
బోయనపాటి మమత
తిరుపతి మంగళం: తాను వైఎస్సార్‌సీపీలోనే కొనసాగుతానని ముత్యాలరెడ్డిపల్లి మాజీ సర్పంచ్ బోయనపాటి మమత స్పష్టం చేశారు. మంగళవారం ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. క్రమశిక్షణ.. విశిష్ట వ్యక్తిత్వం..ప్రజా సంక్షేమం కోసం నిరంతరం తపించే ఉద్యమ నాయకుడు భూమన కరుణాకరరెడ్డి సారథ్యంలో పనిచేస్తానని చెప్పారు. చిన్నతనం నుంచే పోరాట పటిమతో నాయకత్వ లక్షణాలను అలవరుచుకుని నాటి కాంగ్రెస్ నుంచి నేటి వైఎస్సార్ సీపీ వరకూ వెన్నెముకలా ఉంటూ నడిపిస్తున్న నాయకుడు భూమన తనకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. కులమతాలకతీతంగా అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగే ఆయన నేతృత్వంలో పనిచేయడం సంతోషకరమన్నారు.
మహిళలకు పార్టీలో ప్రత్యేక గౌరవాన్ని కల్పిస్తారని, అందుకు తనకు రాష్ట్ర పదవిని ఇవ్వడమే నిదర్శనమని అన్నారు. అనునిత్యం ప్రజల మధ్య ఉండాలనే కాంక్షతో గడప గడపకూ వెళ్లి సమస్యలను తెలుసుకుంటూ శ్రమిస్తున్న కరుణాకరరెడ్డి సారథ్యాన్ని తాను కోరుకుంటానని తెలిపారు. నాలుగు నెలలుగా వ్యక్తిగత కారణాలతో పార్టీకి దూరంగా ఉన్నానన్నారు. అంతేతప్ప పార్టీని వీడిపోలేదని స్పష్టం చేశారు. పదవికి రాజీనామా చేశానే తప్ప పార్టీకి కాదన్నారు. కొందరు తాను టీడీపీలోకి వెళుతున్నానని చేస్తున్న ప్రచారం సరికాదని తోసిపుచ్చారు. ప్రాణమున్నంత వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment