బెంగళూరు : ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడపై కథనాన్ని రాసినందుకు కర్ణాటక సీనియర్ జర్నలిస్ట్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో పరాభవంతో సంకీర్ణ ప్రభుత్వం చిక్కుల్లో పడిన నేపథ్యంలో ఈ తాజా వివాదం మరింత దుమారం రేపుతోంది. జేడీఎస్ ఫిర్యాదు మేరకు కన్నడ దినపత్రిక అయిన విశ్వవాణి ప్రధాన సంపాదకుడు విశ్వేశ్వర్ భట్‌పై ఆదివారం పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఆయనపై పరువునష్టం, ఫోర్జరీ, చీటింగ్ అభియోగాలు మోపారు.
మండ్యాలో ఓటమి నేపథ్యంలో దేవెగౌడ, నిఖిల్ కుమారస్వామి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందంటూ విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ భట్ ఆదివారం ఓ కథనాన్ని ప్రచురించారు. గత శుక్రవారం మైసూరులోని ఓ హోటల్‌లో ఉన్న సమయంలో ఈ వాగ్వాదం జరిగిందని ఆ కథనం పేర్కొంది. మాండ్యాలో బీజేపీ మద్దతుతో పోటీ చేసిన సుమలత అంబరీష్ చేతిలో నిఖిల్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. మాండ్యా జేడీఎస్‌కు అత్యంత ప్రతిష్టాత్మకమైన సీటు. ఈ ఓటమితో నిఖిల్ కుంగిపోయారని, తన పెద్దనాన్న కొడుకు ప్రజ్వల్ రేవణ్ణ గెలుపొందడం.. తాను ఓడిపోవడం నిఖిల్‌ను తీవ్ర అసంతృప్తికి గురిచేసిందని, అంతేకాకుండా మాండ్యాలో తనకు కుటుంబం అంతగా సహకరించలేదని, దీంతో రాజకీయ కెరీర్ ఆరంభంలోనే ఓటమిపాలయ్యానని ఆయన తీవ్ర ఆవేదన చెందారని, ఒక మహిళ చేతిలో ఓడిపోవడం కూడా నిఖిల్‌ను మరింత అసహనానికి గురిచేసిందని ఆ కథనంలో భట్ పేర్కొన్నారు.
అయితే, తన కొడుకు ప్రతిష్టను దెబ్బతీసి.. డబ్బు వసూలు చేసేందుకే ఈ కథనాన్ని భట్ రాశారని జేడీఎస్ ఆరోపిస్తోంది. ఈ కథనాన్ని ట్వీట్ చేసిన కుమారస్వామి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు కుమారస్వామి తనకు ఫోన్‌చేశారని, నిఖిల్ కూడా రెండుసార్లు ఫోన్ చేసి బెదిరింపు ధోరణిలో మాట్లాడారని భట్ సోమవారం విలేకరులకు తెలిపారు. విశ్వవాణి పత్రిక సోమవారం నిఖిల్ వెర్షన్‌లో ఈ వ్యవహారంపై ఓ కథనాన్ని ప్రచురించింది. మరోవైపు కుమారస్వామి ప్రభుత్వం పత్రికాస్వేచ్ఛను హరిస్తోందని, అందుకు భట్‌పై కేసు నిదర్శనమని బీజేపీ మండిపడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment