విజయనగరం: సర్వేల పేరుతో ఎవరైనా ఇళ్లకు కొచ్చి ఆధార్ కార్డు, వివరాలు అడిగితే ప్రతిఘటించాలని ప్రజలకు వైఎస్సార్ సీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ సూచించారు. అధికార పార్టీ కార్యకర్తలు.. ఓటర్ల జాబితా ఉంచుకుని సర్వే చేస్తున్న నేపథ్యంలో అలాంటి వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించినట్టు తెలిపారు. మంగళవారం విజయనగరం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ... నిబంధనలకు విరుద్ధంగా సర్వే చేస్తున్నవారిపై ఫిర్యాదు చేస్తే తమ పార్టీ కార్యకర్తలపైనే పోలీసులు కేసులు పెడుతున్నారని వాపోయారు. సర్వే చేసే వాళ్లు ఆధార్ కార్డులు అడగటాన్ని.. ఒంటరిగా ఇళ్లల్లో ఉన్న మహిళలపై అసభ్యంగా ప్రవర్తించే ప్రమాదం ఉందని పోలీసు ఉన్నతాధికారులు దృష్టికి తెచ్చినట్టు తెలిపారు. ఈ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్టు చెప్పారు.
రాష్ట్రంలో వ్యవస్దలన్నీ నాశనం అయిపోతున్నాయని, ముఖ్యమంత్రి నుంచి కార్యకర్తల వరకు అధికార పార్టీకి దోచుకోవడమే లక్ష్యంగా మారిందని విమర్శించారు. రాష్ట్రంలో తాజాగా ప్రజాభిప్రాయం తమకు వ్యతిరేకంగా ఉందన్న వాస్తవాన్ని గ్రహించిన ప్రభుత్వం అభివృద్ధి అంటూ హడావుడి శంకుస్ధాపనలు చేస్తోందని ఆరోపించారు. నాలుగున్నరేళ్లుగా దోచుకోవడం తప్పా టీడీపీ ప్రభుత్వం చేసిందేమిలేదన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై అనేక కేసులు పెట్టి భయపెట్టే ప్రయత్నం చేశారని తెలిపారు. (సోషల్ మీడియా బృందం హల్‌చల్)
బీసీ డిక్లరేషన్ కోసం ఏడాదిగా తమ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు నిర్వహించిందని గుర్తు చేశారు. తమను చూసి చంద్రబాబు బీసీ సదస్సులు పెడుతున్నారని, ప్రజలను మోసం చేయడంలో ఆయన దిట్ట అని ఎద్దేవా చేశారు. వెయ్యి రూపాయల పింఛన్‌ను రెండు వేలు చేస్తామని వైఎస్ జగన్ హామీయిస్తే, దీన్ని వెంటనే చంద్రబాబు కాపీ కొట్టారని వెల్లడించారు. డ్వాక్రా మహిళలకు పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చిన దుర్మార్గమైన, అన్యాయమైన తొలి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడేనని దుయ్యబట్టారు. ఈబీసీలకు కేంద్రం పదిశాతం రిజర్వేషన్లు ప్రకటిస్తే దానిలో ఐదు శాతం రిజర్వేషన్లు కాపులకు ఇస్తామని చంద్రబాబు ప్రకటించడం మోసం చేయడమేనని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment