న్యూఢిల్లీ: హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత దేశంలో 140 బిలియన్ డాలర్లకుపైగా సంపద ఆవిరైన నేపథ్యంలో మదుపర్ల ప్రయోజనాల పరిరక్షణ కోసం సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అదానీ–హిండెన్‌బర్గ్ వ్యవహారంపై విచారణ జరపడంతోపాటు మదుపర్ల ప్రయోజనాలను కాపాడేలా చర్యలను సిఫార్సు చేయడానికి ఆరుగురు సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది.
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే నేత్వత్వం వహించే ఈ కమిటీలో ఎస్‌బీఐ మాజీ చైర్మన్ ఒ.పి.భట్, బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జె.పి.దేవధర్, బ్రిక్స్ న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు, ఇన్ఫోసిస్ లిమిటెడ్ మాజీ అధినేత కె.వి.కామత్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) మాజీ అధినేత నందన్ నీలేకని, న్యాయవాది సోమశేఖర్ సుందరేశన్ సభ్యులుగా ఉంటారని తెలియజేసింది.
స్టాక్ ధరల్లో అదానీ గ్రూప్ అవకతవకలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై కొనసాగిస్తున్న విచారణను రెండు నెలల్లోగా పూర్తి చేసి, నివేదికను సీల్డ్ కవర్‌లో సమర్పించాలని సెబీని ఆదేశించింది. హిండెన్‌బర్గ్ నివేదిక, అదానీ గ్రూప్ అక్రమాలపై దాఖలైన వివిధ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్దివాలాల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల వల్ల మదుపరులు భారీగా నష్టపోయారని, మార్కెట్ ఒడిదొడుకుల కారణంగా వారు నష్టపోకుండా నియంత్రణ సంస్థలను బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలను సూచించడానికి ఆరుగురు సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది.
పెట్టుబడిదారులను చైతన్యవంతంచేయడానికి చేపట్టాల్సిన చర్యలను సైతం సిఫార్సు చేయాలని కమిటీకి స్పష్టంచేసింది. కమిటీ సభ్యులకు గౌరవ వేతనం చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదానీ గ్రూప్ వ్యవహారాలపై దర్యాప్తునకు కమిటీని నియమించడానికి తమకు అభ్యంతరం లేదంటూ గత విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించినసంగతి తెలిసిందే. కేసు దర్యాప్తు పూర్తి పారదర్శకంగా జరగాలని కోరుకుంటున్నామని, తామే నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని ధర్మాసనం ఇప్పటికే తేల్చిచెప్పింది. కాగా, కోర్టు నిర్ణయంపై గౌతమ్ అదానీ స్పందించారు. నిర్దిష్ట గడువులోగా ఈ వ్యవహారమంతా ఒక కొలిక్కి వస్తుందని భావిస్తున్నామని వెల్లడించారు. సత్యం గెలుస్తుంది అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment