ప్రభావం తదితర అంశాల కారణంగా రాజధాని కార్యకలాపాల్ని ఇతర నగరాలకు వికేంద్రీకరించాలి. ఇక్కడ దాదాపుగా పూర్తైన నిర్మాణాలను వినియోగంలోకి తీసుకురావాలి. అమరావతిలో ప్రతిపాదిత నిర్మాణాల్ని తగ్గించాలి. ఎన్జీటీ ఆదేశాల ప్రకారం రివర్ ఫ్రంట్ నిర్మాణాలు ఉండరాదు. వరద ముంపు నుంచి రక్షణ కోసం చేపట్టిన నిర్మాణాలు పూర్తి చేయాలి. సీడ్ యాక్సిస్ రోడ్డును నేషనల్ హైవేకు అనుసంధానించాలి. ►శ్రీబాగ్ ఒడంబడికను గౌరవించేలా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి. ►పరిపాలన వికేంద్రీకరణ ద్వారా నిరుపేదల సమస్యలకు సత్వరం పరిష్కారం దొరుకుతుంది. ఉదాహరణకు.. శ్రీకాకుళంలో ఉండే ఒక పేదవాడు సమస్య పరిష్కారం కోసం రాజధాని వరకు రావాల్సిన అవసరం లేకుండా.. పరిపాలన వికేంద్రీకరణ జరగాలి. అమరావతి ప్రాంతంలో రాజధాని ఎలాగూ ఉంటుంది కాబట్టి, అక్కడ ఏ సమస్యా లేదు. ఇప్పటికే పెట్టిన పెట్టుబడి వృథా కారాదు అమరావతిలో కొన్ని ప్రాంతాలు వరద ముంపునకు గురవుతాయి... అందువల్ల రాజధానికి సంబంధించిన నిర్మాణాలు వద్దు. ఇప్పటికే పెట్టిన వ్యయం వృథా కాకుండా చూడాలి. తుళ్లూరు ప్రాంతంలో గత ప్రభుత్వం చాలా పెట్టుబడి పెట్టింది. అందువల్ల ప్రస్తుతం కొనసాగుతున్న నిర్మాణాల్ని పూర్తి చేసి శాఖల వారీగా వాడుకోవాలి. ప్రస్తుతం అమరావతిలో జరుగుతున్న పనులను సమీక్షించి తదనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి. మొత్తం నిధులు అమరావతిలోనే కేంద్రీకరించడం సరైంది కాదు. పర్యావరణ సమస్యలున్న చోట అభివృద్ధి పనులు తగ్గించాలి. అవసరం మేరకే క్వార్టర్లు, అపార్ట్మెంట్లు నిర్మించాలి. అమరావతిలో డిజైన్లన్నీ భారీ ఖర్చుతో కూడినవి కావడంతో వీటిని మార్చి.. ఉన్న వనరులతో మిగతా నిర్మాణాలు పూర్తయ్యేలా చూడాలి. డిజైన్లను మరోసారి పునఃపరిశీలించాలి. రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ నేపథ్యంలో అవసరాల మేరకు ప్రభుత్వ విభాగాల కోసం భవనాలు నిర్మించాలి. రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు అదే విధానం అవలంబించాలి. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించుకునేలా, రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ తర్వాత ఇక్కడ ఉండాల్సిన ప్రభుత్వ విభాగాలు కార్యకలాపాలు నిర్వహించుకునేలా ఏర్పాట్లు ఉండాలి. అమరావతి ప్రాంతంలో రైతులంతా తమకు భూములు ఇవ్వాలని కోరారు. అదే విషయాన్ని ప్రభుత్వానికి సూచించాం. 2 వేల మంది రైతులతో మాట్లాడాం: జీఎన్ రావు రాజధాని, అభివృద్ధి అంశాలపై కమిటీ సభ్యులమంతా అధ్యయనం చేశాం. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించాం. ప్రజాభిప్రాయ సేకరణకు అనుగుణంగా నివేదిక ఇచ్చాం. రాష్ట్రంలో చాలా ప్రాంతీయ అసమానతలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలు చాలా వెనకబడితే.. మరికొన్ని అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. వాటి మధ్య సమతూకం సాధించాలి. ఇందుకోసం రెండంచెల వ్యూహాన్ని సూచించాం. ఆంధ్రప్రదేశ్‌కు సుదీర్ఘమైన తీర ప్రాంతంతో పాటు పలు నదులు, అడవులు ఉన్నాయి. అభివృద్ధి వల్ల పర్యావరణం పాడవకుండా పలు సూచనలు చేశాం. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. అందుకే అన్ని ప్రాంతాల్ని దృష్టిలో పెట్టుకుని సూచనలు ఇచ్చాం. మాకు మొత్తం 38 వేల విజ్ఞాపనలు అందగా.. 2 వేల మంది రైతులతో నేరుగా మాట్లాడాం. జిల్లాలకు వెళ్ళి.. అక్కడి ప్రజలు ఏం కోరుకుంటున్నారో అన్న దానిపై ప్రజాభిప్రాయ సేకరణ చేశాం. వాటికి అనుగుణంగా అంతా ఒకేచోట కాకుండా అందరికీ అన్నీ అనుకూలంగా ఉండేలా సూచనలు చేశాం. సమగ్ర పట్టణాభివృద్ధి, ప్రణాళిక కోసం ప్రయత్నించాం. పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రాన్ని నాలుగు రీజియన్లుగా విభజించాలని సూచించాం. తుళ్లూరు ప్రాంతానికి వరద ముప్పు ఉంది. రాజధానికి అనుకూలం కాదు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన భూమిని ఇవ్వాలి. రాజధాని ఎక్కడో చెప్పడం మా పని కాదు. సుస్ధిర అభివృద్ధి లక్ష్యంగా ప్రాంతాల వారీగా అభివృద్ధి, సమతుల్యతపై కొత్త మాస్టర్ ప్లాన్ తయారు చేసి ప్రభుత్వానికి సిఫార్సు చేశాం. మేము రైతులతో మాట్లాడలేదన్నది అవాస్తవం. ప్రాంతీయ అసమానతల్ని తగ్గించాలి ‘ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మెరుగైన సూచనలు చేశాం. ఆంధ్రప్రదేశ్‌లో పట్టణీకరణ మధ్య, ఉత్తర కోస్తాలోనే ఉంది. అందువల్ల ప్రాంతాల మధ్య అభివృద్ధి– సమతూకంపై అధ్యయనం చేసి సూచనలిచ్చాం. అదే సమయంలో రాష్ట్రంలోని అభివృద్ధి వల్ల పర్యావరణం దెబ్బతినకూడదు. పర్యావరణాన్ని రక్షించుకుంటూనే అభివృద్ధి సాగాలి. రాష్ట్రంలో రాయలసీమ బాగా వెనకబడడంతో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా తీరానికి దూరంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. అడవుల్ని పరిరక్షించడంతో పాటు మరిన్ని పెంచాలి. వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చడాన్ని ప్రోత్సహించకూడదు. బీడు భూములను వినియోగంలోకి తీసుకురావాలి’ అని జీఎన్ రావు చెప్పారు. బోస్టన్ కన్సల్టెన్సీ నివేదిక వచ్చాకే... రాజధానిపై బోస్టన్ కన్సల్టెన్సీ నివేదిక కూడా వచ్చాకే.. జీఎన్ రావు కమిటీ నివేదికపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. మరో పది రోజుల్లో బోస్టన్ కన్సల్టెన్సీ నివేదిక రానుంది. ఈ రెండు నివేదికలపై ఒకేసారి మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉందని తెలిసింది. అందువల్ల ఈ నెల 27న జరిగే మంత్రివర్గ సమావేశంలో జీఎన్ రావు కమిటీ నివేదికపైనే చర్చించకపోవచ్చని సమాచారం. తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి రాష్ట్రంలోని విశాల తీర ప్రాంతంతో పాటు, శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు దాదాపు 900 కి.మీ. తీర ప్రాంతమంతా అభివృద్ధి చేయాలి. ఆర్థిక పురోగతితో పాటు, ఉపాధి కల్పన దిశగా పనులు చేపట్టాలి. గోదావరి, కృష్ణ, వంశధార, నాగావళి, మహేంద్రతనయ తదితర నదుల పరీవాహక ప్రాంతాలను అభివృద్ధి చేసి.. అక్కడ అన్ని వసతులు కల్పించాలి. ఈ ప్రక్రియలో భాగంగా కాలువల్ని అభివృద్ధి చేయడంతో పాటు కొత్త వాటి నిర్మాణం చేపట్టాలి. ►రాయలసీమలో అనంతపురం, కర్నూలు జిల్లాలను అభివృద్ధి చేయడం ద్వారా ప్రాంతీయ అసమానతలు తగ్గించేందుకు కృషి చేయాలి. అమరావతిలోని కొన్ని అధికార వ్యవస్థలను ఆ ప్రాంతానికి తరలించడం ద్వారా ఆ ప్రాంతం అభివృద్ధి చెంది అక్కడి ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ►అన్ని జిల్లాల్లోని సహజ వనరుల మేరకు సమగ్ర మార్గదర్శకాలను రూపొందించి అభివృద్ధికి ప్రణాళికలను రూపొందించాలి. ►గిరిజనులు, మత్స్యకార వర్గాలకు కూడా తగిన ప్రాధాన్యమిస్తూ వారి అభివృద్ధికి అనుగుణంగా పెట్టుబడి, అభివృద్ధి ప్రణాళిక తయారుచేయాలి. ►రాయలసీమలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను అత్యధిక ప్రాధాన్యమిచ్చి పూర్తి చేయాలి. ఆ ప్రాంతంలో జలవనరుల్ని పూర్తి సామర్థ్యం మేరకు సద్వినియోగం చేసుకోవాలి. ►పొడవైన తీర ప్రాంతంలోని వైవిద్య భరితమైన పర్యావరణం, మడ అడవులు, బీచ్‌ల్ని పరిరక్షిస్తూ అభివృద్ధి చేయాలి. ►పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ కొత్త పోర్టులు ఏర్పాటు చేయాలి. రెండు పోర్టుల మధ్య కనీస దూరం, రోడ్డు, రైలు సౌకర్యాల్ని దృష్టిలో పెట్టుకుని కొత్త పోర్టులు నెలకొల్పాలి. ►విద్యుత్ సరఫరా సమస్యలు తలెత్తకుండా, ప్రభుత్వమే సౌర విద్యుత్ ఉత్పత్తి, సరఫరాపై దృష్టి పెట్టాలి. ప్రాధాన్యతా క్రమంలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేయాలి ►పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుల పనులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాలి. తక్కువ వ్యయంతో పూర్తయ్యే ప్రాజెక్టులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. అనంతరం అధిక వ్యయంతో పూర్తయ్యే ప్రాజెక్టుల పనులను ప్రాధాన్యతా క్రమంలో చేపట్టి పూర్తి చేయాలి. తద్వారా ఎక్కువ ఆయకట్టుకు నీటిని అందించవచ్చు. ►డెల్టా కాలువల వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. లీకేజీలు అరికట్టి.. ఆయకట్టుకు సమర్ధంగా నీటిని అందించేందుకు కాలువల వ్యవస్థను ఆధునికీకరించాలి. ►పరీవాహక ప్రాంతం ఆధారంగా గొలుసుకట్టు చెరువులను మైక్రో వాటర్‌షెడ్ విధానంలో అభివృద్ది చేయాలి. నీటి యాజమాన్య పద్ధతులను అమలు చేసి.. అధిక ఆయకట్టుకు నీటిని అందించడంపై దృష్టి సారించాలి. ►రోడ్ల విస్తరణ వంటి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా చెట్లను నరికేస్తున్న నేపథ్యంలో భారీగా చెట్ల పెంపకాన్ని చేపట్టి.. పచ్చదనాన్ని పెంచాలి. ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు ఇవే.. 1. ఉత్తరాంధ్ర: శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం 2. మధ్య కోస్తా: తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా 3. దక్షిణ కోస్తా: గుంటూరు, ప్రకాశం, నెల్లూరు 4. రాయలసీమ: వైఎస్సార్, చిత్తూరు, కర్నూలు, అనంతపురం ►అన్ని ప్రాంతాల అభివృద్ధికి వనరులు,అవకాశాలకు అనుగుణంగా విస్తృత విధానాలు, వ్యూహాలు అమలు చేసి ప్రాంతీయ సమానాభివృద్ధి సాధించాలని కమిటీ ఆకాంక్షించింది. -
ప్రతిపక్షాలకు మేం జవాబుదారీ కాదు: బొత్స
సాక్షి, అమరావతి: అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. జీఎన్ రావు కమిటీ నివేదిక సందర్భంగా ఆయన శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, అయిదు కోట్ల ప్రజల ఆకాంక్షలే ముఖ్యమన్నారు.13 జిల్లాలను అభివృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ విధామన్నారు. ప్రజలకే తప్ప, తాము ప్రతిపక్షాలకు జవాబుదారీ కాదని మంత్రి బొత్స వ్యాఖ్యలు చేశారు. రూ.లక్ష కోట్లు పెట్టి రాజధాని నిర్మించే పరిస్థితిలో ప్రభుత్వం లేదని, అమరావతిని మాత్రమే అభివృద్ధి చేస్తే...మిగతా 12 జిల్లాల సంగతి ఏంటని ఆయన అన్నారు. చదవండి: అమరావతిలోనే అసెంబ్లీ, రాజభవన్ రైతుల ప్రయోజనాలు కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి బొత్స ...గత ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం ప్లాట్లను అభివృద్ధి చేసి ఇస్తామన్నారు. మంత్రి పెద్దిరెడ్డి అసైన్డ్ భూములపై మాత్రమే మాట్లాడారని తెలిపారు. అసైన్డ్ భూములు మాత్రం రైతులకు ఇచ్చేస్తామని తెలిపారు. రాజధాని ప్రకటనకు 2 నెలలకు ముందే హెరిటేజ్ భూములు కొనుగోలు చేసిందని, ఇది ఇన్సైడర్ ట్రేడింగ్ కాదా అని సూటిగా ప్రశ్నించారు. చుట్టాల కోసం టీడీపీ ప్రజల సొమ్ము దోపిడీకి పాల్పడిందని ధ్వజమెత్తారు. భూ సేకరణలో సేకరించిన భూములు ప్రభుత్వం వినియోగిస్తుందన్నారు. ప్రతిపక్షాల నేతలు రాజకీయాల కోసం ఏమైనా మాట్లాడతారని మండిపడ్డారు. ఏ అంశమైనా కేబినెట్లో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అమరావతిని ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతామని మంత్రి బొత్స తెలిపారు. అసెంబ్లీ, రాజ్‌భనవ్ ఇక్కడే ఉంటుందన్నారు. సీఎం క్యాంప్ కార్యాలయం విజయవాడలో కూడా ఉంటుందన్నారు. జీఎన్ రావు కమిటీలో అందరూ అవగాహన ఉన్న నిపుణులే అని, అన్ని పరిశీలించాకే నివేదిక ఇచ్చారన్నారు. తుది నివేదికను మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. -
విద్యుత్తు బస్సులతో ఇంధనం భారీగా ఆదా
సాక్షి, అమరావతి: ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడం వల్ల పెద్ద ఎత్తున ఇంధనం ఆదా అవుతుందని విద్యుత్తు బస్సులపై ఏర్పాటైన నిపుణుల కమిటీ తెలిపింది. వ్యయ నియంత్రణతోపాటు పర్యావరణ పరిరక్షణలోనూ ఎలక్ట్రిక్ వాహనాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొంది. ఆర్టీసీ విలీనంపై ఏర్పాటైన నిపుణుల కమిటీ శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌కు ఎలక్ట్రిక్ బస్సులపై నివేదిక సమర్పించింది. నిపుణుల కమిటీ చైర్మన్ ఆంజనేయరెడ్డి, కమిటీ సభ్యులతో పాటు, ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు తదితరులు ముఖ్యమంత్రిని కలసిన వారిలో ఉన్నారు. నిపుణుల కమిటీ సూచనలు ఇవీ... - ఆర్టీసీలో ఎలక్ట్రిక్ వాహనాలను పెద్దఎత్తున ప్రవేశపెట్టేందుకు ఆర్థిక వనరుల కోసం ‘పర్యావరణ పరిరక్షణ నిధి’తోపాటు ప్రత్యేకంగా ఈవీ (ఎలక్ట్రిక్ వెహికల్స్) బాండ్లు జారీ చేయాలి. - జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి తక్కువ వడ్డీకే రుణాలు పొందగలిగితే వీలైనంత త్వరగా ఆర్టీసీలో విద్యుత్ వాహనాలు ప్రవేశపెట్టవచ్చు. తద్వారా పెద్ద ఎత్తున ఇంధనాన్ని ఆదా చేసే అవకాశం ఉంది. - విద్యుత్ వాహనాల చార్జింగ్కు ప్రస్తుతం అందుబాటులో ఉన్న పవన విద్యుత్‌కు బదులుగా సౌర విద్యుత్‌ను వినియోగించే అవకాశాలను పరిశీలించాలి. ఇందుకోసం సంస్థ భవనాలపై సౌర ఫలకాలు ఏర్పాటు చేయాలి. ఈ ప్రక్రియలో సాంకేతిక, ఆర్థికపరమైన అంశాలు చూడాలి. - సంస్థలో పూర్తి స్థాయిలో విద్యుత్ వాహనాల వినియోగంతో ఆదా అయ్యే ఇంధనం విలువను నగదు రూపంలో పరిగణించి ఆ మొత్తాన్ని ఇంధన ధరలో రాయితీగా చూపితే తక్కువ వడ్డీకే సులభంగా రుణాలు పొందవచ్చు. - తిరుమలలో భక్తులకు ఉచితంగా సేవలందిస్తున్న డీజిల్ బస్సుల స్థానంలో వీలైనంత త్వరగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడితే టీటీడీ కాంక్షించే పర్యావరణ పరిరక్షణ సాకారమవుతుంది. - ఎలక్ట్రిక్ బస్సుల చార్జింగ్ కోసం అలిపిరితో పాటు కొండపైన స్థలం కేటాయించాలి. ఈ మేరకు ప్రభుత్వం టీడీడీకి సూచనలు జారీ చేయాలి. - రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ వాహనాలు ప్రవేశపెట్టడానికి ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీని నియమించి మూడు నెలలకు ఒకసారి సమావేశం నిర్వహించాలి. - స్థూల వ్యయ కాంట్రాక్టు (జీసీసీ)ల సమీక్ష కోసం తగిన యంత్రాంగం ఏర్పాటుతో కాంట్రాక్ట్ సమయంలో అవకతవకలకు తావు లేకుండా చేయవచ్చు. - ఆర్టీసీలో 350 ఎలక్ట్రిక్ బస్సుల చార్జింగ్ కోసం మౌలిక వసతుల కల్పనకు వెంటనే చర్యలు తీసుకోవాలి. - ‘ఫేమ్–2’ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రాధాన్య క్రమంలో చేపట్టాలి. -
రాష్ట్ర అభివృద్ధిపై నిపుణుల కమిటీ ఏర్పాటు
-
నిరక్షరాస్యత లేకుండా చూడడమే ముఖ్యమంత్రి ధ్యేయం
సాక్షి,విజయవాడ : విద్యాశాఖలో చేపట్టాల్సిన సంస్కరణలపై ఎక్స్పర్ట్ కమిటీ శనివారం మేధావులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్యాశాఖలో ఎటువంటి మార్పులు తెస్తే బాగుంటుదన్న అంశాలపై వివిధ సంఘాల ప్రతినిధులు కమిటీ సభ్యుల దృష్టికి తీసుకొచ్చారు. విద్యాశాఖ నిపుణుల కమిటీ సభ్యుడు వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యారంగంలో సమూలమైన మార్పులు తేవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భావిస్తున్నారని పేర్కొన్నారు. దీనికి సంబంధించి త్వరలోనే క్షేత్ర స్థాయిలో పర్యటన నిర్వహించి వివిధ పాఠశాలల స్థితిగతులపై నాలుగు నెలల్లో నివేదికను తయారు చేసి జగన్‌కు అందజేస్తామని తెలిపారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో కామన్ విద్యా విధానంతో పాటు, మౌళిక సదుపాయాలకు పెద్దపీఠ వేస్తామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో నిరక్షరాస్యత లేని ఆంధ్రప్రదేశ్‌ను చూడడమే ముఖ్యమంత్రి ధ్యేయమని వెంకట్‌రెడ్డి తెలిపారు. -
‘మాకేం జరిగినా చంద్రబాబుదే బాధ్యత’
అమరావతి: భూ సేకరణ పునరావాస, పునర్నిర్మాణ చట్టం-2013 ప్రకారం సామాజిక ప్రభావ అంచనా నివేదికపై నిపుణుల కమిటీ మంగళవారం ఉండవల్లిలో సమావేశం అయింది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు. మరోవైపు పోలీసులు భారీగా మోహరించారు. కాగా మీటింగ్ మినిట్స్ రాయాలని రైతులు పట్టుబట్టడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాజధానికి భూములు ఇవ్వాలని తమను బెదిరిస్తున్నారని రైతులు తెలిపారు. తమకు ఏం జరిగినా సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే బాధ్యత వహించాలని వారు అన్నారు. కాగా ఇప్పటికే ప్రభుత్వం అనేకసార్లు రైతులను మోసం చేస్తూ అప్పటికప్పుడు సమావేశం నిర్వహించడంతో రైతులు ఈ సమావేశాన్ని రైతులు బహిష్కరించిన విషయం తెలిసిందే. అలాగే 20 రోజుల క్రితం జరిగిన భేటీలో సైతం రైతులు అడిగిన ప్రశ్నలకు నిపుణుల కమిటీ సమాధానాలు చెప్పలేక అర్థాంతరంగా ముగించింది. -
జీవవైవిద్య మండలికి నిపుణుల కమిటీ
హైదరాబాద్ సిటీ: జీవ వైవిద్య మండలికి నిపుణుల కమిటీలను ఏర్పాటుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులను జారీ చేసింది. జీవి వైవిధ్య మండలి పరిరక్షణకు 8 నిపుణుల కమిటీలను ఏర్పాటుచేస్తూ ఉత్తర్వులను రాష్ట్రప్రభుత్వం వెల్లడించింది. వన్యమృగ సంరక్షణకు, జంతు, చేపల, ఆగ్రో, సంస్కృతి, ఆస్తుల పరిరక్షణ, వైద్య సంబంధ మొక్కల పరిరక్షణ, చైతన్య పరిచే కమిటీలను ఏర్పాటుచేసింది. ఈ కమిటీల్లో వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన ప్రతినిధులు సభ్యులుగా ఉంటారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నది. -
ఎన్టీఆర్ సుజల పథకం కోసం సాంకేతిక నిపుణుల కమిటీ
హైదరాబాద్: ప్రతి ఇంటికీ రెండు రూపాయలకే ఇరువై లీటర్ల మంచినీటి క్యాన్ అందజేసేందుకు ఉద్దేశించిన ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. పథకం అమలుకు విధివిధానాలు ఖరారు చేసేందుకు ముగ్గురు మంత్రుల ఉప సంఘం ఏర్పాటు కాగా.. మంత్రుల ఉప సంఘం ఈ సాంకేతిక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పంచాయితీ రాజ్ రిటైర్టు సీఈ ఆర్. కొండలరావు చైర్మన్‌గా మొత్తం 8 మందిని ఈ కమిటీలో సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వ కార్యదర్శి జవహర్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పథకం అమలులో నీటి శుద్ధి చేయడానికి ఏర్పాటు చేసే ఫ్లాంట్లకు ఎలాంటి మిషనరీలను ఉపయోగించాలి.. గ్రామాల్లో ఏర్పాటు చేసే ఫ్లాంట్‌కు ఎంత ఖర్చు అవుతుంది.. ఫ్లాంట్ నిర్వహణను మహిళా సంఘాలు, ఎన్జీవో సంస్థలను అప్పగిస్తే ఎలా ఉంటుందన్న తదితర అంశాలపై అధ్యయనం చేసి, వీలునుబట్టి జూలై పదవ తేదీలోగా కమిటీ తమ నివేదికను అందజేయాలని ప్రభుత్వం కోరింది. -
పీఎస్‌యూల విలీనంపై నిపుణుల కమిటీ
సాక్షి, హైదరాబాద్: వివిధ ప్రభుత్వరంగ సంస్థలు, కంపెనీలకు సంబంధించిన ముసాయిదా విలీన ప్రతిపాదనలపై ప్రభుత్వం నిపుణుల కమిటీని నియుమించింది. ఈ మేరకు పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి ప్రదీప్ చంద్ర శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. రిటైర్డ్ ఐఏఎస్ ఏకే గోయల్, ఆర్థిక నిపుణుడు కె. నరసింహమూర్తిలు సభ్యులుగా ఉండే ఈ కమిటీకి రిటైర్డ్ ఐఏఎస్ షీలా బిందే చైర్మన్‌గా వ్యవహరించారు. జూన్ 2 నుంచి ఈ కమిటీ పని ప్రారంభించనుంది.