
సాక్షి, బెంగుళూరు : దళిత ఉద్యమ నేత గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీపై కర్ణాటకలో కేసు నమోదైంది. కర్ణాటకలోని చిత్రదుర్గంలో శుక్రవారం దళిత సంఘాలు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న జిగ్నేష్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో జిగ్నేశ్ మాట్లాడుతూ... మోదీ సభలో కుర్చీలు విసిరి గొడవలు సృష్టించాలని పలు వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి జయంత్ ఫిర్యాదు మేరకు చిత్రదుర్గం పోలీస్ స్టేషన్‌లో మేవానీపై ఐపీసీ సెక్షన్లు 153,188,117,34 కింద పలు కేసులు నమోదయ్యాయి.
కాగా కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 15న ప్రధాని మోదీ కర్ణాటకలో పర్యటన చేయనున్నారు. దేశంలో దళితులపై బీజేపీ ప్రభుత్వం దాడులు చేస్తుందని, మోదీ రాకకు నిరసనగా రాష్ట్రంలో జరిగే మోదీ సభలో దళిత సంఘాలు నిరసన వ్యక్తం చేయాలని జిగ్నేశ్ మేవానీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. మే 12న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల నేతలు ప్రచారం ముమ్మరం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment