
మంచిర్యాల క్రైం: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దమ్ముంటే 30 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదింపజేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి సవాల్ విసిరారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో రెండు రోజులుగా జరుగుతున్న సీపీఐ జిల్లా ద్వితీయ మహాసభల్లో సోమవారం ఆయన మాట్లాడారు. ప్రజలపై నీకు నమ్మకం, విశ్వాసమే ఉంటే ఎందుకంత భయమని ప్రశ్నించారు.
సమస్యలపై ప్రశ్నించే గొంతులను నొక్కుతూ ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ప్రజల బతుకులు బాగు పడుతాయని ఎన్నో కలలు కన్నారని, కానీ, కేసీఆర్ అనుచరులు, ఆయన కుటుంబసభ్యులు మాత్రం కోట్లు కూడ బెట్టుకున్నారని ఆరోపించారు. 2019 ఎన్నికల్లో బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీలను భూస్థాపితం చేయాలని ప్రజలకు చాడ పిలుపునిచ్చారు.