సాక్షి, హైదరాబాద్ : జన్మభూమి సభ అధికారిక కార్యక్రమం అని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ సభా వేదికపైకి రౌడీలను, గుండాలను ఎందుకు ఎక్కించారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. కడప జిల్లా పులివెందులలో జరిగిన జన్మభూమి సమావేశంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిపై టీడీపీ నేతలు, చంద్రబాబు ప్రవర్తించిన తీరును ఖండిస్తున్నామన్నారు. గురువారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ జన్మభూమి సమావేశం పేరుతో పోలీసులు అవినాష్‌రెడ్డిని గృహనిర్బంధం చేయాలని ప్రయత్నించారన్నారు. సభకు వచ్చిన ఎంపీని మాట్లాడనివ్వకుండా చంద్రబాబు అలా ప్రవర్తించడం, చేతిలో మైకు లాక్కోవడం ఏమిటని ప్రశ్నించారు. అసలు ఇది ప్రజాస్వామ్యమా లేక నియంత పాలననా అని నిలదీశారు. ముందు స్థానిక ఎంపీతో మాట్లాడించి తరువాత సీఎం మాట్లాడాలని అదే ప్రోటోకాల్ అని, కానీ చంద్రబాబు విరుద్ధంగా ప్రవర్తించారని ధ్వజమెత్తారు. అవినాష్‌రెడ్డి ఎవరినైనా నిందించారా లేక దుర్భాషలాడారా..! ఎందుకు ఆయన చేతిలో మైక్ లాక్కున్నారని బొత్స ప్రశ్నించారు.
'గండికోట నుంచి, పైడిపాలెం ప్రాజెక్టు నుంచి నీరు ఇస్తానని చెప్పారు. పైడిపాలెం ప్రాజెక్టు విలువ రూ. 700 కోట్లు ఉంటే చంద్రబాబు కేవలం రూ. 23 కోట్లే ఖర్చు చేశారు. గండిపేట ప్రాజెక్టుకు టీడీపీ ప్రభుత్వం ఖర్చు చేసింది రూ.72 కోట్లే కానీ, దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.11వందల కోట్లు ఖర్చు చేశారు. ఈ విషయాన్ని ఎంపీ అవినాష్‌రెడ్డి వేదికపై గుర్తు చేశారు. వాస్తవం మాట్లాడినందుకు చేతిలో మైక్ లాక్కుంటారా' అని బొత్స ధ్వజమెత్తారు. వైఎస్‌ఆర్ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసి దాదాపు పూర్తి చేశారని చంద్రబాబే చెప్పుకోవాలన్నారు.
4 లక్షల పెన్షన్లు, రేషన్ కార్డులు ఇస్తున్నామని చంద్రబాబు గొప్పులు చెబుతున్నారు. 2014లో మీరు అధికారంలోకి రాకముందు గత ప్రభుత్వం ఎంత మందికి పెన్షన్ ఇచ్చిందో మీ 4 లక్షలతో కలుపుకొని చూసుకుంటే మీ పెన్షన్ల కంటే ఎక్కువగానే ఉంటాయన్నారు.
తాంత్రిక పూజలపై విచారణ జరిపించాలి
టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందని బొత్స గుర్తు చేశారు. 'రాష్ట్రంలో అందరి ఇళవేల్పు వెంకటేశ్వరస్వామి, అదే స్థాయిలో బెజవాడ దుర్గమ్మ అంటే నమ్మకం. అలాంటి దుర్గ గుడి ప్రతిష్టను చంద్రబాబు దిగజార్చే విధంగా కార్యక్రమాలు చేస్తున్నారు. 26న దుర్గమ్మ గుడిలో తాంత్రిక పూజలు జరిగాయని, అదీ చంద్రబాబు కుటుంబ సభ్యులు చేయించారని అపవాదులు వచ్చాయి. ఇది ఒక రాజకీయ పార్టీదో.. ఒక వర్గానిదో కాదు. దీనిపై ముఖ్యమంత్రి, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదా? వారం రోజులు అవుతున్నా తాంత్రిక పూజల విషయంపై అతిగతి లేదు. వెంటనే దీనిపై విచారణ జరిపించాలి.
Comments
Please login to add a commentAdd a comment